ETV Bharat / state

వలసజీవులకు ఇళ్ల వద్దే పరీక్షలు

author img

By

Published : May 14, 2020, 5:35 AM IST

Updated : May 14, 2020, 7:01 AM IST

భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపులిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోకి భారీగా వలస కార్మికులు, ప్రయాణికులు వస్తున్నారనీ, వీరందరికీ వారిళ్ల వద్దనే కరోనా ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్య మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారికి సరిహద్దుల్లోనే వైద్యబృందాలు పరీక్షలు చేసి, 14 రోజులపాటు గృహనిర్బంధంలో ఉండేలా సూచిస్తున్నాయని పేర్కొన్నారు.

health minister etala rajender
వలసజీవులకు ఇళ్ల వద్దే పరీక్షలు

కేంద్రం లాక్‌డౌన్‌ సడలింపులిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోకి భారీగా వలస కార్మికులు, ప్రయాణికులు వస్తున్నారనీ, వీరందరికీ వారిళ్ల వద్దనే కరోనా ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్య మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వారు ఇళ్లకు చేరాక కూడా ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తూ, గడువు పూర్తయ్యే వరకూ ఇంటిపట్టునే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు.

ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రహదారి మార్గంలో 41,805 మంది..

‘‘మొదట విదేశాల నుంచి వచ్చినవారి వల్ల, తర్వాత మర్కజ్‌ ప్రయాణికుల కారణంగా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా జరిగింది. ఇప్పుడు వలసజీవుల వల్ల ఆ ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్రానికి వస్తున్న అంతర్జాతీయ ప్రయాణికులను హోటళ్లలో క్వారంటైన్‌లో ఉంచుతున్నాం. రైళ్ల ద్వారా వచ్చిన వారికి ప్రతి స్టేషన్లోనూ జ్వరపరీక్షలు నిర్వహించి స్వీయ గృహనిర్బంధ పరిశీలన ముద్రను వేసి పంపిస్తున్నారు. వేర్వేరు మార్గాల ద్వారా వచ్చేవారికి ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు క్వారంటైన్‌ నిబంధనలు అమలు చేస్తున్నాం. బుధవారం నాటికి విమానాల్లో 798 మంది, రైళ్లలో 239, రోడ్డు మార్గం ద్వారా 41,805 మంది రాష్ట్రానికి చేరుకున్నారు. సడలింపుల వల్ల ఎక్కువమంది ప్రజలు బయటకు వస్తున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలి ’’

- మంత్రి ఈటల

వైద్యుల సేవలు మరువలేనివి

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యుల సేవలు మరువలేనివని మంత్రి ఈటల కొనియాడారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు ప్లాస్మాథెరపీకి సహకరించడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌తో చేరిన మరో గర్భిణికి ప్రసవం చేశారనీ, సంబంధిత వైద్యులు డాక్టర్‌ షర్మిల, డాక్టర్‌ రాణిలను మంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలో ఐదేళ్లలో శిశు మరణాలరేటు 39 నుంచి 27కు తగ్గడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శమని ఈటల తెలిపారు.

Last Updated : May 14, 2020, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.