ETV Bharat / state

కొరవడిన నాయకత్వం... బలహీనమవుతున్న హస్తం పార్టీ..!

author img

By

Published : Feb 23, 2021, 5:40 AM IST

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై స్పష్టత రాకపోవడం వల్ల పార్టీలో స్తబ్ధత నెలకొంది. క్యాడర్‌కు, నేతలకు భరోసా కల్పించే నాయకత్వం కొరవడడం వల్ల మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌తో మొదలైన వలసలు ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు.

కొరవడిన నాయకత్వం... బలహీనమవుతున్న హస్తం పార్టీ..!
కొరవడిన నాయకత్వం... బలహీనమవుతున్న హస్తం పార్టీ..!

వరుస ఎన్నికల్లో ఓటమి... ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ బలహీనపడుతోంది. దీనికి తోడు నాయకత్వం బలంగా లేకపోవడం వల్ల... పార్టీని వీడే వారిని బుజ్జగించే ప్రయత్నం లేదు. పీసీసీ నియామకం విషయంలో పీటముడి పడడం వల్ల హస్తం పార్టీలో స్తబ్ధత నెలకొంది. ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి... ఇప్పటికే రాజీనామా చేసి ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నాయకులు, పార్టీ క్యాడర్‌కు భరోసా ఇచ్చే నాయకత్వం లేకుండా పోయింది. ఇటీవల విజయశాంతి, గూడూరు నారాయణరెడ్డి కాంగ్రెస్‌ను వీడి... భాజపా కండువా కప్పుకున్నారు. తాజాగా మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ పార్టీని వీడారు. దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో... కమలం పార్టీలో చేరారు. మరోవైపు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి శాసనసభకు పోటీ చేసిన డాక్టర్ పాల్వాయి హరీశ్​... క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు పార్టీ దృష్టికి రావడం వల్ల బహిష్కరించినట్లు పీసీసీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు కోదండరెడ్డి తెలిపారు.

అయోమయంలో పార్టీ శ్రేణులు..

ఏఐసీసీ పిలుపు మేరకు చేసే కార్యక్రమాలు కూడా కలిసికట్టుగా కాకుండా... ఎవరికివారు యమునాతీరే అన్నట్లు నిర్వహించడం వల్ల శ్రేణులు, నాయకులు అయోమయంలో పడుతున్నారు. ఎవరి కార్యక్రమంలో పాల్గోవాలో అర్థంకాని పరిస్థితి. కాంగ్రెస్‌లో కొనసాగితే వృద్ధి ఉండదని భావించేవారు... తెరాస, భాజపా వైపు మొగ్గు చూపుతున్నారు.

ఒకరి వెంట ఒకరు..

గత ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన డాక్టర్ పాల్వాయి హరీశ్​తోపాటు మరికొందరు సీనియర్లు పార్టీ వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద... భాజపాతో సంప్రదింపులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇదీ చూడండి: 'చిన్నారెడ్డిలో చిన్న మచ్చ కూడా లేదు.. గెలిపించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.