ETV Bharat / state

Ktr letter to Modi: మోదీజీ రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి?: కేటీఆర్

author img

By

Published : Jun 9, 2022, 8:39 PM IST

Ktr letter to Modi: కేంద్రం 16 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు. పరిమిత వనరులతో తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి, ఉద్యోగాలను కల్పిస్తుంటే.. కేంద్రం మాత్రం ఉద్యోగాల భర్తీని వదిలేసి నిద్రపోతోందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తెరాస ఉద్యమిస్తుందంటూ ప్రధానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

Ktr letter to Modi
కేటీఆర్

Ktr letter to Modi: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ప్రశ్నలు సంధిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కేంద్రం విఫలమైందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నూతన రాష్ట్రమైనప్పటికీ తెలంగాణలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు ఆకర్షించి ప్రైవేట్ రంగంలో సుమారు 16 లక్షల ఉపాధి అవకాశాలను కల్పించామని ప్రధానికి కేటీఆర్ వివరించారు. ప్రభుత్వ రంగంలోనూ ఇప్పటి వరకు సుమారు లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని.. తాజాగా మరో లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. పరిమిత వనరులతోనే భారీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ప్రజలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మెప్పు పొందగలుగుతున్నామని లేఖలో కేటీఆర్ తెలిపారు.

కానీ దేశ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పించడంలో ప్రధానమంత్రిగా మోదీ విఫలమయ్యారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన వాగ్ధానాలు అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటలన్నీ ఢాంభికాలే అనేందుకు ఎనిమిదేళ్ల పాలనే నిదర్శనమన్నారు. అసమర్థ నిర్ణయాలు, ఆర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాకపోగా.. ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని ప్రధానిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు, లాక్ డౌన్ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కోలుకోలేని దెబ్బ తాకిందని కేటీఆర్ ఆరోపించారు. భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విదేశీ పరిశ్రమలను దేశానికి రప్పించడంలో నరేంద్ర మోదీకి స్పష్టమైన విధానం లేదని విమర్శించారు. వ్యవసాయం, టెక్స్​టైల్ రంగ అభివృద్ధిపై మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవడంతో.. చిన్న పొరుగు దేశాల క‌న్నా త‌క్కువ‌మందికి ఆ రంగాల్లో ఉపాధి ల‌భిస్తోందన్నారు. ఇలాంటి విధానాల వ‌ల్ల 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు.

'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్' అని ప్రధాని నరేంద్ర మోదీ ఓ వైపు గొప్పలు చెప్పుకుంటుంటే... భాజపా నేతలు మాత్రం 'సబ్ కో సత్తేనాశ్ కరో' అన్నట్టే వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. భాజపా వైఖ‌రి వ‌ల్ల కేవ‌లం దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భార‌తీయుల ఉపాధికి ప్రమాదం ఏర్పడుతోందన్నారు. భాజపా విద్వేష రాజకీయాలతో పారిశ్రామికంగా వెనుకబడి.. కోట్లాది మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోందన్నారు. గతంలోనూ రాష్ట్రానికి వచ్చి పైసా సాయం చేయలేదని నరేంద్ర మోదీని విమర్శించిన కేటీఆర్.. కనీసం ఇప్పుడైనా తెలంగాణ గ‌డ్డ నుంచి దేశ యువ‌త‌కు ఉపాది, ఉద్యోగ క‌ల్పనపై వైఖ‌రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి: Jubilee hills case: మైనర్లకు ఐదు రోజుల కస్టడీ.. అతని సమక్షంలోనే వాంగ్మూలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.