దేశంలో భాజపా విద్వేషం సృష్టిస్తుంటే.. తెరాస సహకరిస్తుంది: రాహుల్​గాంధీ

author img

By

Published : Oct 28, 2022, 10:36 PM IST

Rahul Gandhi

Bharat Jodo Yatra in Narayanapet: తెలంగాణలో రాచరిక పాలన కొనసాగుతోందని.. ప్రజలను దోచుకోవటమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో పేదలకు పంచిన లక్షలాది ఎకరాల భూములను తిరిగి లాక్కుంటుందన్న ఆయన.. దేశంలో భాజపా విద్వేషం సృష్టిస్తుంటే, దానికి తెరాస సహకరిస్తుందన్నారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా.. నారాయణపేట జిల్లాలో కూడలి సమావేశంలో మాట్లాడిన రాహుల్‌.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే గిరిజనులకు, దళితులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

'అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీని మళ్లీ అమలు చేస్తాం.. దేశమంతా ఒకే జీఎస్టీ'

Bharat Jodo Yatra in Narayanapet: రాష్ట్రంలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మూడో రోజు నారాయణపేట జిల్లా మరికల్ మండలం ఎలిగండ్ల శివారు నుంచి ప్రారంభమైంది. మరికల్, తీలేరు గేటు, పెద్దచింతకుంట గేటు మీదుగా లాల్‌కోట చౌరస్తాకు చేరుకుంది. నారాయణపేట జిల్లా నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలోప్రవేశిస్తున్న రాహుల్ పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణులు లాల్‌కోట వద్ద ఘనస్వాగతం పలికాయి.

లాల్‌కోట నుంచి బండర్‌వల్లి మీదుగా గోప్లాపూర్‌కు చేరుకున్నాక రాహుల్‌గాంధీ భోజన విరామం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల్ని టీపీఆర్‌టీయూ నేతలు రాహుల్ దృష్టికి తీసుకువెళ్లారు. భోజన విరామంలో చేనేత, పోడు రైతుల ప్రతినిధులతో సమావేశమై.. తమ సమస్యలు వివరించారు. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను తిరిగి తీసుకుంటున్నారని గిరిజనులు రాహుల్‌కు మొరపెట్టుకున్నారు.

పోడు రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా రాహుల్ భరోసా ఇచ్చారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. సాయంత్రం 4 గంటలకు గోప్లాపూర్ నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కాగా.. దేవరకద్ర రాహుల్‌కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సంప్రదాయ నృత్యాలు, కోలాటం, డప్పువాయిద్యాలతో స్వాగతం పలికారు.

అనంతరం, దేవరకద్ర మీదుగా మన్యంకొండ వరకూ పాదయాత్ర కొనసాగింది. మన్యంకొండలో జరిగిన కూడలి సమావేశంలో ప్రజలనుద్దేశించి మాట్లాడిన రాహుల్‌గాంధీ.. భాజపా, తెరాస పాలనాతీరుపై విమర్శలు గుప్పించారు. దేశంలో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ హింసను ప్రేరేపిస్తుంటే వాటికి తెరాస సహకరిస్తుందని విమర్శించారు. నిరుద్యోగం సమస్య పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులను జీఎస్టీ సంక్షోభంలోకి నెట్టిందన్నారు.

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం తీరుపై తీవ్రవిమర్శలు చేసిన రాహుల్‌గాంధీ.. తనకు దక్కిన భూముల లెక్కకోసం ప్రతిరోజు సాయంత్రం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ చూస్తుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు భూములు పంచిందని.. వాటిని తిరిగి లాక్కోవటంపైనే కేసీఆర్‌ దృష్టి సారించారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులకు, గిరిజనులకు వారి భూములపై హక్కులు కల్పిస్తామని రాహుల్‌ హామీ ఇచ్చారు. ధరణితో జరిగే తప్పులను సరి చేస్తామన్న ఆయన.. అటవీహక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. రైతు రుణమాఫీని మళ్లీ అమలు చేస్తామని.. దేశమంతా ఒకే జీఎస్టీ ఉండేలా చూస్తామని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.