ETV Bharat / state

'పర్యావరణ పరిరక్షణ నినాదం కాదు జీవన విధానం'

author img

By

Published : Mar 22, 2021, 5:11 AM IST

పర్యావరణ పరిరక్షణ ఒక నినాదంగా మిగిలిపోకుండా జీవన విధానంలో భాగం కావాలంటోంది ఓ స్వచ్ఛంద సంస్థ. కొన్నేళ్లుగా ప్లాస్టిక్ నియంత్రణ, మొక్కల పెంపకంపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఇప్పుడు వేసవి దృష్ట్యా పక్షుల మనుగడకు అవసరమైన పిచ్చుకగూళ్లు, మట్టిమూకుళ్లను పెద్దసంఖ్యలో ఉచితంగా పంపిణీ చేసి ప్రకృతిలో పక్షుల ప్రాధాన్యతను చాటిచెబుతోంది.

'పర్యావరణ పరిరక్షణ నినాదం కాదు జీవన విధానం'
'పర్యావరణ పరిరక్షణ నినాదం కాదు జీవన విధానం'

'పర్యావరణ పరిరక్షణ నినాదం కాదు జీవన విధానం'

పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ వనస్థలిపురంలోని జాగృతి అభ్యుదయ స్వచ్ఛంద సంస్థ ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకృతి ప్రేమికులకు ఉచితంగా పిచ్చుకగూళ్లు, మట్టిమూకుళ్లు, ఆహారధాన్యాలు, నీటితొట్లు, తులసిమొక్కలను పంపిణీ చేశారు.

జాగృతి అభ్యుదయ సంఘం అధ్యక్షుడు భావన శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, హస్తినా మహిళా మండలి అధ్యక్షురాలు, గోసేవా సమితి సభ్యురాలు ఎర్రం పూర్ణశాంతి, అంబర్ పేట డీఎస్పీ పి.విజయ్ కుమార్, యాద రామలింగేశ్వర్ రావు, డాక్టర్ లక్ష్మీప్రసన్న పాల్గొని స్థానిక ప్రజలకు పిచ్చుకగూళ్లు పంపిణీ చేశారు.

అవగాహన...

పర్యావరణ పరిరక్షణలో కీలకంగా నిలిచే పిచ్చుకల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. వాటి పరిరక్షణ కోసం ప్రతి ఇంట్లో ప్రత్యేకంగా మట్టిగూళ్లు ఏర్పాటు చేసుకోవాలని జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు సూచించారు. ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయం సలహాతో కర్మన్​ఘాట్​లోని శివకుమార్ సహకారంతో పెద్ద సంఖ్యలో పిచ్చుక గూళ్లును తయారుచేశారు.

పక్షి ప్రేమికుల ఆందోళన...

ప్రకృతిలో భాగమైన పక్షుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని, ఆ ప్రభావం మానవాళిపై స్పష్టంగా కనిపిస్తుందని పలువురు పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ వేసవిలో పక్షుల రక్షణ కోసం పిచ్చుకగూళ్లను ఏర్పాటు చేసుకుంటున్నామని, వాటి మనుగడ కోసం తమవంతు బాధ్యత చాటుకుంటున్నామని పలువురు పక్షి ప్రేమికులు తెలిపారు.

జీవన విధానంలో భాగం కావాలని...

పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతగా భావించే పౌరుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా తమ సంస్థ కృషిచేస్తుందని జాగృతి అభ్యుదయ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు భావన శ్రీనివాస్ తెలిపారు. ప్రజల జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణ భాగం కావాలనే ఉద్దేశంలో బట్ట సంచుల పంపిణీ, మొక్కలు నాటడం, వినాయక విగ్రహాల సరఫరా లాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న ఆయన... ప్రపంచ పిచ్చుకల రోజున పక్షుల మనుగడకు అవసరమైన ఆరు రకాల వస్తువులను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు.

పిచ్చుకల సంఖ్య పెంచడంతోపాటు పక్షుల మనుగడలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు జాగృతి అభ్యుదయ సంఘం నాలుగేళ్లుగా పిచ్చుకగూళ్ల పంపిణీని నిర్వహిస్తోంది.

ఇదీ చదవండి: యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ.. ధర్మ దర్శనానికి 2గంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.