ETV Bharat / state

తూట్లు పొడిచి.. కోట్లకు గండి..!

author img

By

Published : Aug 27, 2020, 12:50 PM IST

ప్రైవేటు ఏజెన్సీల నిర్వాకం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జలమండలి భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోతోంది. ఆటోమేటిక్‌ రీడింగ్‌(ఏఎంఆర్‌) నీటి మీటర్ల నిర్వహణ గాలికి వదిలేయడంతో నెలకు రూ.కోట్లలో ఆదాయానికి గండి పడుతోందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జీడిమెట్లలోని 500 కనెక్షన్లున్న ఓ గృహ సముదాయంలో ఏఎంఆర్‌ మీటర్ల ట్యాంపరింగ్‌ను విజిలెన్సు బయట పెట్టింది. దీనిపై జలమండలి ఎండీ దానకిషోర్‌ ఆదేశాల మేరకు విచారించగా మరిన్ని లొసుగులు బయటపడ్డాయి.

Neglect on the maintenance of  water Tap AMR‌ meters
Neglect on the maintenance of water Tap AMR‌ meters

గ్రేటర్‌ వ్యాప్తంగా 10 లక్షల వరకు నల్లా కనెక్షన్లున్నాయి. భారీ సైజు ఉన్న వాటికి ఏఎంఆర్‌ మీటర్లు జలమండలి ఏర్పాటు చేసింది. నీటి బిల్లుల ద్వారా నెలకు రూ.80-100 కోట్లు మధ్య, భారీ సైజు నల్లాల నుంచి రూ.67 కోట్లు దాకా సమకూరుతోంది. ఏఎంఆర్‌ మీటర్ల నిర్వహణ పట్టించుకోకపోవడంతో జలమండలి ఆదాయం కోల్పోతోంది. జీడిమెట్లలో గుర్తించిన బల్క్‌ కనెక్షన్‌ ద్వారా గతంలో నెలకు రూ.2 లక్షల వరకు నీటి బిల్లులు వచ్చేవి. మూడేళ్లుగా నెలకు రూ.30 వేలు దాటి రావడం లేదు. స్థానిక సిబ్బంది కుమ్మక్కై మీటరును ధ్వంసం చేసినట్లు విజిలెన్సు విచారణలో తేలింది. కొత్తపేట ఫ్రూట్‌ మార్కెట్‌ వద్దా ఓ మీటర్లు పనిచేయడం లేదని గుర్తించారు.

కుమ్మక్కు.. ఉదాసీనం..

గ్రేటర్‌లో చేతాస్‌, స్టోరమ్‌ ప్రైవేటు సంస్థలు ఏఎంఆర్‌ మీటర్ల సరఫరా, నిర్వహణ చూస్తున్నాయి. చేతాస్‌ 6 వేల మీటర్లను నిర్వహిస్తోంది. ఈ ఒప్పందం అయిదేళ్లు ఉంది. ఇందుకు జలమండలి ఆ సంస్థకు రూ.12 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఏఎంఆర్‌ మీటర్లను టాంపరింగ్‌ చేయడం కుదరదు. ధ్వంసం చేయాలని ప్రయత్నించినా, బ్యాటరీ ఆగిపోయినా ఆ సమాచారం ఏజెన్సీ సర్వర్‌కు చేరుతుంది. వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకోవచ్ఛు మీటర్లు పనిచేయడం లేదని తెలిసినా, లేదా కాలపరిమితి ముగిసినా వాటిని మార్చే నాథుడు లేడు. కొన్నిచోట్ల సిబ్బంది కుమ్మక్కై పట్టించుకోవడం లేదని గుర్తించారు. ప్రస్తుతం గ్రేటర్‌ వ్యాప్తంగా అన్ని ఏఎంఆర్‌ మీటర్ల నిర్వహణ తీరుపై దృష్టిసారించాలని జలమండలి నిర్ణయించింది.

ఇదీ చదవండి: తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.