ETV Bharat / state

గెజిట్​ నోటిఫికేషన్​ అమలుకు కార్యాచరణ వేగవంతం.. తెలంగాణ వైఖరేమిటో?

author img

By

Published : Aug 6, 2021, 6:26 PM IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ తదనంతర పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. గెజిట్ నోటిఫికేషన్ అమలుకు బోర్డులు కార్యాచరణ వేగవంతం చేస్తున్నాయి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్​పై ఇంకా ఎలాంటి వైఖరి వెల్లడించలేదు.

గెజిట్​ నోటిఫికేషన్​ అమలుకు కార్యాచరణ వేగవంతం.. తెలంగాణ వైఖరేమిటో?
గెజిట్​ నోటిఫికేషన్​ అమలుకు కార్యాచరణ వేగవంతం.. తెలంగాణ వైఖరేమిటో?

విభజన చట్టం ప్రకారం కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ గత నెల 15వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్​పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ వైఖరి వెల్లడించలేదు. రాష్ట్ర సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని... సందర్భం వచ్చినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కృష్ణాజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ దాదాగిరీ చేస్తోందని, కేంద్రం కూడా తెలంగాణకు అన్యాయం చేసే దిశగా వెళ్తోందని హాలియా సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.

హాజరు కాని తెలంగాణ

అటు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాల ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ కార్యాచరణను వేగవంతం చేశాయి. బోర్డులకు నిధులు ఇవ్వాలని, ప్రాజెక్టులు, సంబంధిత వివరాలు ఇవ్వాలని ఇప్పటికే రెండు రాష్ట్రాలకు లేఖలు రాశాయి. అమలు కార్యాచరణ ఖరారు కోసం రెండు బోర్డులు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి మొదటి భేటీని కూడా నిర్వహించాయి. అయితే ముందే పూర్తి స్థాయి బోర్డును సమావేశపరచాలని కోరిన తెలంగాణ.. సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు.

కుదరదన్న తెలంగాణ

గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలే అజెండాగా గోదావరి, కృష్ణా బోర్డులు ఈ నెల తొమ్మిదో తేదీన పూర్తి స్థాయి బోర్డుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ఈ మేరకు జీఆర్ఎంబీ బుధవారం లేఖలు పంపగా... బోర్డుల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కేఆర్ఎంబీ శుక్రవారం లేఖలు పంపింది. అయితే సోమవారం నాడు బోర్డు సమావేశానికి హాజరయ్యేందుకు వీలు కాదని తెలంగాణ స్పష్టం చేసింది. ఆ రోజు సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్​లో కేసుల విచారణ ఉందని... దాంతో బోర్డు భేటీకి హాజరు కావడం కుదరదని తెలిపింది. ఈ మేరకు గోదావరి, కృష్ణా బోర్డు ఛైర్మన్​లకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు.

తదుపరి తేదీని ఖరారు చేయాలని..

తదుపరి సమావేశ తేదీని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రదించి ఖరారు చేయాలని, వీలైనంత త్వరగా భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పరిస్థితుల్లో గోదావరి, కృష్ణా బోర్డులు ఏం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.