ETV Bharat / state

GANESHA: జోరుగా ప్రతిమల కొనుగోళ్లు.. గల్లీల్లో గణేశుల సందడి!

author img

By

Published : Sep 9, 2021, 10:00 AM IST

మహానగర వీధులన్నీ గణపతి విగ్రహాలతో కళకళలాడుతున్నాయి. బస్తీల్లో మండపాల నిర్మాణం జోరందుకొంది. విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. గతేడాది ఉత్సవాలకు దూరమైన నగరవాసులు.. ఈ ఏడాది పెద్దఎత్తున నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. మండపాల నిర్మాణంలో పెద్దగా ఆంక్షలు లేకపోవడంతో 2020 కంటే మండపాల సంఖ్య పెరగనుంది. మట్టి గణపతుల వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ఈ ఏడాది వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

GANESH: జోరుగా ప్రతిమల కొనుగోళ్లు.. గల్లీల్లో గణేశుల సందడి!
GANESH: జోరుగా ప్రతిమల కొనుగోళ్లు.. గల్లీల్లో గణేశుల సందడి!

నగరంలో వినాయక చవితి సందడి మొదలైంది. గత ఏడాది నష్టాల దృష్ట్యా ఈసారి, ఏటా అమ్ముడయ్యే విగ్రహాల్లో 60 శాతం మాత్రమే తయారు చేయగా.. అన్నీ అమ్ముడయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. 2018లో 43 వేలు, 2019లో 55 వేలు ప్రతిష్ఠించగా గతేడాది 25 వేలే నిలబెట్టారు.

స్వామికి భారీ కండువా..

ఖైరతాబాద్‌ మహాగణపతికి సమర్పించేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన 60 అడుగుల కండువా, జంధ్యం, గరికమాల పట్టు వస్త్రాలను బుధవారం పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌, గౌరవ అధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలే స్వాములు ప్రదర్శించారు.

100 నిమజ్జన కేంద్రాలు..

మహా గణపతి నిమజ్జనోత్సవానికి నగరం సిద్ధమవుతోంది. శోభాయాత్ర సాగే 400 కి.మీ. పొడవున రోడ్లకు మరమ్మతులు, నిమజ్జన కేంద్రాల వద్ద విద్యుద్దీపాల ఏర్పాటు, క్రేన్లను సిద్ధం చేయడం ప్రారంభమైంది. ఈ దఫా నిమజ్జన కేంద్రాలను వందకు పెంచడం ద్వారా రెట్టింపు చేశారు. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 36 కేంద్రాలు, మరో 32 పెద్ద, మధ్య స్థాయి చెరువులు, 28 నిమజ్జన కోనేరుల వద్ద ఏర్పాట్లు మొదలయ్యాయి. ట్యాంక్‌బండ్‌పై గతంలో 27 క్రేన్లు ఏర్పాటవుతుండగా, ఆ సంఖ్యను 16కి తగ్గించనున్నట్లు సమాచారం.

మేయర్‌ ఆకస్మిక పర్యటన..

గణేశ్‌ ఉత్సవాలకు జీహెచ్‌ఎంసీ చేసిన ఏర్పాట్లను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి బుధవారం పరిశీలించారు. ఖైరతాబాద్‌ ఉత్సవ కమిటీ ప్రతినిధులతో మాట్లాడారు. ఖైరతాబాద్‌ మహాగణపతికి దారితీసే రోడ్డు పొడవునా ఉన్న తోపుడు బండ్లు తొలగించడంలో స్థానిక పెద్దలు చొరవ తీసుకోవాలని సూచించారు. ఓ చోట భవనం కూల్చివేతలు, బారికేడ్లు ఉండటంపై అధికారులను ప్రశ్నించారు. స్థానిక కార్పొరేటర్‌ విజయారెడ్డికి చెందినదని చెప్పడంతో ఎవరిదైనా సరే.. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. పర్యటనలో జోనల్‌ కమిషనర్లు, ఉపకమిషనర్‌, ఎస్‌ఈ తదితర అధికారులు పాల్గొన్నారు.

ద్విచక్ర వాహనాలపై పర్యటించండి..

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. అంబర్‌పేట, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, బషీర్‌బాగ్‌ ప్రాంతాల్లో పర్యటించి.. అక్కడి రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చడం సహా ధ్వంసమైన రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని జోనల్‌ కమిషనర్లను కోరారు. బుధవారం జోనల్‌ కమిషనర్లతో మేయర్‌ తన ఛాంబర్‌లో సమీక్షించారు. ప్రతి వినాయక మండపం వద్ద ఒక చెత్తకుండీ ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులందరూ మోటార్‌ సైకిళ్లపై రహదారులపై తిరిగి గుంతలను గుర్తించాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ బి.సంతోష్‌, జోనల్‌ కమిషనర్లు రవికిరణ్‌, అశోక్‌ సామ్రాట్‌, ఉపేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మమత, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: TS Floods: సాధారణం కన్నా అధిక వర్షపాతం.. ముంపులోనే పలు ప్రాంతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.