ETV Bharat / state

నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..

author img

By

Published : Jan 7, 2023, 10:13 AM IST

Love breakup story: రోజూ ఆఫీస్‌కి వెళ్లడం.. రావడం. రెండేళ్లుగా ఇంతే. కంప్యూటర్‌, కుర్చీలు, గోడలు.. ఇవే నా దోస్తులు. నా తీరే అంత. ఏ బంధమూ శాశ్వతం కాదనుకునే రకం. నూతిలో కప్పలా అలా కాలాన్ని ఈదుతున్న రోజుల్లో నన్నో అమ్మాయి ఆకట్టుకుంది. రాయిలాంటి నా మనసుని మంచులా కరిగించింది. కానీ...

Interesting love stories in telugu
Interesting love stories in telugu

Love breakup story: ఆరోజు ఆఫీసు క్యాంటీన్లో టీ తాగుతున్నా. నా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తోందో సౌందర్యం. ఆమెని చూడగానే మనసు జివ్వుమంది. మళ్లీమళ్లీ చూడమని మారాం చేసింది. ‘ఇదేమైనా లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైటా?’ అన్నాడు ఆత్మారాముడు. ‘లవ్వా.. గివ్వా.. అమ్మాయి బాగుంది చూశానంతే..’ నాకు నేనే సర్దిచెప్పుకున్నా. ఆమె ఎదురు పడ్డప్పుడల్లా నిగ్రహ పూజారిలా మనసులోనే మంత్రాలు జపించేవాడిని. అవి తనకు వినిపించాయేమో.. ఎటు వెళ్లినా ప్రత్యక్షమవుతూ నన్ను పరీక్షించేది. ఆమె కనబడినప్పుడల్లా ఆత్మారాముడు లోలోపల డ్యాన్స్‌ చేస్తుంటే.. ఏంటిలా అయిపోతున్నావంటూ నిగ్రహ రాముడు హెచ్చరించేవాడు. ఇద్దరికీ నిత్యం యుద్ధమే.

రోజులు గడుస్తున్నకొద్దీ నా నిగ్రహం సడలింది. ఆఖరికి.. ఆమె కనిపించకపోతే విలవిల్లాడే స్థితికి వచ్చా. ఓసారి తను ఆఫీసులో హాజరు వేస్తుంటే ఐడీ కార్డు చూశా. పేరు తెలిశాక అంబారీ ఎక్కినంత సంబరం. నక్షత్రాల్లా తన చుట్టూ ఎంతోమంది ఫ్రెండ్స్‌ ఉన్నా చందమామలా వెలిగిపోయేది. ముఖానికి కొద్దిగా పౌడరు.. మృదువైన పెదాలపై లిప్‌స్టిక్‌.. నుదుటిన చిన్న బొట్టుబిళ్ల.. అంతే తన మేకప్‌. ఆ సహజ సౌందర్యరాశి నాకు దక్కుతుందా అనే సంశయం మొదలైంది కొన్నాళ్లకు. ఫర్వాలేదు.. గట్టిగా ప్రయత్నిస్తే.. అనుకున్నది జరుగుతుంది అనుకునేవాణ్ని. అదే జరిగితే నీలి నీలి ఆకాశం దోసిళ్లలో తెచ్చి తనకి ఇవ్వాలనుకున్నా.

రోజులు నెలలవుతున్నాయి. నాకు నేను ఆమెతో డ్యూయెట్లు పాడుకోవడం తప్ప.. నోరు విప్పి తనతో మాట్లాడింది లేదు. మరి నా తీయని బాధ ఆమెని చేరేదెలా? అసలు నేను తనని ఫాలో అవుతున్న సంగతి ఆమెకి తెలుసా? ఎన్నాళ్లీ వేదన? ప్రశ్నలతో బుర్ర వేడెక్కేది. హనుమంతుడికి తన బలం గుర్తు చేశాకే.. అవలీలగా సాగరం దాటాడట రామాయణంలో. అలా నా ప్రేమ సాగరాన్ని ఈది తనని చేరడానికి ఎవరైనా సాయం చేస్తే బాగుండు అనిపించేది. కానీ నేను అందరికీ పరాయినేనాయే! అయినా ఏదో నాకు తోచినట్టుగా ప్రయత్నించేవాణ్ని. తన స్వరం వినడం కోసం పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్లడం.. ఒక్కోసారి కావాలనే ఎదురు పడటం.. తన చూపులు నన్ను చేరగానే తల చప్పున కిందికి వేలాడేసుకోవడం.

కొన్నాళ్లయ్యాక అకస్మాత్తుగా కనిపించడం మానేసింది. నా గుండెలో గుబులు. ఆఫీసు మానేసిందా? కొంపదీసి పెళ్లి ఫిక్స్‌ అయ్యిందా? సవాలక్ష సందేహాలు. పోనీ తన ఫ్రెండ్స్‌ను అడిగితే..? ఈ ధైర్యమే ఉంటే తనతోనే నేరుగా మాట కలిపేవాడిని కదా. ఏదేమైనా తను కనబడని రోజు ఓ యుగంలా గడిచేది. ఈ నిరీక్షణకు తెర దించుతూ.. వారమయ్యాక ప్రత్యక్షమైంది. తనని చూడగానే నా మనసుకి రెక్కలొచ్చాయి. ఈసారి కచ్చితంగా మాట్లాడి తీరాల్సిందే అనుకున్నా. రెండుసార్లు తనని ఫాలో అయ్యా. కాటుక అద్దిన ఆ కళ్ల చూపు ఓసారి నాపై పడింది. ఆ క్షణం నా గుప్పెడు గుండెకు పండగే. ‘ఏ కన్నులూ చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే’ అని లోలోపలే పాడుకున్నా.

నా మనసుని పసిగట్టినట్టు పక్కనే ఉన్న ఫ్రెండ్‌తో ఏదో గుసగుసలాడింది. ఆ క్షణం నా గుండె ఆగిఆగి కొట్టుకోసాగింది. కానీ తర్వాత షరా మామూలే. నా ప్రేమకి పచ్చజెండా ఊపినట్టుగా తన పెదాలపై నవ్వులేం పూయలేదు. కనుబొమలు ముడేసి నన్ను కొరకొరా చూడనూలేదు. ప్చ్‌.. గమ్యం సగం చేరాననుకునేలోపే.. ప్రేమ ప్రయాణం మళ్లీ మొదలు పెట్టాల్సిన పరిస్థితి. అయినా ఎప్పటికైనా తను నన్ను ‘హాయ్‌’ అని పలకరిస్తుందనే ఆశిస్తున్నా. అప్పటివరకూ దీపపు కాంతి చుట్టూ పరిభ్రమించే మిణుగురులా ఆమె చుట్టే తిరుగుతుంటా.- మణి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.