ETV Bharat / state

TS HighCourt: 'ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ఇది దర్యాప్తులో జోక్యమెలాగో చెప్పలేదు?'

author img

By

Published : Jan 9, 2023, 8:05 PM IST

Updated : Jan 10, 2023, 6:30 AM IST

MLAs Poaching Case Updates Today
MLAs Poaching Case Updates Today

MLAs Poaching Case Updates Today: ఎమ్మెల్యేలకు ఎరకేసులో ప్రభుత్వ అప్పీలుపై విచారణను హైకోర్టు ఈరోజుకు వాయిదా వేసింది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌గా విచారణ చేపడతామని పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

MLAs Poaching Case Updates Today: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి ఇవ్వడానికి ముఖ్యమంత్రి సీడీలను మీడియాకు ఇవ్వడమే కారణమని చెబుతున్నారని.. ఇది దర్యాప్తులో ఎలా జోక్యమవుతుందో చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తదితరులు దాఖలు చేసిన అప్పీళ్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు కొనసాగిస్తూ సీడీలు ఇవ్వడమే కారణంగా చూపుతున్నారని, ఏకపక్ష దర్యాప్తునకు ఇది ఎలా కారణమో ఎవరూ చెప్పలేదన్నారు. పోలీసుల నుంచి సిట్‌ వరకు దర్యాప్తులో లోపాలను ఎత్తిచూపలేదన్నారు. దర్యాప్తు వక్రమార్గంలో సాగుతుందని, ఫలానా అంశాలను విస్మరించారని పిటిషనర్లు ఎవరూ సింగిల్‌ జడ్జి వద్ద చెప్పలేదన్నారు. కేవలం ఏసీపీ.. సీఎంకు సీడీలు ఇచ్చి ఉంటారన్న భావన తప్ప మరో కారణంలేదన్నారు. సీడీలను మీడియాకు ఇవ్వడం రాజకీయాల్లో భాగమేనని పేర్కొన్న సింగిల్‌ జడ్జి దాన్నే కారణంగా చూపి నిందితుల హక్కులకు భంగం కలుగుతుందని ఆందోళన చెందడం సరికాదన్నారు. అరుదైన కేసుగా పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారని అందులో అంశాలు ఈ కేసుకు వర్తించవన్నారు. దర్యాప్తులో వివక్ష అని చెప్పడాన్ని సమర్థించాలని, ఎందుకంటే పోలీసుల నుంచి చట్టబద్ధమైన హక్కును లాక్కుంటున్నారని చెప్పారు. దర్యాప్తు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, వలపన్ని నిందితులను పట్టుకోవడం, ఎఫ్‌ఐఆర్‌ నమోదు అంతా వాస్తవమేనని, దాన్నెవరూ ప్రశ్నించలేదని పేర్కొన్నారు.

అప్పీలు విచారణార్హం సింగిల్‌ జడ్జి తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలు విచారణార్హమేనని దవే పేర్కొన్నారు. క్రిమినల్‌ కేసుల పరిధిలో తీర్పు వెలువరించినందున దీనిపై అప్పీలును సుప్రీంకోర్టులో దాఖలు చేయాలని, ఇదే హైకోర్టులో కాదన్న ప్రతివాదుల తరఫు న్యాయవాదుల వాదనతో విభేదించారు. దీనికి సంబంధించి అప్పీలు నిబంధనలను పరిశీలించాలన్నారు. వీటిని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. క్రిమినల్‌ కేసులకు సంబంధించిన అభ్యర్థన ఏమీ లేదని, కేవలం దర్యాప్తును మరో సంస్థకు అప్పగించాలని మాత్రమే కోరారన్నారు. అధికరణ 226 కింద పిటిషన్‌ దాఖలు చేసినపుడు దానికే కట్టుబడి ఉండాలని, అంతేగానీ అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేసరికి ఇది క్రిమినల్‌ కేసుల పరిధి అని చెప్పడం సరికాదన్నారు. కేసును కొట్టివేయాలని, ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరలేదని, కేవలం మరో దర్యాప్తు సంస్థకు అప్పగించాలనేనని అందువల్ల ఈ పిటిషన్‌ విచారణార్హమేనని పేర్కొన్నారు.

సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఎ నోటీసులు ఇవ్వడానికి 30 మంది పోలీసులు ఇంటికివచ్చారని, తానేమీ దావూద్‌ ఇబ్రహీంను కాదని న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఉదయ్‌ హొళ్ల తెలిపారు. నోటీసును గోడకు అంటించి ప్రకటనలు ఇచ్చారన్నారు. తాను సాక్షిని మాత్రమేనని, పోలీసులు చర్యను చూస్తే దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడంలేదన్నది స్పష్టమవుతోందన్నారు.

సీఎం ప్రతివాదిగా ఉన్నారు: తుషార్‌ తరఫు న్యాయవాది

మీడియా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేర్చలేదని, ఆరోపణలపై వివరణ లేకుండా, తీర్పు వెలువరించడం చెల్లదన్న ప్రభుత్వవాదన సరికాదని తుషార్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ తెలిపారు. తమ పిటిషన్‌లో సీఎంను ప్రతివాదిగా చేర్చినట్లు చెప్పారు. ఐపీఎస్‌ సర్వీసు నిబంధనల ప్రకారం పోలీసు అధికారులపై చర్యలు, పదోన్నతులు, బదిలీలు అన్నీ ముఖ్యమంత్రి పరిధిలోనే ఉంటాయని చెప్పారు. అలాంటప్పుడు పారదర్శకంగా విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రస్తుతం ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లపైనే వింటున్నామని, ఇప్పటికే ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారనడంతో వాదనలు ముగించారు. తదుపరి విచారణ మంగళవారం కొనసాగనుంది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 10, 2023, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.