ETV Bharat / state

Education: ముందుచూపులేని విద్యాశాఖ... తరగతుల కోసం విద్యార్థుల వెతుకులాట!

author img

By

Published : Jul 28, 2021, 5:01 AM IST

Updated : Jul 28, 2021, 6:52 AM IST

Lack of foresight in education
విద్యాశాఖ

విద్యాశాఖలో కొరవడిన ముందుచూపు తెలంగాణలో వేలమంది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఆంగ్ల మాధ్యమంలో 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో.. 6వ తరగతిలో చేరడానికి ఉన్నత పాఠశాలల కోసం వెదుకులాడాల్సిన పరిస్థితి నెలకొంది.

విద్యాశాఖలో కొరవడిన ముందుచూపు రాష్ట్రంలో వేలమంది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఆంగ్ల మాధ్యమంలో 5వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో.. 6వ తరగతిలో చేరడానికి ఉన్నత పాఠశాలల కోసం వెదుకులాడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 4,500 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అయిదేళ్ల క్రితం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించారు. అందులో చదువుకున్న దాదాపు 1.35 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది 6వ తరగతికి వచ్చారు. ఆమేర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం సెక్షన్లు ప్రారంభించకపోవడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు.

ఎక్కడ చదువుకోవాలని ప్రశ్నిస్తున్నారు. సమీప ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేనివారు.. దూర ప్రాంతాల్లోని పాఠశాలలను ఆశ్రయిస్తుండగా.. మరికొందరు తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు వైపు దృష్టిసారిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులే చొరవ తీసుకొని అనధికారికంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఇక్కడ చేరుతున్న విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం పాఠ్య పుస్తకాలు అందడంలేదు. ఇంగ్లిష్‌ మీడియం సెక్షన్ల ప్రారంభానికి పలు పాఠశాలలు దరఖాస్తు చేసినా అనుమతులు ఇవ్వకుండా విద్యాశాఖ ఏళ్లతరబడి నాన్చుతోంది.

తల్లిదండ్రులు ఎక్కువ మంది ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నారని ఉపాధ్యాయ సంఘాలు తెలపడంతో.. 2016-17 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 4,500 ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రారంభించారు. తొలుత ఒకటో తరగతితో ప్రారంభించగా గత విద్యా సంవత్సరంతో వారికి అయిదో తరగతి పూర్తయ్యింది. వారంతా ఈ విద్యా సంవత్సరం(2021-22) ఆరో తరగతిలోకి ప్రవేశించారు. రాష్ట్రంలో 4,661 ఉన్నత పాఠశాలలు ఉండగా.. వాటిలో 2,810 (60 శాతం) చోట్ల ఇంగ్లిష్‌ మీడియం సెక్షన్లు ఉన్నాయి. మిగతా చోట్ల లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఆంగ్ల మాధ్యమంలో 5 వరకూ చదివిన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కనీసం 60 వేల మందిపై ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ క్రమంలో తమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం సెక్షన్‌ కావాలని రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖకు దరఖాస్తు చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 40 పాఠశాలలు 2019లోనే దరఖాస్తు చేసినా ఇప్పటివరకు అనుమతులు దక్కలేదు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది ఆరో తరగతి ఆంగ్ల మాధ్యమం సెక్షన్‌ని అనధికారికంగానే ప్రారంభించారు. అదే ప్రాంగణంలో నడుస్తున్న ప్రాథమిక పాఠశాలను 2016లో ఆంగ్ల మాధ్యమంగా మార్చడంతో ఇక్కడ ఈ ఏడాది ఆరో తరగతిలో ఇంగ్లిష్‌ మీడియం ప్రారంభించక తప్పని పరిస్థితి. లేకుంటే ఇక్కడి విద్యార్థులు 8 కిలోమీటర్ల దూరంలోని చేర్యాల ఉన్నత పాఠశాలలో లేదా దగ్గరలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా వందలాది హైస్కూళ్లలో ఇదే పరిస్థితి.

పుస్తకాలకూ తిప్పలు

విద్యాశాఖ ఆంగ్ల మాధ్యమానికి అధికారికంగా అనుమతి ఇవ్వనందున తెలుగు మాధ్యమం పాఠ్య పుస్తకాలే సరఫరా అవుతున్నాయి. ఫలితంగా వేలాది మంది విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. తెలుగు, ఆంగ్లం, హిందీ పుస్తకాలు అన్ని మాధ్యమాలకు ఒకటే అయినందున వాటిని పిల్లలకు అందజేశారు. గణితం, సోషల్‌, సైన్స్‌ పుస్తకాలను పాతవి ఉంటే ఇచ్చారు.

నిబంధనలు సడలించాలి..

సర్కారు బడుల్లో అదనపు సెక్షన్లు ప్రారంభించాలంటే ఆర్‌ అండ్‌ బీ ఇంజినీర్ల నుంచి భవనం పటిష్ఠంగా ఉందని ధ్రువపత్రం, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నుంచి శాటనిరీ ధ్రువపత్రం, జడ్పీ సీఈఓ నుంచి మరో సర్టిఫికెట్‌.. ఇలా ఎన్నో అడుగుతున్నారు. ఇలాంటి నిబంధనల్ని సడలించాలి. ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించి అయిదేళ్లు అయినందున దీనిపై సమీక్షించి విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. ఆంగ్ల మాధ్యమం అనుమతుల అధికారం డీఈఓలకే ఇవ్వాలి.

- రాజాభాను చంద్రప్రకాశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు,గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం

ఇవీచూడండి: యాంటీబాడీలు తగ్గుతున్నా.. వైరస్‌ నుంచి రక్షణ!

Last Updated :Jul 28, 2021, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.