ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు

author img

By

Published : Jan 1, 2023, 6:51 AM IST

Updated : Jan 1, 2023, 7:38 AM IST

New Year Celebrations in Telangana: రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా నిర్వహించిన కార్యక్రమాలు ఆద్యంతం అలరించాయి. చిన్నాపెద్దా ఉత్సాహంగా ఆడిపాడారు. కొత్త ఏడాది అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువతులు చేసిన నృత్యాలు ఆద్యంతం అలరించాయి.

New Year celebrations
New Year celebrations

రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన నూతన సంవత్సర వేడుకలు

New Year Celebrations in Telangana: కొత్త ఏడాది తెలంగాణతో పాటు దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని, దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలు, పాలనకు నాందిగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని సీఎం తెలిపారు.

2023 నూతన సంవత్సరం తెలంగాణతో పాటు దేశ ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని, దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలు, పాలనకు నాందిగా నిలవాలని సీఎం కోరుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రజలు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొని విజయాలు సాధించాలని గవర్నర్‌ తమిళిసై ఆకాంక్షించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఐఏఎస్ శిక్షణా సంస్థ నిర్వాహకులు బాలలతతో కలిసి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఇంటర్‌లో ప్రతిభ చూపిన పాత్రికేయుల పిల్లలకు ప్రోత్సాహక స్కాలర్‌షిప్‌లు మంత్రి అందజేశారు. బాలలత రూ.5 లక్షలతో ప్రోత్సాహక నగదు పురస్కారాలు ఇస్తున్న దృష్ట్యా తాను కూడా రూ.5 లక్షలు ఆ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఆసియా బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్- 2023పేరుతో హైదరాబాద్‌ బేగంపేట్‌లోని కంట్రీక్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా సాగాయి. యువతరాన్ని ఉర్రూతలూగించేలా "అలోహా థీమ్" పేరుతో సాగిన ఈ వేడుకలో సినీ నటి స్నేహాగుప్తాతో పాటు మరికొందరు తారల నృత్య ప్రదర్శనలు డిజే ఆసిఫ్ సంగీత హోరుతో హుషారెక్కించారు. టాలీవుడ్, బాలీవుడ్ మ్యూజిక్ సంగీత హోరులో వీక్షకులు డాన్స్‌లు కేరింతలతో ఉల్లాసంగా గడిపారు. కుటుంబసభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి జయేశ్‌ రంజన్‌ కేకు కట్‌ చేసి, కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ పంజాగుట్టలోని సాయిబాబా ఆలయంలో నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు భక్తులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్ క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలను సినీప్రముఖులు ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు కోదండరామిరెడ్డి, నటి రోజారమణి దంపతులు, హాస్యనటుడు బాబుమోహన్‌ను ఎఫ్​ఎన్​సీసీ కమిటీ సభ్యులు సన్మానించారు. మాదాపూర్ కే-కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వేడుకల్లో గాయనీగాయకులు యశస్వీ, వైష్ణవి, ప్రజ్ఞలు తమ పాటలతో అలరించారు.

ఎల్బీనగర్ చౌరస్తాలో రాచకొండ నూతన సీపీ దేవేంద్రసింగ్ చౌహాన్, అదనపు సీపీ సుధీర్‌బాబు, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌తో పాటు సిబ్బందితో కలిసి కేక్‌ కట్‌ చేశారు. నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో పోలీసులు పనిచేయాలని ఆయన కోరారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర పాల్గొన్నారు. సిబ్బందితో కలిసి కేక్ కట్‌ చేసిన ఆయన కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో హైదరాబాద్ సీపీ సీవీ.ఆనంద్‌ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. పలువురు పోలీసుల అధికారులతో కలిసి కేక్ కట్ చేసిన సీపీ నూతన సంవత్సర శుభకాంక్షలు తెలిపారు. నేరాల నియంత్రణ కోసం గతేడాది పోలీసులు ఎంతగానో కృషిచేశారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన కోరారు.

జిల్లాల్లోనూ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా సాగాయి. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రిలోని మాంటిస్సోరి పాఠశాలలో విద్యార్థినులకు రంగవల్లి పోటీలు నిర్వహించారు. హనుమకొండలో న్యూ ఇయర్ వేడుకలు వైభవంగా జరిగాయి. 2022కు వీడ్కోలు పలుకుతూ 2023కు యువత స్వాగతం పలుకుతున్న సందర్భంగా నగంలోని పలుకళాశాల విద్యార్థులు ఆటాపాటలతో సందడి చేశారు.

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా రాష్ట్రంలో పోలీసులు ప్రత్యేక భద్రతాచర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఫ్లైఓవర్ల మూసివేత, చౌరస్తాల్లో పోలీసుల పహారా ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని వివిధచోట్ల ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబులు చుక్కలు చూపించారు. బేగంపేట్‌లోని ప్రగతిభవన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా... పలువురు వాహనదారులు ట్రాఫిక్‌పోలీసులతో వాగ్వాదానికి దిగి... హంగామా చేశారు. శ్వాస విశ్లేషణ పరీక్షల్లో దొరికిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి మెట్రోస్టేషన్‌ వద్ద, లోయర్‌ ట్యాంక్‌బండ్‌తో పాటు కట్టమైసమ్మ ఆలయం వద్ద పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ పరీక్షలు జరిపి దాదాపు 50మందిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో మద్యం మత్తులో పలువురు యువకులు పోలీసులతో గొడవకు దిగారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 1, 2023, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.