ETV Bharat / state

TRS MLAs Poaching Case: పోలీసులకు రోహిత్​రెడ్డి సిగ్నల్‌.. ఆ ఒక్క మాటతో రంగంలోకి ఖాకీలు!

author img

By

Published : Oct 29, 2022, 7:27 AM IST

TRS MLA: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు నిర్వహించిన రహస్య ఆపరేషన్‌ కీలక ఆధారాల్ని సేకరించింది. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందస్తుగానే పోలీసులు ఈ స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఇందుకుగాను రోహిత్​రెడ్డి ఫాంహౌస్‌లో కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలను అమర్చి సంభాషణల్ని రికార్డు చేశారు. సుమారు మూడు గంటలపాటూ సాగిన సమావేశాన్ని చిత్రీకరించారు.

TRS MLA
TRS MLA

TRS MLA: సంచలనం సృష్టించిన ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో పోలీసులు నిర్వహించిన రహస్య ఆపరేషన్‌ కీలక ఆధారాల్ని సేకరించి పెట్టింది. తనను ప్రలోభపెట్టేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారంటూ తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముందస్తుగానే రంగంలోకి దిగిన పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.

రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలను అమర్చి సంభాషణల్ని రికార్డు చేశారు. సుమారు మూడు గంటలపాటూ సాగిన సమావేశాన్ని చిత్రీకరించారు. పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదికలో ఈ ఆపరేషన్‌ సాగిన తీరును సవివరంగా పేర్కొన్నారు.

పైలట్‌ కుర్తా జేబుల్లో వాయిస్‌ రికార్డర్లు: ఫాంహౌస్‌ హాలులో పోలీసులు ముందస్తుగా ఎలక్ట్రానిక్‌ స్పై గాడ్జెట్స్‌ అమర్చారు. రెండు వాయిస్‌ రికార్డులను పైలట్‌కు ఇచ్చారు. కుర్తా రెండు జేబుల్లో వాటిని అమర్చారు. అనంతరం నిందితులను ఆహ్వానించేందుకు పైలట్‌ మెయిన్‌రోడ్డు వరకు వెళ్లారు. నిందితులతో డీల్‌ పూర్తయ్యాక తాము వచ్చేందుకు సిగ్నల్‌ ఇవ్వాలని పోలీసులు రోహిత్‌కు సూచించారు. అందుకు ‘నారియల్‌ పానీ లాయియే..(కొబ్బరి నీళ్లు తీసుకురండి)’ అనే సంకేతం పెట్టుకున్నారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌ తన సిబ్బందితో కలిసి సమీపంలో వేచి ఉన్నారు.

* మధ్యాహ్నం 3.05 గంటలకు హాలులోని ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ను ఆన్‌ చేశారు.

* 3.10 గంటలకు టీఎస్‌ 34బి 5678 ఫార్చునర్‌ కారులోరోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌కుతిరిగివచ్చారు.

* టీఎస్‌ 07హెచ్‌ఎం 2777 కారును నందుకుమార్‌ నడుపుతూ రాగా.. అందులోనే రామచంద్రభారతి, సింహయాజి ఉన్నారు.

* సమావేశం మధ్యలో 4.10 గంటలకు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్‌, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావు ఫార్చునర్‌ కారు (టీఎస్‌ 07బీడబ్ల్యూ 6289)లో అక్కడికి వచ్చారు.

* సుమారు మూడున్నర గంటలపాటు సమావేశం జరిగింది. అనంతరం ముందస్తు పథకం ప్రకారం పైలట్‌ ‘నారియల్‌ పానీ లాయియే..’ అంటూ సిబ్బందికి పురమాయించారు.

* తమకు సంకేతం అందగానే ఏసీపీ గంగాధర్‌.. ముగ్గురు ఇన్‌స్పెక్టర్‌తో కలిసి హాలులోకి ప్రవేశించారు.

* దర్యాప్తు క్రమంలో ఎమ్మెల్యేలు తమను తాము పరిచయం చేసుకున్నారు. నిందితుల వివరాలు సేకరించిన అనంతరం అక్కడికి ఎందుకొచ్చారని పోలీసులు అడిగితే సమాధానం చెప్పలేకపోయారు. పైలట్‌ మాత్రం తన ఫిర్యాదులోని అంశాల గురించి వివరించారు. కుట్రను బహిర్గతం చేసేందుకు బలమైన ఆధారాల కోసం మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలను రప్పించినట్లు చెప్పడంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* ఎంతగా ప్రశ్నించినా సమాధానం చెప్పేందుకు నిందితులు సహకరించకపోవంతో ఏసీపీ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు.

* ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లలో రికార్డయిన సంభాషణలను నిందితుల ముందే వినిపించారు. ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇచ్చేందుకు నిందితులు జరిపిన సంభాషణలు బహిర్గతమయ్యాయి.

* ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.

కర్ణాటక, దిల్లీల్లో ఎలా చేశామంటే: ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభాలకు గురిచేశామనే అంశం గురించి రామచంద్రభారతి చెప్పిన సంభాషణలు నమోదయ్యాయి. కర్ణాటక, దిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి ఆపరేషన్లు చేశామో భారతి వివరించారు. అలాగే తుషార్‌తో రామచంద్రభారతి సంభాషణలు నిక్షిప్తమయ్యాయి. భాజపాలో సంతోష్‌ ప్రాధాన్యమేమిటనే అంశంపై చర్చించారు. ఈ సంభాషణల గురించి ప్రస్తావించగా.. నిందితులు మౌనంగా ఉండిపోయారు.

‘విటమిన్‌’ అవసరమంటూ వాట్సప్‌ సంభాషణలు: నిందితుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతి ఉపయోగించిన ఫోన్‌ (7075779637), వాట్సప్‌ నంబర్‌ (8762090655)గా తేలింది. అతడి కాంటాక్టు జాబితాలో భాజపా నేత సునీల్‌కుమార్‌ బన్సాల్‌ నంబరు 9455114069గా నమోదై ఉంది.

* ఫాంహౌస్‌కు వచ్చిన రోజు మధ్యాహ్నం 11.52 గంటలకు భారతి తన ఫోన్‌ నుంచి ‘తెలంగాణ గురించి ఒక ముఖ్య విషయం మాట్లాడాలి. దయచేసి నన్ను ఎన్ని గంటలకు ఫోన్‌ చేయమంటారో, ఎక్కడ చర్చించవచ్చో చెప్పండి’.. అని బన్సాల్‌కు మెసేజ్‌ పంపించినట్లు గుర్తించారు.

* సంతోష్‌తో కలిసి అత్యవసరంగా హైదరాబాద్‌ రావాలని.. ఆపరేషన్‌ గురించి తుషార్‌కు చెప్పాలని.. మరో ముగ్గురితో కలిసి పైలట్‌ సిద్ధంగా ఉన్నారని.. నందుకుమార్‌ మెసేజ్‌ పంపించినట్లుగా ఉంది.

* రామచంద్రభారతి వద్ద మరో ఐఫోన్‌ (9110662741) లభ్యమైంది. అందులో తుషార్‌ వెల్లపల్లి కేరళ ఎస్‌ఎన్‌డీపీ పేరుతో 9388881111 నంబరు నమోదై ఉంది. అలాగే 9849912345 నంబరు డా. నందుకుమార్‌ కోరే, హైదరాబాద్‌ పేరిట ఉంది.

* ఆ ఫోన్‌ నుంచి సంతోష్‌ బీజేపీ పేరిట ఉన్న కాంటాక్టుకు ఇంగ్లిష్‌లో పంపిన మెసేజ్‌లను గుర్తించారు. ‘నేను రామచంద్ర స్వామీజీని. హరిద్వార్‌ బైఠక్‌లో మిమ్మల్ని కలిశాను. తెలంగాణలో కీలకాంశాల గురించి చర్చించాలి. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. నా పరిధిలో మొత్తం 40 మంది నేను చెప్పేది వింటారు. ఇదివరకు చెప్పినట్లుగా పైలట్‌ రోహిత్‌రెడ్డి (లీడర్‌), హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు పార్టీ మారతామంటున్నారు. మీ అపాయింట్‌మెంట్‌ అవసరం. అంతకంటే ముందు ‘ఆ ముగ్గురికీ కొంత విటమిన్‌’ అవసరం. అనే మెసేజ్‌లున్నాయి.

27 పేజీల్లో రాజకీయ పరిణామాల చిట్టా: నందుకుమార్‌ ఫోన్‌ (9849912345)లో 9110662741, 7075779637, 8762090655 నంబర్లు స్వామి ఆర్‌సీబీ ఆర్‌ఎస్‌ఎస్‌ పేరుతో నమోదై ఉన్నాయి. పైలట్‌ రోహిత్‌రెడ్డి (957799999) నంబర్‌ ఉంది. రామచంద్రభారతితో నందుకుమార్‌ జరిపిన వాట్సప్‌ సంభాషణల్లో తెరాస, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 50 మంది ఎమ్మెల్యేల జాబితా ఉంది. నిందితుల కారులో డైరీ, ల్యాప్‌టాప్‌ దొరికాయి. నందుకుమార్‌కు చెందిన 27 పేజీల్లో తెలంగాణ రాజకీయ పరిణామాలకు సంబంధించిన సమాచారముంది.

* ‘ప్లాసర్‌ ఇండియా రైల్వే మెషినరీ మాన్యుఫాక్చరర్‌’ లేబుల్‌ కలిగిన డైరీ దొరికింది. భారతికి చెందిన ఆ డైరీలో ఆక్టోబరులో అతడు జరిపిన ప్రయాణాల వివరాలు స్వదస్తూరితో ఉన్నాయి. ఈ నెల 26న ‘దిల్లీ టు హైదరాబాద్‌.. అపాయింట్‌మెంట్‌ అండ్‌ మీటింగ్‌ యాజ్‌ డైరెక్టెడ్‌ బై నందూ.. రిటర్న్‌ టు దిల్లీ’ అని ఉంది.

* సింహయాజి అలియాస్‌ సోమయాజులు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ఎయిర్‌ ఇండియా విమానంలో వచ్చిన టికెట్‌ లభించింది.

ఏడాదిన్నర కిందట వరకు తిరుపతిలోనే సింహయాజి: తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారన్న కేసులో నిందితుడు సింహయాజి కొంతకాలం తిరుపతిలో నివసించారు. ఆయన తల్లితండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సుమారు అయిదేళ్ల కిందట తిరుపతి కపిలతీర్థం రోడ్డులోని భారత్‌ నిలయం (అపార్ట్‌మెంట్‌)లో అద్దెకు దిగారు. ఏడాదిన్నర కిందట వరకు ఆ అపార్ట్‌మెంట్‌లోనే ఉన్న ఆయన కుటుంబం తరువాత ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. సింహయాజి పోలీసులకు ఇచ్చిన చిరునామాలో ఇప్పటికీ అదే అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు పేర్కొనడం గమనార్హం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.