ETV Bharat / state

Financial assistance BC communities : కులవృత్తిదారులూ.. ఆర్థిక సాయం కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి

author img

By

Published : Jun 7, 2023, 10:41 AM IST

Telangana
Telangana

Telangana Govt Rs 1 Lakh BC communities : రాష్ట్రంలో బీసీ వర్గాల్లోని కులవృత్తులు, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థికసాయం కోసం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. దీని కోసం 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అర్జీల నమోదుకు అవకాశం కల్పించింది. ఈ పథకాన్ని 9న మంచిర్యాలలో సీఎం కేసీఆర్‌ లాంఛనంగా పంపిణీని ప్రారంభించనున్నారు.

Telangana Govt Financial assistance BC communities : రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల్లోని చేతివృత్తిదారులు, కులవృత్తులకు రాష్ట్ర సర్కార్ అందించనున్న రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించిన ప్రక్రియ షురూ అయింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడానికి వీలుగా ప్రత్యేక వెబ్‌సైట్‌ను అధికారులు రూపొందించారు. మంగళవారం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలయింది. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

ఇందులో భాగంగా రూపొందించిన సంబంధిత వెబ్‌సైట్‌ను సచివాలయంలో మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 9న.. ఈ కార్యక్రమాన్ని మంచిర్యాలలో లాంఛనంగా ప్రారంభిస్తారని గంగుల కమలాకర్ తెలిపారు. అదే రోజున అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఆయా మంత్రులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. గత క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వెనుకబడిన వర్గాల కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయంపై విధివిధానాలను ఖరారు చేసిందని వివరించారు.

TS Govt Offer 1lakh BC Caste Occupations : కుల ధ్రువీకరణపత్రం, ఫొటో, ఆధార్‌, తదితర 38 కాలమ్స్‌కు సంబంధించిన వివరాలతో దరఖాస్తు పత్రాన్ని సరళంగా రూపొందించామని గంగుల కమలాకర్ తెలిపారు. దరఖాస్తులను ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలతో పరిశీలన చేయించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారని వివరించారు. చేతివృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపి.. వారికి ఆర్థిక భరోసాను అందించడంతోపాటు గౌరవప్రదమైన జీవనం కొనసాగించేందుకు సీఎం కేసీఆర్‌ నిరంతరం తపన పడుతుంటారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. లబ్ధిదారులు వృత్తి పరికరాలు, ముడిసరకులు కొనడానికి ఈ నిధులు ఉపయోగపడుతాయని గంగుల కమలాకర్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్య బట్టు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ విధి విధానాలు:

  • ఈ పథకానికి వెనుకబడిన కులాలు, చేతివృత్తులకు చెందిన వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఒక్కో లబ్ధిదారుడికి ఎంచుకున్న వృత్తిలో రాణించడానికి వీలుగా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తారు.
  • ఈ పథకం ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుంది.
  • ఈ పథకానికి 2023 జూన్‌ 2 నాటికి 18-55 ఏళ్ల మధ్య వయస్కులు మాత్రమే అర్హులు.
  • లబ్ధిదారుడి వార్షిక ఆదాయం గరిష్ఠంగా గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించకూడదు.
  • గత అయిదేళ్లలో ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రూ.50,000 అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఇప్పటికే పొందిన లబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.
  • ఈనెల 6 నుంచి 20 తేదీ వరకు https://tsobmmsbc.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • పురపాలికల్లో మున్సిపల్‌ కమిషనర్లు, మండల స్థాయిల్లో ఎంపీడీఓలు ఈనెల 20 నుంచి 26 వరకు దరఖాస్తులను పరిశీలించాలి.
  • జిల్లాస్థాయిలో.. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీ ఎంపిక పూర్తి చేయాలి. ఇందుకు సంబంధించిన అనుమతులను ఈనెల 27 నుంచి జులై 4 వరకు సంబంధిత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల ద్వారా పొందాలి.
  • దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఆ సమాచారాన్ని గ్రామాలు, మండలాల వారీగా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
  • ప్రతినెలా 15న ఎంపికైన లబ్ధిదారులకు ఏక మొత్తంలో రూ.లక్ష ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు.
  • ఏ వస్తువులు, పరికరాలు కొనాలనేది లబ్ధిదారుల ఇష్టమే.
  • నెల రోజుల్లోపు ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులు తమ వృత్తిని ప్రారంభించాలి. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ఒక ప్రత్యేకాధికారిని.. జిల్లా కలెక్టర్‌ నియమించాలి. మరోవైపు లబ్ధిదారుడు ప్రారంభించిన వృత్తికి సంబంధించిన ఫొటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.