ETV Bharat / state

విద్యుత్‌ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లతో షాక్​..!

author img

By

Published : Nov 13, 2022, 10:18 AM IST

Electricity Smart Meters in Ap
Electricity Smart Meters in Ap

Electricity Smart Meters in Ap: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం స్మార్ట్‌ షాక్‌ ఇవ్వబోతోంది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు, నిర్వహణ పేరిట పదేళ్లలో 36వేల కోట్ల రూపాయల భారం వేయనుంది. పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ పథకం- ఆర్​డీఎస్​ఎస్ కింద రాష్ట్రంలోని గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్‌ కనెక్షన్లకు 2025 డిసెంబరు నాటికి దశలవారీగా స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేయనుంది. పరోక్షంగా మీటర్ల తయారీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని నిపుణులు ఆరోపిస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లతో షాక్​..!

Electricity Smart Meters in Ap: విద్యుత్‌ పంపిణీలో స్థూల సాంకేతిక, వాణిజ్య నష్టాలు 15శాతం కంటే ఎక్కువగా ఉన్న ఏపీ రాష్ట్రాల్లో పంపిణీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ పథకం-ఆర్​డీఎస్​ఎస్ అమలు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను నిర్దేశించింది. స్మార్ట్‌ మీటర్లు, ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ లైన్ల ఏర్పాటు ద్వారా 2024-25 నాటికి నష్టాలను 12-15 శాతానికి తగ్గించాలన్నదే ఈ పథకం లక్ష్యం.

దీన్ని అమలు చేసే అధికారాన్ని కేంద్రం ఆయా రాష్ట్రాల డిస్కంలకు కట్టబెట్టింది. తప్పనిసరి చేయలేదు. అయితే రాష్ట్రంలో 2021-22 నాటికే మూడు డిస్కంల సగటు నష్టాలు 11.21శాతమే ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం, దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ, కేంద్ర ప్రభుత్వం తరఫున విద్యుత్‌ ఆర్థికసంస్థ 2022 మార్చి 25న త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశాయి.

మీటరు ధర 6వేల రూపాయలు: దీన్ని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి- ఏపీఈఆర్​సీ ఆమోదం కోసం 2022 మే 12న రాష్ట్ర ప్రభుత్వం పంపింది. మీటర్ల ఏర్పాటు, నిర్వహణ టెండరు ప్రతిపాదనల్ని డిస్కంలు న్యాయ సమీక్షకు పంపాయి. ఈ పథకం కింద రాష్ట్రంలో సుమారు కోటిన్నర స్మార్ట్‌మీటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మీటరు ధర 6వేల రూపాయలుగా కేంద్రం నిర్దేశించింది. ఇందులో కేంద్రం 900 రూపాయలు గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన భారాన్ని ప్రజలు మోయక తప్పదు.

మహారాష్ట్రలో స్మార్ట్‌మీటరు ఏర్పాటు, ఏడున్నరేళ్ల నిర్వహణకు ఒక్కో కనెక్షన్‌కు నెలకు 200 రూపాయల ధరను అక్కడి డిస్కంలు ఖరారుచేశాయని ఇంధనశాఖ చెబుతోంది. ఈ లెక్కన ఏడున్నరేళ్లలో దాదాపు 18వేల రూపాయల వరకు చెల్లిస్తారు. ఇందులో స్మార్ట్‌మీటర్‌ ధర 6వేల రూపాయలను మినహాయిస్తే.. నిర్వహణ ఛార్జీలు 12వేలు అవుతాయి.

ఈ రేట్ల ప్రకారమే లెక్కిస్తే రాష్ట్రంలో మొదటి విడత ప్రతిపాదించిన 50లక్షల 69వేల కనెక్షన్లకు మీటర్ల కొనుగోలు, నిర్వహణకు నెలకు 101.87 కోట్ల రూపాయలు వెచ్చించాలి. ఏడాదికి 12వందల 22కోట్ల 40 లక్షలు రూపాయలు, పదేళ్లలో 12వేల 224 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. దీని ప్రకారం మూడు డిస్కంల పరిధిలోని కోటిన్నర విద్యుత్‌ కనెక్షన్లకు పదేళ్లలో 36వేల 220 కోట్ల 17 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది.

మీటర్ల స్థానంలో.. స్మార్ట్‌మీటర్లు: ప్రస్తుతం ఉన్న మీటర్ల స్థానంలో స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేస్తే ప్రతినెలా రీడింగ్‌ నమోదుచేయాల్సిన అవసరం ఉండదని, దీనికోసం వెచ్చించే మొత్తం మిగులుతుందని డిస్కంలు చెబుతున్నాయి. మీటర్‌ రీడింగ్‌ నమోదుకు ఒక్కో కనెక్షన్‌కు సగటున 10 రూపాయల చొప్పున ఖర్చుచేస్తునట్లు భావిస్తున్నా, రాష్ట్రంలోని కోటిన్నర విద్యుత్‌ కనెక్షన్లకు ప్రతినెలా 15 కోట్లు రూపాయలు ఖర్చు అవుతుంది.

ఏడాదికి 180 పదేళ్లలో 18వందల కోట్ల రూపాయలు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో విద్యుత్‌ చౌర్యం నియంత్రణలోకి వస్తుందని డిస్కంలు భావిస్తున్నాయి. వాణిజ్య, పంపిణీ నష్టాలు కనీసం 1% తగ్గే అవకాశం ఉందని.. మీటర్లు ఏర్పాటుచేసిన ఖర్చులో దీన్ని సర్దుబాటు చేస్తామని డిస్కంలు చెబుతున్నాయి. దీనిపై డిస్కంల దగ్గర స్పష్టమైన లెక్కలులేవు. ఇప్పటికే ఆర్​డీఎస్​ఎస్ కింద కేంద్రం నిర్దేశించిన లక్ష్యాల్ని దాదాపు డిస్కంలు చేరుకున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు చెబుతున్నట్లు 36 వేల కోట్లు ఆదా చేయడం సాధ్యమేనా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్‌మీటర్ల వల్ల ప్రజలపై భారం తప్ప అదనపు ప్రయోజనం లేదని అంటున్నారు. రాష్ట్రంలో ప్రతి ఫీడర్‌కూ ప్రత్యేక మీటర్‌ ఉందని దాన్నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను ప్రతిగంటకూ నమోదు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పుడు పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర మీటర్లు ఏర్పాటుచేస్తే లెక్కలు పక్కాగా వస్తాయని, ఏ ఫీడర్‌లో విద్యుత్‌ చౌర్యం జరుగుతుందో తెలుస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని సూచిస్తున్నారు. స్మార్ట్‌ మీటర్ల వల్ల పరోక్షంగా మీటర్ల తయారీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.