ETV Bharat / state

నివర్‌ కష్టాలు.. కాఫర్‌ డ్యాం మూత

author img

By

Published : Dec 9, 2020, 9:14 AM IST

ఏపీ గోదావరి డెల్టా ప్రాంతంలో ఈసారి రబీ సాగుపై కొంత సందిగ్ధత నెలకొంది. పోలవరం కాఫర్‌ డ్యాం మిగిలిన భాగాన్ని నిర్మించేందుకు మార్చి నెలాఖరు తర్వాత రెండోపంటకు (రబీకి) నీరివ్వబోమని జలవనరులశాఖ ప్రకటించడంతో రైతుల్లో తర్జనభర్జన మొదలైంది.

POLAVARAM
నివర్‌ కష్టాలు.. కాఫర్‌ డ్యాం మూత

ఆంధ్రప్రదేశ్​లోని గోదావరి డెల్టా ప్రాంతంలో ఈసారి రబీ సాగుపై కొంత సందిగ్ధత నెలకొంది. పోలవరం కాఫర్‌ డ్యాం మిగిలిన భాగాన్ని నిర్మించేందుకు మార్చి నెలాఖరు తర్వాత రెండోపంటకు (రబీకి) నీరివ్వబోమని జలవనరులశాఖ ప్రకటించడంతో రైతుల్లో తర్జనభర్జన మొదలైంది. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో నివర్‌ తుపాను కారణంగా రైతాంగం అతలాకుతలమైంది. అనేక చోట్ల ఖరీఫ్‌ సాగు గట్టెక్కలేదు. కొన్నిచోట్ల కోతలు పూర్తికాలేదు. ఈ పరిస్థితుల్లో రెండో పంట మార్చి నెలాఖరుకు పూర్తి చేయడం ఎంతవరకు సాధ్యమన్న సందేహం రైతుల్లో నెలకొంది. రబీ పంటకు సంబంధించి డిసెంబర్‌ మొదటి వారానికి నారుమళ్లు పూర్తి చేసుకుని, నెలాఖరుకు నాట్లు వేయాలని అధికారులు స్పష్టం చేశారు. అలా నాట్లు వేయని రైతులు సాగు మానుకోవాలని కొన్నిచోట్ల చెబుతున్నారు. పోలవరం కాఫర్‌ డ్యాం నిర్మాణంతో పాటు, చాలినంత నీరు గోదావరిలో లభ్యమయ్యే పరిస్థితులూ కనిపించకపోవడం రబీ పంటకు ఒక సవాలుగా మారింది.

సాధారణంగా ఏప్రిల్‌ రెండోవారం వరకు సాగుకు రబీ కాలంలో నీరు ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత 15 రోజుల పాటు మంచినీటికి, చేపల చెరువులకు అవసరమైన నీరు సరఫరా చేసి... వేసవిలో కాలువలు బంద్‌ చేస్తుంటారు. ఈసారి కాఫర్‌ డ్యాంను మార్చి 31 కల్లా మూసివేస్తే... ఆ తర్వాత గోదావరిలో జలాలు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. రబీ కాలంలో తూర్పుగోదావరిలో 4,36,533 ఎకరాలు, పశ్చిమగోదావరిలో 4,60,000 ఎకరాలు సాగు చేస్తుంటారు. రబీ పంటలకు, తాగునీటి అవసరాలకు కలిపి 90.22 టీఎంసీల నీరు అవసరం ఉంది. ప్రస్తుతం గోదావరిలో 68.55 టీఎంసీలు మాత్రమే రబీ పంట కాలంలో అందుబాటులో ఉంటాయని జలవనరులశాఖ అధికారులు లెక్కించారు. ఈ లెక్కన మొత్తం సాగు సాధ్యం కాదు. కేవలం మొత్తం ఆయకట్టులో 80శాతానికి పైగా నీరు అందించడం సాధ్యమవుతుందని పేర్కొంటూనే వంతుల వారీ విధానం, డ్రెయిన్లకు అడ్డుకట్టలు వేయడం వంటి మార్గాల ద్వారా మరికొంత నీరు తీసుకోవచ్చని అంచనా వేశారు.

120 రోజుల్లో పంట పూర్తి చేసే స్వల్పకాల వంగడాలే సాగు చేయాలని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌లో కొందరు రబీ విత్తనంగా తూర్పుగోదావరిలో బొండాలు సిద్ధం చేసుకున్నారు. అది 135 రోజుల పంట. అసలు బొండాలు విత్తనం అమ్మవద్దని అధికారులు విత్తన దుకాణాలకు చెప్పారు. పశ్చిమగోదావరిలో 1121 రకం సాగు చేసుకుంటే దిగుబడి బాగుంటుందని, పౌరసరఫరాలశాఖ కొనుగోలుకు వీలుంటుందని చెబుతున్నారు. అయితే రైతులు సాధారణంగా తమ అలవాటుకే కట్టుబడి ఉంటారు. ఈ పరిస్థితుల్లో మార్చి 31లోగా సాగు ఎలా సాధ్యం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇదీ చూడండి: నేడు భారత్​ బయోటెక్​కు విదేశీ రాయబారులు, హైకమిషనర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.