ETV Bharat / state

AP Rains: రైలుమార్గంలో విరిగిపడిన కొండచరియలు.. రాకపోకలు నిలిపివేత

author img

By

Published : Nov 12, 2021, 10:23 AM IST

mountain slides fell on railway track
రైలుమార్గంలో విరిగిపడిన కొండచరియలు

09:50 November 12

లైన్ క్లియర్ చేసేందుకు సిబ్బంది ప్రయత్నాలు

భారీ వర్షాల (AP Rains)కు ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ మన్యం కొత్తవలస - కిరండల్ రైల్వే మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో.. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తవలస - కిరండల్ రైలుమార్గంలో చిమిడిపల్లి సమీపంలోని 66వ కిలోమీటర్ వద్ద బండరాళ్లు పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లైన్ క్లియర్ చేయడానికి సిబ్బంది రాత్రి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి ఈ చర్యలను ముమ్మరం చేశారు. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గడచిన 6 గంటలుగా గంటకు 4 కిలోమీటర్ల వేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయుగుండం భూభాగంపైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీనపడుతుందని స్పష్టం చేసింది. 

దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు (AP Rains) కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు (AP Rains) పడుతున్నాయి. వీరఘట్టం, సారవకోట, ఆమదాలవలస, సరుబుజ్జిలి, నరసన్నపేట, కోటబొమ్మాళి, లావేరు మండలాల్లో పలుచోట్ల భారీ (AP Rains) వర్షాలు కురుస్తున్నాయి. అటు అనంతపురం జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు (AP Rains) కురుస్తున్నాయి. 

రాగల 24 గంటల్లో.. భారీ వర్షాలు

కాగా.. రాగల 24 గంటల్లోనూ ఏపీవ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు (AP Rains) కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు వాయుుగుండం ప్రభావంతో భారీ వర్షాలు (AP Rains) కురుస్తున్న జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్రవిపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. అత్యవసర సహాయ చర్యల కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్టు స్పష్టం చేశారు. మరోవైపు ఈ నెల 13 తేదీన అండమాన్ తీరప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వెల్లడించారు. నవంబరు 17వ తేదీనాటికి ఇది మరింత బలపడి కోస్తాంధ్ర వద్ద తీరాన్ని దాటే అవకాశమున్నట్టు విపత్తు నిర్వహణశాఖ స్పష్టం చేసింది.

పొంగుతున్న వాగులు వంకలు..

ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు (AP Rains) నమోదు అవుతున్నాయి. ప్రత్యేకించి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 19.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది.

నెల్లూరు జిల్లా ముత్తుకూరులో 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా తడలో 18.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు పేర్కొంది. వాకాడులో 18.2, నాయుడు పేటలో 15 సెంటిమీటర్లు నమోదైంది. సత్యవేడులో 15.5 సెంటిమీటర్లు, వడమాలపేటలో 15.1 సెంటిమీటర్ల వర్షపాతం కురిసినట్టు తెలిపింది. పుత్తూరులో 10 సెంటిమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో 6.1 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. కడప జిల్లా చిట్వేలులో 4.8 సెంటిమీటర్ల వర్షపాతం, రాయచోటిలో 2.2 సెంటిమీటర్ల వర్షపాతం, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 2.1 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. ఒంగోలు, ఉలవపాడులలో 1.5 సెంటిమీటర్ల వర్షపాతం, మచిలీపట్నంలో 1.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఏపీ ప్రణాళికా విభాగం తెలిపింది.

ఇదీ చదవండి: తీవ్ర లక్షణాల నుంచి కొవాగ్జిన్‌తో 93.4 శాతం రక్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.