ETV Bharat / state

జీఎస్టీ మినహాయింపుల జాబితాను విస్తరించాలి: హరీశ్​రావు

author img

By

Published : Jun 29, 2022, 8:51 PM IST

HARISH RAO: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో చండీగఢ్​లో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున పలు అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే జీఎస్టీ విషయంలో స్థానిక సంస్థల స్వచ్ఛ పరికరాలకు సంబంధించిన మినహాయింపుల జాబితాను విస్తరించాలని కోరారు.

జీఎస్టీ మినహాయింపుల జాబితాను విస్తరించాలి: హరీశ్​రావు
జీఎస్టీ మినహాయింపుల జాబితాను విస్తరించాలి: హరీశ్​రావు

HARISH RAO: జీఎస్టీ విషయంలో స్థానిక సంస్థల స్వచ్ఛ పరికరాలకు సంబంధించిన మినహాయింపుల జాబితాను విస్తరించాలని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్​రావు కోరారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో చండీగఢ్​లో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి.. రాష్ట్రం తరఫున పలు అంశాలను ప్రస్తావించారు. స్థానిక సంస్థలు ఇప్పటికే ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాయని.. మినహాయింపు జాబితాను విస్తరించే అంశం పరిశీలించాలని కోరారు. దీంతో పాటు వివరణాత్మక అధ్యయనం కోసం ఫిట్‌మెంట్ కమిటీకి పంపి కొత్త ప్రతిపాదన రూపొందించాలని సూచించారు.

రాష్ట్ర విభజన వల్ల, నిర్ధిష్ట పన్ను చెల్లింపుదారులు కస్టమర్ చిరునామాలను అప్‌డేట్ చేయకపోవడం వల్ల భారీగా ఆదాయం దారి మళ్లుతోందని హరీశ్​రావు సమావేశంలో తెలిపారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది పన్ను చెల్లింపుదారుల రికార్డుల్లోని కస్టమర్ చిరునామాలు తెలంగాణలో ఉన్నా.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌గానే పరిగణలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతిపాదిత కొత్త త్రీబీ ఫారంలో జీఎస్టీఆర్ త్రీబీ రిటర్న్‌లలో ప్రతికూల విలువలను అనుమతించాలని ప్రతిపాదించినందుకు కౌన్సిల్‌కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత త్రీబీ రిటర్న్‌లో కూడా అదే సదుపాయాన్ని పొందుపరచాలని కోరారు. తద్వారా ప్రస్తుత సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల చిరునామాల తప్పులను సరిద్దిద్దేందుకు అవకాశం ఏర్పడుతుందని అన్నారు.

ఐజీఎస్టీని వాపసు చేయాలి..: మళ్లించబడిన ఐజీఎస్టీని రికవరీ చేసేందుకు.. రాష్ట్రం వెలుపలున్న పన్ను చెల్లింపుదారుల ట్యాక్స్ పరిధి విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, దిల్లీ రాష్ట్రాల అధికారుల సహకారం కావాలని హరీశ్​రావు సమావేశంలో కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అధికారులతో కేంద్ర రెవెన్యూ సెక్రటరీ సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పన్ను చెల్లింపుదారులపై మళ్లీ ఐజీఎస్టీ చెల్లింపుతో భారం పడకుండా, ఇప్పటికే చెల్లించిన పీవోఎస్‌తో ఐజీఎస్టీని వాపసు చేయాలని కోరారు. జీఎస్టీ అప్పిలేట్ నిబంధనలకు సంబంధించిన విషయాన్ని సమావేశంలో లేవనెత్తిన ఆయన.. ప్రతిపాదిత నిబంధనలు గజిబిజిగా ఉన్నాయని, ఆచరణాత్మకంగా లేవని అన్నారు.

జీఎస్టీ ఛైర్​పర్సన్ అంగీకారం..: జీఎస్టీ కౌన్సిల్ ఛైర్​పర్సన్ సైతం ఈ విషయాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. నిబంధనలను అప్పిలేట్ ట్రిబ్యునల్ మంత్రుల బృందానికి అప్పగించిన కౌన్సిల్.. ఆగస్టు ఒకటో తేదీలోగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. గోవా అభ్యర్థనకు స్పందించి.. క్యాసినోలను ఆమోదించిన తరహాలోనే గుర్రపు పందాల విషయంలోనూ మంత్రుల బృందానికి నివేదించాలని జీఎస్టీ ఛైర్​పర్సన్​ను హరీశ్​రావు కోరారు. ఇందుకు అంగీకరించిన జీఎస్టీ ఛైర్​పర్సన్.. జులై 15లోగా నివేదిక ఇవ్వాలని మంత్రుల బృందానికి తెలిపారు.

ఇవీ చూడండి..

భాజపా సమావేశాలకు భద్రత కట్టుదిట్టం.. రేపట్నుంటి ఎస్పీజీ అధీనంలోకి హెచ్​ఐసీసీ

ఆ రాష్ట్రంలోని ఓట్లన్నీ యశ్వంత్​కే.. అక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.