ETV Bharat / state

KTR: భావి తరాలు బాగుండాలనే 'డయల్ యువర్ సెప్టిక్ ట్యాంకర్లు'

author img

By

Published : Jul 17, 2021, 4:59 PM IST

Updated : Jul 17, 2021, 7:34 PM IST

KTR
కేటీఆర్​

15:29 July 17

KTR: డయల్ యువర్ సెప్టిక్ ట్యాంకర్లను ప్రారంభించిన కేటీఆర్​

KTR: డయల్ యువర్ సెప్టిక్ ట్యాంకర్ల ప్రారంభించిన కేటీఆర్​

మానవ రహిత పారిశుద్ధ్య పనుల్లో సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మినీ ఎయిర్ టెక్ మిషన్లను రూపొందించి దేశానికే ఆదర్శంగా నిలిచిన జ‌ల‌మండ‌లి ప్రస్తుతం ఎఫ్ఎస్టీపీల నిర్మాణంతో మరో మైలురాయిని అందుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఓఆర్ఆర్ లోపలి గ్రామాల్లోని సెప్టిక్ ట్యాంక్ మానవ వ్యర్థాలను శుద్ధి చేసి ఇటు పర్యావరణానికి అటు ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఎఫ్ఎస్టీపీలను రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఉత్పన్నమయ్యే సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను చెరువులు, కాలువలు, కుంటల్లో పారబోసి ఇటు పర్యావరణానికి హాని చేస్తూ అటు ప్రజల ఆరోగ్యానికి చేటు చేసే పరిస్థితి ఉండేదని అన్నారు. దీన్ని నివారించడానికి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను శుభ్రపరిచే వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ వాహనాల ఆపరేటర్లకు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణపై శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చామని.. వీరు నగరంలోని సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ప్రతిపాదిత ఎఫ్ఎస్టీపీలలో డంపింగ్ చేయడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. జలమండలి ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు ఎఫ్ఎస్టీపీలు నిర్మిస్తుండగా, వీటిలో ఒకటి ఇవాళ ప్రారంభించామని, మరో రెండు కూడా వినియోగంలోకి వస్తే మానవ వ్యర్థాలను చెరువుల్లో, కుంటల్లో వేసే పరిస్థితి ఉండదని మంత్రి వివరించారు. అంతేకాకుండా  చాలా తక్కువ ధరలో ప్రజలకు ఈ సేవలను అందిస్తున్నామని అన్నారు. సెప్టిక్ ట్యాంక్ వాహనాల ఆపరేటర్లు, కార్మికులకు  త్వరలోనే హెల్త్ కార్డులు కూడా అందజేస్తామని మంత్రి తెలిపారు. ఇలాంటి ఎఫ్ఎస్టీపీలను హైద‌రాబాద్​తో పాటుగా రాష్ట్రంలో మరో 71 ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ

జలమండలి ఓఆర్ఆర్ పరిధిలోని 7 కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 18 గ్రామ పంచాయితీల్లో తాగునీటి సేవలు అందిస్తుంది. ఈ ప్రాంతాల్లో జలమండలి తన సేవలను మరింత విస్తరించే క్రమంలో నూతనంగా, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను తరలించే వాహనాలతో పాటు.. ఎఫ్ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించింది. ఇందులో భాగంగానే జలమండలి ఇప్పటికే ఉన్న ఎస్టీపీలు, ప్రతిపాదిత ఎఫ్ఎస్టీపీల వద్ద సెప్టిక్ వ్యర్థాలను రవాణా, డంపింగ్ కోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సహకారంతో  87 మంది సెప్టిక్ ట్యాంక్ వాహనాల ఆపరేటర్లను ఎంపిక చేసింది. వీరికి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల యొక్క నిర్వహణపై శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడమే కాకుండా విధి నిర్వహణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా సామగ్రితో పాటు, కార్మికులకు ప్రత్యేక యూనిఫాం ను కూడా అందజేసింది. ప్రస్తుతం అంబర్ పేట్, నల్లచెరువు, పెద్దచెరువు, మిరాలం ట్యాంక్, ఖాజాగూడ, నానక్ రామ్ గూడ, నాగోల్, ఖాజకుంటలలో ఉన్న ఎస్టీపీల వద్ధ.. 80 కెఎల్డీ (కిలో లీటర్ పర్ డే) సామర్థ్యం గల, 8 కో-ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించారు. ఇప్పటికే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలను ఇవి శుద్ధి చేస్తున్నాయి. హైదరాబాద్ నల్ల చెరువు వద్ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సహకారంతో 40 కెఎల్డీ సామర్థ్యం గల ఒక నూతన ఎఫ్ఎస్టీపీని నిర్మించారు. నాగారం, ఇంజాపూర్ వద్ద 20 కెఎల్డీ సామర్థ్యం గల మరో రెండు ఎఫ్ఎస్టీపీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణ, క్లీనింగ్ కోసం జలమండలి డయల్-ఎ-సెప్టిక్-ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం 155313/14420కు కాల్ చేసి వినియోగదారులు ఈ సేవలను పొందవచ్చు. 

పరిశుభ్రమైన వాతావరణంలో మన పిల్లలు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ నేతృత్వంలో చాలా రకాల కార్యక్రమాలు చేపట్టాం. డ్రైనేజీలో దిగి శుభ్రం చేసే క్రమంలో ప్రాణాలు పోయిన ఘటనలు చూశాం.  ఇలాంటి కష్టాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.  

                                                                                                                                                  -కేటీఆర్​, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

ఇదీ చదవండి: పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. మహిళ సజీవదహనం

Last Updated :Jul 17, 2021, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.