ETV Bharat / state

ఏంటీ! మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదాన్ని ఏడాదిన్నర కిందటే గుర్తించారా? మరెందుకు ఆపలేదు?

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 12:25 PM IST

Medigadda Barrage Issue Latest News : మేడిగడ్డ బ్యారేజీకి దిగువ భాగంలో గత అక్టోబరులో దెబ్బతిన్న పియర్స్ చోటే నీటి బుడగలు ఏర్పడినట్లు ఏడాది కిందటే ప్రాజెక్టు ఇంజినీర్లు గుర్తించారట. ఈ విషయమై గుత్తేదారు సంస్థ అయిన ఎల్​ అండ్ టీకి లేఖల ద్వారా సమాచారం తెలిపినా స్పందించలేదని తెలుస్తోంది.
Medigadda Barrage Issue Latest News
Medigadda Barrage Issue

Medigadda Barrage Issue Latest News : మేడిగడ్డ బ్యారేజ్​కు దిగువ భాగంలో, గత అక్టోబరులో దెబ్బతిన్న పియర్స్‌ ప్రాంతంలోనే నీటి బుడగలు ఏర్పడినట్లు 2022లోనే ప్రాజెక్టు ఇంజినీర్లు గుర్తించారు. ఇదే విషయాన్ని గుత్తేదారు సంస్థ అయిన ఎల్‌ అండ్‌ టీకి లేఖల ద్వారా తెలిపినా స్పందించలేదని సమాచారం. బ్యారేజ్ ఏడో బ్లాకులో 17, 18, 19, 20 తూముల (వెంట్స్‌)కు దిగువన బాయిలింగ్‌ ఆఫ్‌ వాటర్‌ (నీటి బుడగలు ఏర్పడి ఇసుక తన స్వభావాన్ని కోల్పోవడం) ఏర్పడిందని, దీని నివారణకు చర్యలు తీసుకోవాలని, దిగువ భాగంలోనే సిమెంటు కాంక్రీటు బ్లాక్స్‌ పక్కకు జరిగాయని 2022 ఏప్రిల్‌లో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఎల్‌ అండ్‌ టీకి లేఖలో స్పష్టం చేశారు.

Medigadda Danger Identified One Year Ago : అప్పటికి ఇంకా డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ (డీఎల్‌పీ- నిర్వహణతో పాటు ఏం నష్టం వాటిల్లినా కాంట్రాక్టు ఏజెన్సీ బాధ్యతవహించే కాలం) ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెండింగ్‌/పునరుద్ధరణ పనులుగా పేర్కొన్న వాటిలో కూడా బ్యారేజ్ దిగువన సీసీ బ్లాకులు, లాంచింగ్‌ ఆప్రాన్‌, ర్యాఫ్ట్‌కు నష్టం జరిగినట్లు సంబంధిత ఇంజినీర్లు నివేదించారు. ఎప్పటికప్పుడు కిందిస్థాయి ఇంజినీర్లు పెండింగ్‌లో ఉన్న, పునరుద్ధరించాల్సిన పనుల గురించి నివేదించినా ఫలితం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

Medigadda Barrage Damage Latest Updates : దీనికి సంబంధించి అప్పుడే స్పందించి ఉంటే గత అక్టోబరులో బ్యారేజ్​కి భారీ నష్టం వాటిల్లేది కాదన్న అభిప్రాయాన్ని నీటిపారుదల శాఖకు చెందిన పలువురు సీనియర్‌ ఇంజినీర్లు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పెండింగ్‌ పనులు చేయలేదని లేఖల మీద లేఖలు రాసిన ఇంజినీర్లు, మరోవైపు అంతకు ముందే పని పూర్తిచేసినట్లు సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చారన్న ప్రశ్న అలాగే ఉంది. ఒప్పందం ప్రకారం పని పూర్తి చేసిన తర్వాత రెండేళ్ల పాటు డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌గా పరిగణిస్తారు. గుత్తేదారు సంస్థకు లేఖలు రాసి చేతులు దులిపేసుకోవడం తప్ప, తరచూ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించే సీనియర్‌ ఇంజినీర్లు ఎందుకు పట్టించుకోలేదన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.

కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి

పలు దఫాలు లేఖలు రాసినా ఫలితం లేదు : మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) నిర్మాణంతో పాటు అనుబంధపనులు మొదట గుత్తేదారు సంస్థకు అప్పగించారు. ఈ పనులు ఇచ్చిన అయిదేళ్ల తర్వాత అతిథిగృహం, సిబ్బంది క్వార్టర్స్‌ నిర్మాణ పనులను కూడా ఇచ్చారు. ఇవి అనుబంధంగా ఇచ్చినట్లు పరిగణించినా, 2016లో ఒప్పందం చేసుకున్న పనిని ఎప్పటికి పూర్తి చేశారు, రెండేళ్ల డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ఎప్పటికి పూర్తయిందన్న దానిపై నీటిపారుదల శాఖ నుంచి ఎటువంటి స్పష్టత లేదు. తమ గడువు ముగిసిందని గుత్తేదారు సంస్థ అంటుండగా, లేదని నీటిపారుదల శాఖ వాదిస్తోంది.

Medigadda Barrage Damage Issue : అయితే 2022 ఏప్రిల్‌లో నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ ప్రాజెక్టు ఇంజినీర్‌ ఓ లేఖ రాశారు. ఇందులో దెబ్బతిన్న పనుల పునరుద్ధరణ గురించి స్పష్టంగా చెప్పారు. ఈ పనులు చేయకపోతే బ్యారేజ్​కి ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని, వీటిని సీజన్‌లోగా పూర్తి చేయడం కూడా కష్టమవుతుందని తెలిపారు. అంతకుముందు 2020 మే, 2021 ఫిబ్రవరిలో కూడా లేఖలు రాసినట్లు, అయినా మిగిలిన పనులు పూర్తి చేయడానికి, దెబ్బతిన్న వాటిని బాగు చేయడానికి అవసరమైన శ్రద్ధ పెట్టడం లేదని కూడా వెల్లడించారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ రెండు వారాలకు వాయిదా - పూర్తి వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు

తక్షణం యుద్ధప్రాతిపదికన చేయాల్సిన పనుల్లో నాలుగింటిని పేర్కొనగా, ఇవన్నీ దెబ్బతిన్నవి, బాగు చేయాల్సినవే కావడం విశేషం. బ్యారేజ్​కి ఎగువన, దిగువన దెబ్బతిన్న వెంట్స్‌కు మరమ్మతులు, దిగువ భాగంలో పక్కకు జరిగిన సిమెంటు కాంక్రీటు బ్లాక్స్‌ యథాస్థితికి తేవడం, ఏడో బ్లాకులో 17, 18, 19, 20వ తూముల వద్ద, దిగువన బాయిలింగ్‌ ఆఫ్‌ వాటర్‌ను అరికట్టడం, పని చేసిన తర్వాత అలానే వదిలేసిన మట్టి, బోల్డర్లు, పైపులను తొలగించడం గురించి లేఖలో ప్రస్తావించారు. దీంతో పాటు అసలు ఒప్పందంలో ఉన్న అయిదు పనుల పెండింగ్‌, దెబ్బతినగా మళ్లీ చేయాల్సిన పది పనులతో పాటు అదనంగా అప్పగించి చేయాల్సిన వాటి గురించి కూడా లేఖలో వివరించారు. అలాగే ప్రాజెక్టు వద్ద పనిచేసే ఇంజినీర్లు ఈ సమస్యల గురించి తరచూ ఉన్నతాధికారులు, గుత్తేదారుల దృష్టికి తీసుకొచ్చినా ఎలాంటి ఫలితం లేదని స్పష్టమవుతోంది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.