ETV Bharat / state

భూ కేటాయింపులపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

author img

By

Published : May 4, 2020, 9:23 PM IST

కోట్ల రూపాయల భూములను పల్లీల్లా కేటాయిస్తున్నారని వ్యాఖ్యానించింది. భూకేటాయింపులపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. సినీ దర్శకుడు శంకర్​కు ఫిలిం ఇనిస్టిట్యూట్​ నిర్మాణం కోసం కేటాయించిన భూమిపై జె.శంకర్​ అనే వ్యక్తి వేసిన పిల్​పై హైకోర్టు విచారణ చేపట్టింది.

high court on director shankar land issue
విలువైన భూములను పల్లీల్లా కేటాయిస్తున్నారు: హైకోర్టు

సినీ దర్శకుడు శంకర్​కు మణికొండలో ఐదెకరాల భూకేటాయింపునకు హేతుబద్ధత ఏమిటో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శంకర్​కు ఫిలిం ఇనిస్టిట్యూట్​ కోసం మణికొండలో కోట్ల రూపాయల విలువైన భూమిని... ఐదు లక్షల రూపాయలకు ఎకరా చొప్పున కేటాయించారని కరీంనగర్​కు చెందిన జె.శంకర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. కోట్ల రూపాయల విలువైన భూములను పల్లీల్లా కేటాయిస్తున్నారని వ్యాఖ్యానించిన హైకోర్టు.. ఓ ఫిలిం ఇనిస్టిట్యూట్ కోసం ఓఆర్ఆర్ పక్కన ఖరీదైన భూమిని కేటాయించడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

శంకర్​తో పాటు మరికొందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా కోట్ల రూపాయల విలువైన భూమిని చౌక ధరకు కేటాయించిందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు. రాష్ట్రంలో భూకేటాయింపులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలన్నీ జతపరిచి తమ ముందుంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. దర్శకుడు శంకర్​కు భూకేటాయింపు ఉత్తర్వులు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చినందున.. ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్​కు తెలిపింది. భూకేటాయింపుపై రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది.

ఇవీ చూడండి: ఉత్కంఠ వీడేనా? లాక్​డౌన్​పై మంగళవారం మంత్రివర్గ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.