ETV Bharat / state

SCHOOLS REOPEN: బడి గంట మోగినా.. హాజరు అంతంత మాత్రమే!

author img

By

Published : Sep 2, 2021, 4:33 AM IST

విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతులకు మొదటి రోజు అంతంత మాత్రమే స్పందన కనిపించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 21.77శాతం హాజరు కాగా.. ఇంటర్ కాలేజీల్లో 16శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రైవేట్ పాఠశాలలకన్నా ఎక్కువగా సర్కారు బడుల్లోనే హాజరు నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 27.45 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 18.35 శాతం హాజరు నమోదైంది.

తొలి రోజు ప్రత్యక్ష తరగతులకు అంతంత మాత్రమే స్పందన
తొలి రోజు ప్రత్యక్ష తరగతులకు అంతంత మాత్రమే స్పందన

బడి గంటలు మోగినా.. తొలి రోజు హాజరైన విద్యార్థుల సంఖ్య స్వల్పమే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు బుధవారం పునఃప్రారంభం కాగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 శాతం మందే ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. ప్రాథమిక పాఠశాలలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. కొన్ని తరగతుల్లో ఒకరిద్దరే వచ్చారు. కరోనా నేపథ్యంలో కొద్ది రోజులు వేచిచూసే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఆన్‌లైన్‌లో పాఠాలు వింటుండటంతో పలువురు విద్యార్థులు సొంతూళ్లకు వెళ్లడం వంటి కారణాలతోనూ హాజరు పలుచగా ఉందని విద్యాశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హాజరైన విద్యార్థులు మాత్రం బడులు తెరవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు చాలావరకు బుధవారం పునఃప్రారంభం కాలేదు. వచ్చే వారం రోజుల్లో వాటిని తెరిచేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. కొన్నింటికి బస్సు సౌకర్యం లేకపోవడంతో పిల్లల్ని తల్లిదండ్రులు పంపించలేదు.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 21.77శాతం హాజరు కాగా.. ఇంటర్ కాలేజీల్లో 16శాతం విద్యార్థులు హాజరయ్యారు. ప్రైవేట్ పాఠశాలలకన్నా ఎక్కువగా సర్కారు బడుల్లోనే హాజరు నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 27.45 శాతం, ప్రైవేట్ పాఠశాలల్లో 18.35 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల 66 వేల 234 మంది ఉండగా... 5 లక్షల 39 వేల 674 మందివ విద్యార్థులు హాజరయ్యారు. పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రిప్రైమరీ, ప్రైమరీ తరగతులను ప్రారంభించలేదు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 17శాతం, రెండో సంవత్సరంలో 15 శాతం హాజరు నమోదైంది. విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీల్లో విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని లింబాద్రి తెలిపారు.

‘ప్రథమం’లో 17.. ‘ద్వితీయం’లో 15

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో బుధవారం తొలిరోజు 15 నుంచి 17% మంది విద్యార్థులే కళాశాలలకు హాజరయ్యారు. మొత్తం 405 కళాశాలల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 97,520 మందికిగాను 16,907 మందే(17%) వచ్చారు. వనపర్తి జిల్లాలో 2645 మందికి 115 మంది(4%) హాజరయ్యారు. రెండో ఏడాదిలో 84,038 మందికి 12,687 మంది(15%) హాజరయ్యారని ఇంటర్‌ విద్యాశాఖ తెలిపింది. మేడ్చల్‌ జిల్లాలో 1800 మందికిగాను ఒక్కరూ రాలేదు.

ఇదీ పరిస్థితి...

  • హైదరాబాద్‌ మూసాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 630 మందికిగాను 168 మంది విద్యార్థులు వచ్చారు. ఒకటో తరగతిలో 32 మందికి ముగ్గురు, రెండో తరగతిలో ఇద్దరు హాజరయ్యారు.
  • ఖైరతాబాద్‌ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ ఉన్నత పాఠశాలలో 149 మందికిగాను 29 మందే వచ్చారు.
  • సిద్దిపేట ఇందిరానగర్‌ హైస్కూల్‌లో 1200 మందికిగాను 730 మంది రావడం విశేషం. ఇక్కడ నాణ్యమైన విద్య అందుతుందని, కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటారని నమ్మకం ఉండటంతో అధిక సంఖ్యలో హాజరయ్యారని చెబుతున్నారు.
  • ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలోని తొమ్మిదో తరగతిలో 43 మంది విద్యార్థులకుగాను ఒకే ఒక్క బాలిక వచ్చింది. పాఠశాలలో 538 మంది విద్యార్థులుండగా.. 47 మంది మాత్రమే హాజరయ్యారు.
  • సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో 494 మందికిగాను 74 మంది హాజరయ్యారు. 9వ తరగతిలో 52 మంది విద్యార్థులుండగా ఒకే ఒక్కరు వచ్చారు.
  • నిజామాబాద్‌ నగర శివారులోని బోర్గాం(పి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మాధ్యమం 7వ తరగతిలో 28 మంది విద్యార్థులకుగాను ఒక్కరు, 9వ తరగతిలో 35 మంది విద్యార్థులకు ఇద్దరు హాజరయ్యారు.
  • కామారెడ్డి జిల్లా పిట్లంలోని ప్రాథమిక పాఠశాలలో 61 మంది విద్యార్థులుండగా ఒక్కరు మాత్రమే హాజరయ్యారు.
  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో 10 పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. బూరుగూడెం, నీలంపల్లి, వెంచంపల్లి, ముకునూరు, మోదేడు బడులకు మహాదేవపూర్‌ మండలంలోని 8 మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై వెళ్లాలని ఉన్నతాధికారులు సూచించినా వారెవరూ రాలేదు.

మాస్కులు పంచిన తమిళిసై

మాస్కులు పంచిన గవర్నర్​

రోనా నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పూర్తి సురక్షిత వాతావరణం కల్పించాలని.. పాఠశాలలను, ప్రాంగణాలను ప్రతిరోజు పరిశుభ్రం చేయాలని గవర్నర్‌ తమిళిసై అన్నారు. బుధవారం ఆమె రాజ్‌భవన్‌ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. వారికి మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘చాలా రోజుల తర్వాత పాఠశాలలకు విద్యార్థులు రావడం ఆనందంగా ఉంది. డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్‌ నిబంధనలను పాటించాలి’’ అని ఆమె అన్నారు.

ఇదీ చదవండి: Schools Reopened: రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభమైన పాఠశాలలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.