ETV Bharat / state

TS Transfers: కొత్త ఉద్యోగాల భర్తీకి ముందే సాధారణ బదిలీలు

author img

By

Published : Mar 17, 2022, 5:02 AM IST

Transfers
Transfers

TS Transfers: రాష్ట్రంలో కొత్తగా 80,039 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇతర నియామక సంస్థలు నోటిఫికేషన్లకు సిద్ధమవుతున్నాయి. ఆ ప్రక్రియ పూర్తయ్యేలోపే నియామకాలు జరిగే శాఖల్లో ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. త్వరలో భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల్లో తొలుత ఉన్నతస్థాయి పోస్టుల ఫలితాలు వెల్లడైన తరువాతే, కిందిస్థాయి పోస్టుల ఫలితాలు ప్రకటించాలని గురుకుల, విద్యాశాఖలు భావిస్తున్నాయి.

TS Transfers: రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తై... వారు విధుల్లో చేరడానికి ముందే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నఉద్యోగులకు సాధారణ బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది. సీనియర్లకు ప్రాధాన్య స్థానాలిచ్చి తద్వారా ఏర్పడే ఖాళీలను కొత్త వారికి ఇవ్వాలని భావిస్తోంది. మే-జూన్‌లో ఇది జరగవచ్చని అంచనా. జనవరిలో కొత్త జోనల్‌ విధానం కింద ఉద్యోగుల బదలాయింపు జరగ్గా.. జిల్లా స్థాయిలోని వారు కొత్తస్థానాల్లో చేరారు. జోనల్, బహుళ జోనల్‌లో బదిలీ అయిన వారు ఈ నెలాఖరులో చేరనున్నారు. పరస్పర బదిలీలు నెలాఖరు వరకు పూర్తికానున్నాయి. అప్పీళ్లు, భార్యాభర్తల వినతుల మేరకు అర్హులైన మరికొందరికి ఏప్రిల్‌ తొలివారంలో బదిలీలకు అవకాశం లభిస్తుంది.

సాధారణ బదిలీల్లో కౌన్సెలింగ్‌..

కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగుల కేటాయింపు కింద జరిగిన బదిలీల్లో జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో పలు ఖాళీల్లో ప్రస్తుత ఉద్యోగులను నియమించలేదు. 13 ముఖ్యమైన జిల్లాల్లో అధికశాతం పట్టణాలు, జిల్లా కేంద్రాలకు దగ్గరలో ఉండే పలు పోస్టులు ఖాళీగా ఉండగా వాటికి బదిలీలు జరగలేదు. వచ్చే సాధారణ బదిలీల్లో కౌన్సెలింగ్‌ ద్వారా వాటిని భర్తీ చేస్తారు. మిగిలిన ఖాళీలను కొత్త ఉద్యోగులతో నియమిస్తారని తెలుస్తోంది.

పకడ్బందీ విధానం...

రాష్ట్రంలో త్వరలో భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టుల్లో ఖాళీలు మిగలకుండా పకడ్బందీ విధానం అవలంబించాలని నియామక సంస్థలు భావిస్తున్నాయి. తొలుత ఉన్నతస్థాయి పోస్టుల ఫలితాలు వెల్లడైన తర్వాతే, కిందిస్థాయి పోస్టుల ఫలితాలు ప్రకటించాలని... గురుకుల, విద్యాశాఖలు భావిస్తున్నాయి. గురుకులాల్లో డిగ్రీ ప్రిన్సిపల్‌ తరువాత డిగ్రీ లెక్చరర్‌ ఫలితాలు ప్రకటిస్తారు. అలాగే పాఠశాల ప్రిన్సిపల్, జూనియర్‌ లెక్చరర్, పీజీటీ, టీజీటీ కేటగిరీల్లో ఒకదాని తరువాత మరో కేటగిరీ ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థులు ఒకే విద్యార్హతలతో రెండుకు మించి పోస్టులకు రాతపరీక్షలు రాసే అవకాశం ఉండటంతో ఆ దిశగా యోచిస్తున్నాయి.

ఎక్కువగా ఉపాధ్యాయ కేటగిరీ పోస్టులు...

టీఎస్​పీఎస్సీ అమలు చేస్తున్న రీలింక్విష్‌మెంట్‌... అంటే ఒక అభ్యర్థి ఎక్కువ పోస్టులకు ఎంపికైనప్పుడు ఒక పోస్టు మినహా మిగిలినవి స్వచ్ఛందంగా వదులుకునే నిబంధన అన్ని నియామకాల్లో పాటించేలా గురుకుల బోర్డుతో పాటు మిగతా నియామక సంస్థలు అమలుచేసేలా... ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఖాళీల్లో ఎక్కువగా ఉపాధ్యాయ కేటగిరీ పోస్టులున్నాయి. పీజీ, డిగ్రీ, ఎంఈడీ, బీఈడీ, డీఎస్సీ అర్హతలతో కూడిన పోస్టులు దాదాపు 23 వేల వరకు ఉన్నాయి. ప్రిన్సిపల్‌ కేటగిరీ నుంచి ఎస్​జీటీ, టీజీటీ వరకు లక్షలాది మంది పోటీపడనున్నారు.

ఇదీ చూడండి: Govt Jobs: ఒకటికి మించి పోస్టులకు ఎంపికైతే.. ప్రభుత్వం పక్కా ప్రణాళిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.