ETV Bharat / state

భాజపా సమావేశాలకు భద్రత కట్టుదిట్టం.. నేటి నుంచి ఎస్పీజీ అధీనంలోకి హెచ్​ఐసీసీ

author img

By

Published : Jun 29, 2022, 6:43 PM IST

Updated : Jun 30, 2022, 5:50 AM IST

Security at HICC: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల దృష్ట్యా ఎస్పీజీ అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ డీఐజీ మెహతా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రధానంగా భద్రతపైనే చర్చించారు. ప్రధాని మోదీతో పాటు ఇతర ముఖ్య నేతలకు సంబంధించిన విడిది ఏర్పాట్ల గురించి ఎస్పీజీ అధికారులు సమీక్షించారు.

Security at HICC
ఎస్పీజీ అధీనంలోకి హెచ్​ఐసీసీ

Security at HICC: మరో మూడు రోజుల్లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని మోదీతో పాటు అమిత్ షా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్,కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొననున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీజీ అధికారులు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు సమావేశం నిర్వహించారు.

హెచ్ఐసీసీలో నిర్వహించిన ఈ సమావేశానికి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, సంయుక్త సీపీ అవినాష్ మొహంతి, నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్, సీసీఎస్ డీసీపీ కవిత, రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్, జీహెచ్ఎంసీ అధికారులు, రహదారులు భవనాల శాఖ అధికారులు, అగ్నిమాపక శాఖాధికారులు, బీఎస్ఎన్ఎల్ అధికారులు, విద్యుత్ శాఖాధికారులు పాల్గొన్నారు. భద్రతాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలను చర్చించిన తర్వాత... మిగతా శాఖలకు సంబంధించిన పాత్రలను ఎస్పీజీ అధికారులు విశదీకరించారు. ఏయే శాఖాధికారులు ఏయే కార్యక్రమాలు చేపట్టాలనే విషయాలను ఎస్పీజీ అధికారులు నిర్ధేశించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు వీవీఐపీలు వచ్చినప్పటి నుంచి.. తిరిగి వెళ్లిపోయే వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబరాబాద్ కమిషనరేట్ అధికారులకు ఎస్పీజీ అధికారులు దిశా నిర్దేశం చేశారు. హెచ్ఐసీసీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. నోవాటెల్​లో కొంతమంది ప్రముఖులు బస చేయనున్నారు. మరికొంత మందికి వెస్టిన్, రాడిసన్, పంచతార హోటళ్లు కేటాయించారు. ప్రధాని ఎక్కడ బస చేస్తారనే విషయం ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ ఇలా ముఖ్యులందరూ ఒకే చోట కాకుండా భద్రతను దృష్టిలో ఉంచుకొని వేర్వేరు చోట్ల బస ఏర్పాటు చేయాలని ఎస్పీజీ అధికారులు భావిస్తున్నారు.

హెచ్ఐసీసీకి సైబరాబాద్ నేర విభాగం డీసీపీ కల్మేశ్వర్​ను బాధ్యుడిగా ఉంచారు. నోవాటెల్​కు సీసీఎస్ డీసీపీ కవితను బాధ్యురాలిగా ఉంచారు. ఈ రెండింటిని కలిపి సంయుక్త సీపీ అవినాష్ మొహంతి పర్యవేక్షించనున్నారు. హెచ్ఐసీసీలో 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. నోవాటెల్, ఇతర పంచతార హోటళ్లలోనూ డీసీపీ స్థాయి అధికారికి భద్రతాపరమైన బాధ్యతలు అప్పజెప్పగా... ఇతర శాఖల అధికారులు వసతికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ప్రధాని మోది ఎక్కడ బస చేస్తారనే విషయాన్ని ఎస్పీజీ అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు.

ఒకవేళ రాజ్ భవన్​లో బస చేస్తే అక్కడి నుంచి బేగంపేట్ విమానాశ్రయం వరకు రహదారి మార్గాన వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్​లో నేరుగా హెచ్ఐసీసీ చేరుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. అలా కాకుండా నోవాటెల్​లో లేదా ఇతర సమీపంలో ఉన్న ఇతర పంచతార హోటల్​లో బస చేస్తే రహదారి మార్గాన నేరుగా ప్రత్యేక వాహనంలో హెచ్ఐసీసీకి చేరుకునే అవకాశం ఉంది. నేటి నుంచి హెచ్ఐసీసీ ప్రాంగణాన్ని ఎస్పీజీ అధికారులు తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్పీజీ అధికారుల చేతిలోకి వెళితే... కేవలం అనుమతి ఉన్న వాళ్లను మాత్రం హెచ్ఐసీసీ ప్రాంగణంలోకి అనుమతిస్తారు. ప్రవేశద్వారం వద్ద ఇప్పటి వరకు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. నేటి నుంచి సైబరాబాద్ పోలీసులు పహారా కాయనున్నారు. అనుమతి లేని వాహనాలను గేటు బయటే నిలిపివేయనున్నారు.

ఇవీ చదవండి: ప్రధాని పర్యటన సందర్భంగా నిరసనలకు సిద్ధమవుతోన్న హస్తం నేతలు..

కన్హయ్యను చంపిన వారికి పాక్​తో లింకులు.. కరాచీలో 45 రోజులు శిక్షణ

Last Updated : Jun 30, 2022, 5:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.