ETV Bharat / state

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు ఏపీ ముఖ్యమంత్రి లేఖ

author img

By

Published : Apr 18, 2021, 7:46 AM IST

jagan-letter-to-odisha-cm-naveen-patnaik
ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌కు ముఖ్యమంత్రి జగన్‌ లేఖ

వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన సమస్యలను చర్చించి పరిష్కరించుకుందామని... ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. కలిసి చర్చించుకునేందుకు వీలైన సమయం తెలియజేస్తే సమావేశమవుదామని పేర్కొన్నారు. ఈ మేరకు ఒడిశా సీఎంకు.. జగన్‌ రాసిన లేఖను విడుదల చేశారు.

''వంశధార ట్రైబ్యునల్‌ 2017 సెప్టెంబర్‌ 13న తుది తీర్పు ప్రకటించింది. వంశధార నదిపై నేరడి బ్యారేజీ, అనుబంధ నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్‌కు అనుమతించింది. ఒడిశా రాష్ట్ర అవసరాలు తీరేలా ఎడమ వైపున స్లూయిస్‌ నిర్మాణానికీ సమ్మతించింది. ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల రెండు రాష్ట్రాల్లోని కరవు ప్రాంతాల్లో ఉన్న సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయి. ఒడిశాలోని గజపతినగరం జిల్లాకు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు ఈ బ్యారేజీ నిర్మాణం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు దీని నిర్మాణం పూర్తి చేస్తారని చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పైగా వంశధార నదిలో 75శాతం విశ్వసనీయమైన 80 టీఎంసీల నీళ్లు ఏటా సముద్రంలో కలిసిపోతున్నాయి. నీటి నిర్వహణ సరిగా లేకపోతే సమీప భవిష్యత్తులోనే కొరత ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని లేఖలో పేర్కొన్నారు.

సమస్యలన్నీ పరిష్కరించుకుందాం..

తుది తీర్పుపై ఒడిశా రాష్ట్రం వంశధార ట్రైబ్యునల్‌ ఎదుట కొన్ని వివరణలు కోరింది. సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పర్యవేక్షణ కమిటీకి సంబంధించి కొన్ని సందేహాలు లేవనెత్తింది. నేరడి బ్యారేజీ నిర్మించి దాని నిర్వహణ ప్రారంభించే లోపు ఈ అంశాలన్నింటినీ రెండు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకుందాం. నేరడి బ్యారేజీ నిర్మాణానికి వీలుగా వంశధార ట్రైబ్యునల్‌ తుది తీర్పు గెజిట్‌ నోటిఫై చేసేందుకు అంగీకరించాల్సిందిగా కోరుతున్నా-

- ఏపీ ముఖ్యమంత్రి జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.