తెరాస నన్ను చంపించడానికి ప్రయత్నిస్తోంది: కేఏ పాల్‌

author img

By

Published : May 8, 2022, 6:45 PM IST

తెరాస నన్ను చంపించడానికి ప్రయత్నిస్తోంది: కేఏ పాల్‌

KA Paul Comments: తెరాస తనను చంపించడానికి ప్రయత్నిస్తోందని కేఏ పాల్‌ ఆరోపించారు. తనపై దాడి చేసి వ్యక్తిని ఇంకా అరెస్ట్‌ చేయలేదని ఆయన మండిపడ్డారు. సోనియా 2005లో తన పీస్‌ మిషన్‌ను రద్దు చేయించారని.. అందుకే కాంగ్రెస్‌ పతనమవుతోందని విమర్శించారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ మళ్లీ రైతులను ఆదుకుంటామంటూ మాయ మాటలు చెబుతోందని దుయ్యబట్టారు

KA Paul Comments: తెరాస తనను చంపించడానికి ప్రయత్నిస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అమీర్‌పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేఏ పాల్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ 2005లో తన పీస్‌ మిషన్‌ను రద్దు చేయించి లక్షలాది మంది పొట్ట కొట్టారని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్‌ పతనమవుతోందన్నారు. రాహుల్‌గాంధీ వరంగల్‌ రైతు సంఘర్షణ సభపై కేఏ పాల్‌ విమర్శలు గుప్పించారు. సభ కోసం 87 కోట్లు ఖర్చు చేశారని.. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ మళ్లీ రైతులను ఆదుకుంటామంటూ మాయ మాటలు చెబుతోందని దుయ్యబట్టారు.

పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడో ఆయనకే తెలియదని కేఏ పాల్ అన్నారు. పవన్‌కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్‌ అని పాల్‌ అభివర్ణించారు. అయనకు ప్రజా సేవ చేయాలనే చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. కాంగ్రెస్, తెదేపా పార్టీలతో పాటు పవన్‌కల్యాణ్​పై విమర్శలు గుప్పించారు. అరవై ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ దేశాన్ని నాశనం చేసిందన్నారు. రాహుల్‌ సభకు జనాలను తరలించారని...అయన వాగ్దానాలతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిలేదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మేస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు కోసం మాత్రమే రాజకీయాల్లో ఉన్నారన్నారు.

"తెరాస నన్ను చంపించడానికి ప్రయత్నిస్తోంది. నాపై దాడి చేసిన వ్యక్తిని ఇంకా అరెస్ట్‌ చేయలేదు. నాపై దాడి చేసిన దుండగుడిని కొన్ని పనికిమాలిన ఛానల్స్​ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. వాడిని హీరో చేస్తున్నారు. కేటీఆర్​ డబ్బిచ్చి వాడిని ఇంటర్వ్యూలు చేయిస్తున్నారట. వాడిని ఇంకా అరెస్ట్​ చేయకపోవడం బాధగా ఉంది. గవర్నర్​ను కలిసి ఫిర్యాదు చేశాను. నన్ను చంపుతారట. నన్ను చంపడానికి ప్లాన్​ వేస్తున్నారట. కానీ మీరే చస్తారు. నేను చచ్చినా ఫర్వాలేదు. నా లాంటి కేఏ పాల్​లు ముగ్గురు ఉంటారు. నేను చస్తే ఇంకొక కేఏ పాల్​ రావచ్చేమో." -కేఏ పాల్​, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు

తెరాస నన్ను చంపించడానికి ప్రయత్నిస్తోంది: కేఏ పాల్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.