ETV Bharat / state

పబ్బుల్లోకి మైనర్లు.. నిబంధనలు పట్టించుకోని నిర్వాహకులు

author img

By

Published : Feb 25, 2023, 4:39 PM IST

Minors Entry into Pubs: న‌గ‌రాల్లో ఉన్న యువ‌త‌కు పబ్​లు, పార్టీలు కొత్తేం కాదు. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా విందు, వినోదాలు చేసుకుంటారు. ముఖ్యంగా వారాంతాల్లో ఎంజాయ్ చేయ‌డానికి ప‌బ్బులే వారికి వేదిక‌లు. అయితే వాటిల్లోకి వెళ్లాలంటే క‌నీస వ‌య‌సు నిబంధ‌న‌లుంటాయి. కానీ కొంద‌రు వాటిని లెక్క‌చేయ‌కుండా మైన‌ర్ల‌ను సైతం అనుమ‌తిస్తున్నారు.

Minors Entry
Minors Entry

Minors Entry into Pubs: మెట్రో పాటిట‌న్ నగరాల్లో పార్టీల‌ సంస్కృతి కొత్తేం కాదు. ఒకప్పుడు సంపన్న కుటుంబాల‌కే పరిమితమైన విందు, వినోదాలు.. ఈ మధ్య కాలంలో మధ్య తరగతి యువతకూ అల‌వాట‌య్యాయి. ఉద్యోగం, వ్యాపారంలో వ‌చ్చే మానసిక ఒత్తిడి నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు మ‌త్తు ప‌దార్థాల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. సిగ‌రెట్‌, మ‌ద్యం లాంటి వాటికి ద‌గ్గ‌ర‌వుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అంతకు మంచి ఆనందాన్ని ఆస్వాదించేందుకు అమ్మాయిలను జతగా చేసుకుంటున్నారు.

అయితే ఎంజాయ్ అనే ముసుగులో కొన్ని దారుణాలు జ‌రుగుతున్నాయి. మైనర్లను పబ్​లు, బార్ అండ్ రెస్టారెంట్ల‌కు అనుమతించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా... కొందరు నిర్వాహ‌కులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. పలు మార్లు కేసులు నమోదు చేసినా ప‌రిస్థితిలో మార్పు లేదు. బాల బాలికలకు అనుమతినిస్తున్నారు. దీనికి తోడు పుట్టినరోజు వేడుకలు, ఇత‌ర‌ ప్రత్యేక సందర్భాల్లో రాయితీ ఇచ్చి ప్రోత్సహించటం విశేషం.

గతేడాది జూబ్లీహిల్స్​లో పబ్ వద్ద మైనర్లపై జరిగిన సామూహిక అత్యాచారం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాదాపూర్​లోని ఒక పబ్​లో ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసులో అరెస్టైన ప్రముఖ వ్యాపార వేత్త, డీజే ఈవెంట్ నిర్వాహకుడు ప్రయివేటు పార్టీలను ఏర్పాటు చేసి యువతకు మత్తు ప‌దార్థాలు అలవాటయ్యేలా చేస్తున్నాడు. అంతర్జాతీయ డీజేలతో సంబంధాలున్న మోహిత్ అగర్వాల్ అలియాస్ మైదాన్ మోహిత్ ఏర్పాటు చేసే ఈవెంట్ కు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి.

నగరంలోని పలు పబ్బ‌ులు, ఫామ్ హౌస్​లు, రిసార్టుల్లో వారాంతాల్లో నిర్వహించే పార్టీల్లో ఒంటరిగా వెళ్లే అబ్బాయిలకు అక్కడే నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. శని, ఆదివారాల్లో సుమారు 10 నుంచి 20 మంది యువతులను ఒక ప‌బ్బు నిర్వాహకులే రోజుకు రూ.2000- రూ.5000 కమీషన్ ఇచ్చి అబ్బాయిలను ఆకట్టుకునే ఏర్పాట్లు చేస్తున్నట్టు గతంలోనూ ఆరోపణలున్నాయి.

గతేడాది డిసెంబరులో నగర శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్​లో పోలీసుల సోదాల్లో యువతీ, యువకులు పట్టుబడ్డారు. వారి వద్ద గంజాయి, మద్యం సీసాలు లభించాయి. పార్టీ కోసం తమను రప్పించారంటూ వారు పోలీసులకు చెప్పారు. గతంలో హైద‌రాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్​కు భయపడి వ్యభిచారిణులను పార్టీకు రప్పించటం మానేశారు. దాన్ని భర్తీ చేసేందుకు వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ పేరుతో పబ్బు, క్లబ్బుల‌కు వచ్చే అమ్మాయిల్లో ఆసక్తి ఉన్న వారితో నిర్వాహకులు ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. వారితో డ్యాన్స్ చేసేందుకు మొదట్లో అవకాశం కల్పించి, క్రమంగా డ్రగ్స్ అలవాటు చేసి.. లైంగిక అవసరాలు తీర్చుకునేంత‌గా చేరిందంటూ పోలీసులు తెలిపారు.

నగరంలో అక్కడక్కడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తున్నా.. పూర్తి ఆధారాలు లభించలేదంటున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతులకు డ్రగ్స్ ముఠాలు ఎరవేసి.. మాదక ద్రవ్యాలు స‌ర‌ఫ‌రా చేసి అలవాటు చేసేందుకు వినియోగిస్తున్నట్టు సమాచారం.

ఇవీ చదవండి:

లవర్‌తో క్లోజ్‌గా ఉంటున్నాడని... ఫ్రెండ్‌ను కిరాతకంగా చంపాడు

హానికర ఇంజెక్షన్‌ వేసుకుని పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఎంజీఎంలో కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.