ETV Bharat / state

ఆ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించండి.. అమిత్​షాకు మంత్రి కేటీఆర్ లేఖ​

author img

By

Published : Apr 7, 2023, 8:00 PM IST

KTR
KTR

KTR letter to Amit shah on CRPF Exams : కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఆర్పీఎఫ్ నియామక నోటిఫికేషన్‌ సవరించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు.

KTR letter to Amit shah on CRPF Exams : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగు సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా సీఆర్పీఎఫ్ ఉద్యోగాలకు కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్​లో హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లోనే పరీక్ష నిర్వహిస్తామని పేర్కొనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కోట్లాది మంది హిందీయేతర ప్రాంత నివాసిత నిరుద్యోగ యువకులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం గుర్తించిన అన్ని అధికారిక భాషల్లోనూ పరీక్ష నిర్వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన కేటీఆర్... ఈ మేరకు సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ సవరించాలని లేఖ రాశారు.

అన్ని అధికారిక భాషల్లో పరీక్ష నిర్వహించాలి : సీఆర్పీఎఫ్ ఉద్యోగ సిబ్బంది నియామకం కోసం చేపడుతున్న ఈ పరీక్షను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు అన్ని అధికారిక భాషల్లో నిర్వహించాలని కేటీఆర్​ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కేవలం హిందీ, ఆంగ్ల భాషల్లోనే నిర్వహిస్తే తీవ్ర వివక్షత ఏర్పడుతుందని... ఆంగ్ల మాధ్యమంలో చదవని వారు, హిందీ ప్రాంతాలకు చెందని నిరుద్యోగ యువకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. వివిధ ఉద్యోగాల కోసం అనేక పరీక్షలు నిర్వహించే బదులు, నేషనల్ రిక్రూట్​మెంట్ ఏజెన్సీ ద్వారా ఉమ్మడి అర్హతా పరీక్ష విధానంలో 12 అధికారిక భాషల్లో పరీక్ష నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. అయితే ఈ నిర్ణయం సంపూర్ణంగా అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో రాజభాష అంటూ ఏదీ లేదు : అనేక అధికారిక భాషలు కలిగిన భారతదేశంలో, కేవలం హిందీ వారికి మాత్రమే మాతృభాషలో పోటీ పరీక్షలు రాసే అవకాశం ఇవ్వడమంటే దేశ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో రాజభాష అంటూ ఏదీ లేదన్న ఆయన... రాజ్యాంగం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషలను పట్టించుకోకుండా కేవలం హిందీ, ఆంగ్ల మాధ్యమాల్లో ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. సమాన అవకాశాలు పొందేలా ఈ దేశ ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ కాలరాస్తుందని కేటీఆర్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలన్నింటినీ అన్ని అధికారిక ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని తమ ప్రభుత్వం గతంలో కేంద్రాన్ని కోరిందని... 2020 నవంబర్ 18న ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు. ప్రాంతీయ భాషల్లో చదువుతున్న కోట్లాది మంది యువకులకు ఎలాంటి వివక్ష, అసమానతలు లేకుండా సమాన అవకాశాలు దక్కేలా సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్​ను సవరించాలని కేంద్ర మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.