ETV Bharat / state

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా.. దొరికితే ఇక జైలుకే..!

author img

By

Published : Mar 10, 2023, 9:52 PM IST

Police Files Charge sheets against Drunk and Drivers : మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డిపే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ముఖ్యంగా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఈ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. అయితే పోలీసులు ఇలాంటి వారిపై కొర‌ఢా ఝుళిపిస్తున్నారు. వారి మీద కేసులు పెడుతూ ఛార్జ్ షీట్లు న‌మోదు చేస్తున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా.. దొరికితే ఇక జైలుకే..!
డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా.. దొరికితే ఇక జైలుకే..!

Police Files Charge sheets against Drunk and Drivers: రాష్ట్రవ్యాప్తంగా మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డిపే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇంత‌కు ముందు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌కే ప‌రిమిత‌మైన ఈ సంస్కృతి.. క్ర‌మంగా మిగ‌తా ప్రాంతాల‌కూ విస్త‌రిస్తోంది. మ‌ద్యం మ‌త్తులో బండి న‌డ‌ప‌డం వ‌ల్ల అనేక ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని అరిక‌ట్ట‌డానికి పోలీసులు న‌డుం బిగించారు. ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా త‌నిఖీలు చేస్తున్నారు. దొరికిన వారిపై కేసులు న‌మోదు చేసి కోర్టుల్లో హాజ‌రుప‌రుస్తున్నారు.

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్ర‌త్యేక న‌జ‌ర్ పెట్టారు. వారి పరిధుల్లో త‌నిఖీలు చేప‌డుతున్నారు. వారాంతాల్లో మ‌రిన్ని త‌నిఖీలు చేస్తున్నారు. ఇందులో ప‌ట్టుకున్న వారిపై కేసులు న‌మోదు చేసి కోర్టు ముందు నిల‌బెడుతున్నారు. ఛార్జ్ షీట్లు దాఖ‌లు చేసి వారికి శిక్ష‌లు ప‌డేలా చేస్తున్నారు. వీరితో పాటు ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తున్న వారిపైనా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

శిరస్త్రాణాలు ధ‌రించ‌కుండా వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లు స‌క్రమంగా లేక‌పోవ‌డం, నంబ‌ర్లు క‌నిపించ‌డ‌కుండా చేయ‌డం, మైనర్లు వాహనాలు నడపడం, సిగ్న‌ల్ క్రాసింగ్, జంపింగ్, రాంగ్ రూట్​లో వెళ్ల‌టం, ట్రిపుల్ రైడింగ్, ఇత‌ర ట్రాఫిక్ నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డం లాంటివి చేసే వారినీ ప‌ట్టుకుంటున్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్​లో ప‌ట్టుకున్న వారిపై కేసులు న‌మోదు చేస్తున్నారు. అంతేకాకుండా ఛార్జ్ షీట్లు దాఖ‌లు చేసి కోర్టులో నిల‌బెడుతున్నారు.

గ‌త నెలలో జరిగిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనఖీల్లో రెండు వేల మందికి పైగా వాహనదారులను ప‌ట్టుకున్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ 2,965 మంది పోలీసుల చేతికి చిక్కారు. వారిపై పోలీసులు 4360 ఛార్జ్‌షీట్లు కోర్టుల్లో దాఖలు చేశారు. వీరిలో 371 మంది వాహనదారులకు జైలు శిక్ష పడింది. అత్యధికంగా ఏడుగురికి 15 రోజులు.. కోర్టు జైలు శిక్ష విధించగా, అత్యల్పంగా ముగ్గురికి ఒక రోజు జైలు శిక్ష పడింది. శిక్ష పడిన వారందరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు.

దొరికిన వారిలో 58 మంది వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేశారు. దొరికిన వారికి మొత్తం రూ.94,33,300 జరిమానా విధించారు. ఈ నేప‌థ్యంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ట్రాఫిక్‌ పోలీసు అధికారులు తెలిపారు. ఒక‌వేళ ఎవ‌రైనా మ‌ద్యం తాగితే.. వాహ‌నం వారే న‌డ‌ప‌కుండా స్నేహితుల‌కు ఇవ్వాల‌ని సూచించారు. తనిఖీల్లో దొరికిన వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మ‌రో సారి ఇలాంటివి చేయ‌కుండా వారికి కౌన్సెలింగ్ ఇస్తామ‌ని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.