ETV Bharat / state

చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్‌రెడ్డి అభ్యంతరం

author img

By

Published : Feb 27, 2023, 1:00 PM IST

Minister Niranjan Reddy On Chandrababu
Minister Niranjan Reddy On Chandrababu

Minister Niranjan Reddy On Chandrababu: నిన్న రాష్ట్రంలో టీడీపీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చంద్రబాబు హైదరాబాద్​లోని ఎన్టీఆర్ భవన్‌లో ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకుంటారని చంద్రబాబు అన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే టీడీపీ ఎక్కడ ఉందో కనిపిస్తోందని తెలిపారు. ఎన్టీఆర్‌ తెలంగాణ గడ్డపైనే టీడీపీను ఏర్పాటు చేశారన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారని వెల్లడించారు. చంద్రబాబు మాటలకు మంత్రి నిరంజన్​రెడ్డి స్పందించారు. చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని మంత్రి అన్నారు.

Minister Niranjan Reddy On Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే తెలంగాణ ప్రజలకు అన్నం తెలిసిందన్న చంద్రబాబు కామెంట్స్​పై అభ్యంతరం వ్యక్తం చేశారు. జొన్నకలి, జొన్నయంబలి, జొన్న అన్నం, జొన్న పిసరు, జొన్నలెతప్పన్, సన్న అన్నం సున్న సుమీ, పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకని మహాకవి శ్రీనాథుడు (1365 - 1441) ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారని గుర్తు చేశారు.

11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణ వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు ప్రసిద్ధి అని ప్రస్తావించారు. ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానం అందించిన నేల తెలంగాణ, అప్పట్లోనే విష్ణు కుండినుల నుంచి కాకతీయులు, ఆ తదుపరి నిజాంల దాక.. గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయ వృద్ధి కోసం బాటలు వేశారని కొనియాడారు.

దశాబ్ధాలపాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగదీశారు: 15వ శతాబ్ధం నుంచి హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి.. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో అనేక సార్లు ప్రస్తావించారని స్పష్టం చేశారు. అక్కసు, అక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి పునాది పడిందన్నారు. 1956లో ఆంధ్రలో.. తెలంగాణ విలీనమే తెలంగాణ ప్రాంతం వినాశనానికి బీజం అని చెప్పారు.

చెరువులు, కుంటలను ధ్వంసం చేశారు. అప్పటికే ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆక్షేపించారు. దశాబ్ధాలపాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగదీశారన్నారు. అప్పుడు కట్టిన ఒక్క ప్రాజెక్టు మళ్లీ తెలంగాణ ఏర్పాటు వరకు నిర్ణీత లక్ష్యానికి సాగు నీరందించిన దాఖలాలు లేవని ఆరోపించారు. ప్రాజెక్టులు కడుతున్నట్లు, సాగు నీరు ఇస్తున్నట్లు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారని, వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారని మంత్రి విమర్శించారు.

గ్రామాల్లో ఉపాధి కరువై ముంబాయి, దుబాయి బాట పట్టేలా చేయడమే కాకుండా ఆఖరుకు రూ.2కు కిలో బియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తీసుకువచ్చారని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.