రైతులకు శుభవార్త.. త్వరలోనే అందుబాటులోకి వన్​ స్టాప్​ షాప్ సేవలు

author img

By

Published : Jan 9, 2023, 2:44 PM IST

farmers

One stop shop services: రైతులకు రాష్ట్ర సర్కార్​ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో వన్ స్టాప్ షాప్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. క్షేత్రస్థాయిలో రైతాంగం అవసరాలు దృష్టిలో పెట్టుకుని టీఎస్ ఆగ్రోస్ సంస్థ నడుం బిగించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిందుకు చర్యలకు ఉపక్రమించింది. హైదరాబాద్‌లో జరిగిన ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులు, పలు వ్యవసాయ కంపెనీల ప్రతినిధుల సమావేశంలో.. పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ ఏడాది రాబోయే వానాకాలంలో ప్రయోగాత్మకంగా పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు చేసి అన్ని రకాల ఉపకరణాలు ఒకే చోట రైతులకు అందించాలని నిర్ణయించడం విశేషం.

One stop shop services: రైతులకు రాష్ట్ర సర్కారు తీపికబురు అందించింది. వ్యవసాయ రంగంలో వన్‌ స్టాప్ షాప్ సేవలు అందించేందుకు సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో విత్తనం నుంచి పంట కోతల వరకు రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఓ అడుగు ముందుకు వేసి ఆ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానుంది. తాజాగా హైదరాబాద్‌ నాంపల్లి హాకా భవన్‌లో టీఎస్ ఆగ్రోస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.రాములు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కీలక సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమంలో విత్తన, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, పనిముట్లు, యంత్ర పరిశ్రమల ప్రతినిధులు, ఆగ్రోస్ సేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు, వన్ నేషన్ - వన్ మార్కెట్‌ తరహాలో వన్ స్టాప్ షాప్ సేవలు అందించేందుకు అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధాన ఆహార పంట వరిసహా వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, పప్పుధాన్యాలు, ఇతర పంటల విత్తనాలు, ట్రాక్టర్లు, హర్వెస్టర్లు, ప్లాంటర్లు, ఇతర భూసార పరీక్షల సేవలు సైతం అందించేందుకు అవసరమైన శిక్షణ కూడా ఇప్పించాలని నిర్ణయించారు.

ఒకే చోట రైతు ఉత్పత్తులన్ని లభ్యం: ఇందుకు సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి.. ఔట్‌లెట్ నమూనా ఏ రీతిలో తీర్చిదిద్దాలి.. ఏయే కంపెనీలతో అనుగుణంగా ఒప్పందాలు చేసుకోవాలి అన్న అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వన్ స్టాప్ షాప్‌ అనే గొడుకు కింద వ్యవసాయం సంబంధించి అనేక విభిన్న సేవలు గ్రామీణ రైతులకు అందించే లేదా ఒకే చోట అనేక విభిన్న ఉత్పత్తులను విక్రయించే వ్యాపార సంస్థ తీర్చిదిద్దడం తమ లక్ష్యమని కె. రాములు అన్నారు.

గత ఏడాది అక్టోబరులో వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీం ప్రధాని మోదీ ఆవిష్కరించిన నేపథ్యంలో రైతులకు ప్రయోజనం కలుగనుంది. పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలు, ఇండియన్ ఎడ్జ్ అనే ఇ-మ్యాగజైన్‌ ఆవిష్కరించిన తరుణంలో దేశీయ, అంతర్జాతీయ ఎరువులకు సంబంధించి ఇటీవల పరిణామాలు, ధరల పోకడలు, విశ్లేషణ, లభ్యత, వినియోగం, రైతుల విజయగాథలు వంటి సమాచారం పొందొచ్చు. వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ స్కీమ్ కింద రాయితీ కింద అందిస్తున్న అన్ని యూరియా, డి-అమ్మోనియం ఫాస్ఫేట్ - డీఏపీ, మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ - ఎంఓపీ, ఎన్‌పీకే వంటివి దేశవ్యాప్తంగా ఒకే బ్రాండ్ భారత్ కింద విక్రయిస్తారు.

వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్: కేంద్రం ఈ పథకం ప్రారంభించడం వల్ల భారత్ యూరియా, భారత్ డీఏపీ, భారత్ ఎంఓపీ, భారత్ ఎన్‌పీకే వంటి పేర్లతో అమ్మకాలు జరగనున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఒకే రకమైన బ్యాగ్ డిజైన్‌ ఉండటం వల్ల హేతుబద్ధీకరణ జరుగుతుంది. అంటే ఒకే రకమైన ఎరువులు అన్నీ తప్పనిసరిగా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ - ఎఫ్‌సీఓ నిర్దేశించిన పోషకాలను కలిగి ఉండాలి. వివిధ బ్రాండ్‌లకు చెందిన ఒకే ఎరువులో ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఈ నేపథ్యంలో దేశంలో తొలిసారిగా తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న దృష్ట్యా.. పల్లెల్లో చిల్లర మార్కెట్‌లో టీఎస్ ఆగ్రోస్ బ్రాండ్‌పై విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ఉత్పత్తులు విక్రయించడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని కంపెనీల ప్రతినిధులు తెలిపారు.

ఉదాహరణకు డీఏపీని ఏ కంపెనీ తయారు చేసినా కూడా అందులో ఒకేరకమైన పోషక పదార్ధాలను కలిగి ఉండాలి. అన్ని బ్రాండ్లకు చెందిన డీఏపీ ఎరువుల్లో తప్పనిసరిగా 18 శాతం నత్రజని, 46 శాతం భాస్వరం ఉండాల్సిందే. "వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్" ద్వారా రైతుల్లో ఎరువుల ఎంపికల్లో ఏ విధమైన గందరగోళం ఉండదు. రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం దృష్ట్యా రెండేళ్ల కిందట ఆగ్రోస్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆ సంస్థ.. వ్యవసాయ పట్టభద్రులైన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతోపాటు ఔత్సాహిక వ్యాపారులుగా తీర్చిదిద్దుతోంది.

అందుబాటులోకి వస్తే రైతు సమయం ఆదా: ఈ క్రమంలో 33 జిల్లాల్లో 1000 పైగా ఆగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఉపకరణాలు అందజేస్తూ అన్నదాత సేవలో నిమగ్నమైంది. వన్ స్టాప్ షాప్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లైతే రైతు సమయం వృధా తగ్గిపోతుంది. అన్నీ ఒకే చోట సరసరమైన ధలరకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని, ఈ కాన్సెఫ్ట్‌ ఎంతో బహుళ ప్రయోజకరంగా ఉంటుందని ఆగ్రోస్ సేవా కేంద్రాల యజమానులు చెప్పారు.

వన్‌ స్టాప్ షాప్ కింద సిద్ధిపేట, సూర్యాపేట, జనగాం, యాదాద్రి భువనగిరి తదితర 10 జిల్లాల నుంచి ఒక్కొక్కరి చొప్పున 10 మంది ఆగ్రోస్ నిర్వాహకులను సంస్థ ఎంపిక చేసింది. మార్కెట్ సర్వే ఆధారంగా వచ్చే ఖరీఫ్‌ నుంచి పైలట్ ప్రాజెక్టు కింద వన్ స్టాప్‌ షాప్‌లు నెలకొల్పి రైతులకు బహుళార్థక సేవలందించేందుకు సిద్ధం చేస్తుండటం విశేషం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.