ETV Bharat / state

యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా పక్కాగా ఏర్పాట్లు: గంగుల కమలాకర్​

author img

By

Published : Apr 13, 2022, 8:02 PM IST

Minister Gangula Kamalakar on Paddy Procurement: యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేస్తోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఏ ఒక్క రైతు కూడా తక్కువ ధరలకు తమ ధాన్యాన్ని అమ్ముకోవద్దని... కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించాలని మంత్రి సూచించారు.

యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా పక్కాగా ఏర్పాట్లు: గంగుల కమలాకర్​
యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా పక్కాగా ఏర్పాట్లు: గంగుల కమలాకర్​

Minister Gangula Kamalakar on Paddy Procurement: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల సమాయత్తమయ్యామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల భవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేశామని ప్రకటించారు. ధాన్యం సేకరణ నుంచి తప్పుకోవడమే కాకుండా రెండు మూడేళ్లల్లో భారత ఆహార సంస్థను కూడా ఎత్తేసే యోచనలో ఉన్న కేంద్రం.. రాష్ట్రం నుంచి యాసంగి ధాన్యం సేకరించేందుకు సుముఖత చూపలేదని ఆక్షేపించారు. రేపట్నుంచి క్రమంగా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా పక్కాగా ఏర్పాట్లు: గంగుల కమలాకర్​

కేసీఆర్‌ మానవతకు మారుపేరు.. ‘కేంద్రం మోసం చేయడంతో రైతులను ఆదుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కేసీఆర్‌ మానవతకు మారుపేరు అని మరోసారి నిరూపితమైంది. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)కు ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు రైతులంతా సహకరించాలి. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. ఇతర రాష్ట్రాల్లో పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా చర్యలు తీసుకున్నాం. ప్రతి గ్రామంలో రైతులు ఎంత వరి సాగు చేశారు, ఎంత ధాన్యం వస్తుందో అంచనా వేసి... డేటా రూపొందించి ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేశాం. కొనుగోలు కేంద్రానికి రైతు వచ్చిన వెంటనే అతని ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేసిన తర్వాతే కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది.' -గంగుల కమలాకర్​, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి

తక్కువ ధరలకు అమ్ముకోవద్దు.. ఏ ఒక్క రైతు కూడా తక్కువ ధరలకు తమ ధాన్యాన్ని అమ్ముకోవద్దని... కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించాలని సూచించారు. మెడలు వంచాం.. ధాన్యం కొనిపిస్తున్నామన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఎవరు మెడలు వంచితే తాము రైతుబంధు, రైతుబీమా, 24 గంటల విద్యుత్ సరఫరా సహా కాళేశ్వరం జలాలు ఇచ్చామని ప్రశ్నించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సీఎంల మెడలు వంచి రైతుబంధు ఇప్పించు... లేకపోతే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రధాని మోదీ మెడలు వంచాలని హితవు పలికారు.

ధాన్యం సేకరణ అంశంపై ఏ మాత్రం అవగాహన లేకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. 8.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైందని కేంద్ర మంత్రి అనడం పూర్తి నిరాధారమని... గింజ కూడా బయటకు పోలేదని స్పష్టం చేశారు. రవాణా, నిల్వ కేంద్రం పరిధిలో ఉన్నందున ధాన్యం సేకరణకు ఎంత ముందస్తు అడ్వాన్సు ఇస్తుందో వేచిచూడాలని అన్నారు. రైతుల బాధలు మానవతా దృక్పథంతో అర్థం చేసుకున్న కేసీఆర్.. రైతులు నష్టపోవద్దని ఆర్థిక భారమైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. రా రైస్ ఇస్తాం.. కేంద్రం తీసుకోకపోతే మరో ఉద్యమం తప్పదని మంత్రి కమలాకర్ హెచ్చరించారు.

చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం.. "పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యం తెలంగాణ భూ భాగం మీద అమ్మకూడదు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,100.. రూ.1200లకు మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో విద్యుత్‌ కోతల కారణంగా మిల్లులు సరిగా నడవడం లేదు. తెలంగాణతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల ధాన్యం తెలంగాణలోకి రాకుండా 51 చోట్ల చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం. తెలంగాణ రైతులకు న్యాయం జరగాలనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రైతులకు ఎక్కడా నష్టం జరగకుండా ఎంఎస్‌పీ ఇవ్వాలని జిల్లా అధికారులను ఆదేశించాం. యాసంగిలో తెలంగాణలో 36 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. 65లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశాం. ఇందుకోసం 15 కోట్ల గన్నీ బ్యాగ్‌లు అవసరం. ప్రస్తుతం 1.60 కోట్ల గన్నీ బ్యాగ్‌లు సిద్ధంగా ఉన్నాయి. మిగిలినవి సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ -గంగుల కమలాకర్​, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.