ETV Bharat / state

భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం

author img

By

Published : Oct 16, 2020, 6:51 AM IST

రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులవి. కష్టాల కడలికి ఎదురీదుతూనే కాలం వెళ్లదీస్తున్న జీవితాలవి. ఊహించని విధంగా వరద పోటెత్తి వారిని నిండా ముంచేసింది. కొందరికి అయినవాళ్లను దూరం చేస్తే.. మరికొందరిని నిలువ నీడలేకుండా చేసింది. ఉపాధిని కూల్చేసి.. బతుకును భారం చేసింది. ఆరునెలలుగా కొవిడ్‌-19 కష్టాల్ని భరిస్తూ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న జీవితాల్లో జడివాన అలజడి సృష్టించింది. మూడు రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షం సృష్టించిన బీభత్సానికి వేలాదిమంది పేదల ఇళ్లలో కన్నీటి వరదే మిగిలింది.

Hyderabad residents who lost their jobs due to heavy rains in telagana
Hyderabad residents who lost their jobs due to heavy rains in telagana

నిద్రలోనే బతుకులు తెల్లారిపోయాయి

ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అంతా అయిపోయింది. ఎన్నో రోజుల తర్వాత ఇంటికొచ్చిన అక్క.. రాత్రి వరకూ ఆటలాడుతూ అల్లరి చేసిన ఇద్దరు చిన్నారులు.. ఎప్పుడూ వెంటే నిలిచే తమ్ముడు అంతా వరదకు బలయ్యారు. అర్ధరాత్రి అనూహ్యంగా పోటెత్తిన వరద ఒకే కుటుంబంలో నలుగుర్ని జలసమాధి చేసింది. మంగళవారం అర్ధరాత్రి గగన్‌పహాడ్‌ ప్రాంతంలో అప్ప చెరువుకు గండి పడడంతో ఇబ్రహీం కుటుంబం ఛిన్నాభిన్నమైంది.

‘‘నాన్న చనిపోయారు. అమ్మ, తమ్ముడితో కలిసి గగన్‌పహాడ్‌లోని ఓ ఫంక్షన్‌హాల్లో పనిచేస్తున్నా. అక్క కరీమా బేగం(34) జడ్చర్లలో ఉంటోంది. అనారోగ్యంతో ఉన్న ఆమె చికిత్స కోసం సోమవారం భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మా ఇంటికొచ్చింది. మంగళవారం రాత్రి భారీ వర్షం. అర్ధరాత్రి ఇంట్లోకి నీళ్లొచ్చాయి. లేచి బయటికొచ్చే ప్రయత్నం చేశాం. ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచెత్తింది. అక్క, ఇద్దరు పిల్లలు, తమ్ముడు కొట్టుకుపోయారు. ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాం. తెల్లారేసరికి ముగ్గురి మృతదేహాలు దొరికాయి. అల్లుడు సొహైల్‌ (7) ఆచూకీలేదు ఇంకా. ఇన్నాళ్లూ వాళ్ల కోసమే కష్టపడ్డాను. ఇప్పుడు విధి వారిని బలి తీసుకుంది. అమ్మను ఓదార్చడం కష్టంగా ఉంది.

వరద కాటేసింది
బాధితుడు

కలలు ఆవిరై.. కన్నీళ్లు మిగిలాయి!

పాధి కోసం ఉన్న ఊరు వదిలితే నగరం చేరదీసింది. సొంత కాళ్లమీద నిలబడేలా చేసింది. అంతా బాగానే ఉందనుకునేలోపే కరోనా రూపంలో దెబ్బ. ఆర్నెల్ల ఒడిదొడుకులు తట్టుకుని నిలబడి నెల కాకముందే ప్రకృతి ప్రకోపం. బతుకునిచ్చిన బండిని ధ్వంసం చేసింది. బోడుప్పల్‌ నివాసి అబేజ్‌ను రోడ్డున పడేసింది.
‘‘నిజామాబాద్‌ నుంచి ఉపాధి కోసం రెండేళ్ల క్రితం నగరానికొచ్చాను. అప్పు చేసి ఫైనాన్స్‌లో ఏడాదిన్నర క్రితం కారు కొన్నాను. ఓలా కంపెనీ కింద తిప్పేవాణ్ని. ఇన్నాళ్ల కష్టాలు తొలగిపోయాయని అనుకుంటుండగానే కరోనాతో బండి రోడ్డెక్కలేదు. ఊరికి వెళ్లిపోయా. రెండు నెలల క్రితమే మళ్లీ తోలడం మొదలుపెట్టాను. నెలరోజులుగా సవారీలు దొరుకుతున్నాయి. మంగళవారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్‌ విమానాశ్రయానికి క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. దింపేసి వస్తుండగా గగన్‌పహాడ్‌ వద్ద ట్రాఫిక్‌లో కారు చిక్కుకుపోయింది. వెనక్కి తీద్దామంటే మరో వాహనం ఉంది. ఇంతలోనే భారీ వరద కొట్టేసింది. దాదాపు 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ప్రాణాలతో బయటపడ్డా. కారు పూర్తిగా ధ్వంసమైంది. వాహన పత్రాలన్నీ నాశనమయ్యాయి. బీమా వస్తుందో రాదో తెలియట్లేదు. కారు కొనేందుకు చేసిన అప్పు నా నెత్తిన పడింది.’’

వరద కాటేసింది
బాధితుడు

ఇల్లు వదిలి.. ఆకలితో మిగిలి..

డిపించే నాన్న లేడు.. అండగా నిలిచే అన్నలు లేరు.. అయిన వాళ్లెవరూ ఆదుకోరు.. ఆ ఇద్దరు యువతులకు అమ్మ, ఆ ఇల్లే ఆసరా. ముగ్గురూ కష్టపడి పొట్ట పోసుకొనేవారు. మొన్నటి వర్షానికి నీడనిచ్చే ఇల్లు మునిగిపోయింది. తినేందుకు తిండిలేదు. బేగంపేట అల్లంతోటబావి ప్రాంతంలో నిరాశ్రయులైన రాజ్యలక్ష్మి కుటుంబం దీనస్థితి ఇది.

‘‘నాన్న కొన్నేళ్ల క్రితం చనిపోయారు. అక్క, నేను, అమ్మ ఉంటున్నాం. అమ్మ పోచమ్మ ఓ పాఠశాలలో పనిచేస్తారు. నేనూ, అక్క ఏదో ఓ పనిచేసుకుంటాం. ఈ ఇల్లు ఒక్కటి ఆధారం. పక్కనే ఉన్న నాలా పొంగి వర్షాకాలంలో ఇంట్లోకి నీళ్లొస్తాయి. మూడురోజులుగా మునుపెన్నడూ లేనంతగా ఇంట్లోకి మురుగునీరు చేరింది. మనిషి లోతు నీళ్లు. ఇంట్లో సామగ్రి పూర్తిగా నాశనమైపోయింది. సరకులన్నీ తడిచిపోయాయి. పక్కనే తెలిసినవాళ్లు ఆశ్రయమిచ్చారు. రెండురోజులుగా తినేందుకు తిండి సరిగా లేదు. ఎవరూ పట్టించుకోక ఇలా రోడ్డునపడ్డాం.’’

వరద కాటేసింది
బాధితురాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.