ETV Bharat / state

కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు మళ్లీ నిరాశే

author img

By

Published : Feb 2, 2023, 6:51 AM IST

Updated : Feb 2, 2023, 7:03 AM IST

Etv Bharat
Etv Bharat

Disappointment for Telangana in Union Budget 2023-24 : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మరోసారి నిరాశే ఎదురైంది. విభజన హామీలు, ప్రత్యేక నిధులు, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులకు చోటు దక్కలేదు. కేంద్ర పథకాలకు నిధుల తగ్గించడం.. రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి పెంచకపోవడం వల్ల అప్పులకు తిప్పలు తప్పేలా లేవు. చిరుధాన్యాలకు ప్రోత్సాహం, గిరిజనుల కోసం ఉద్దేశించిన కార్యక్రమాలతో కొంత ప్రయోజనం కలగనుంది.

కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు మళ్లీ నిరాశే

Disappointment for Telangana in Union Budget 2023-24 : ఎన్నికల ఏడాదైనా కేంద్ర బడ్జెట్‌లో తగిన తోడ్పాటు లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది. అందులో భాగంగా పలు విజ్ఞప్తులు, ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్రం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మాత్రం వాటికి స్థానం దక్కలేదు. రాష్ట్రానికి హక్కుగా వచ్చే పన్ను వాటా, కేంద్ర పథకాలకు నిధులు మాత్రమే రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రానికి తగిన తోడ్పాటు అందించాలని.. బకాయిలు ఇవ్వడంతో పాటు విభజన చట్టం హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతులు ఫలించలేదు.

Allocations for Telangana in Union Budget 2023-24 : సాగునీటి జాతీయ ప్రాజెక్టు, ఐటీఐఆర్ లేదా సమాన ప్రాజెక్టు, ఫార్మాసిటీ, పారిశ్రామిక కారిడార్లు, నిమ్జ్, హైదరాబాద్ మెట్రో, టెక్స్ టైల్ పార్క్, బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తదితరాలకు కేంద్ర బడ్జెట్‌లో చోటు దక్కలేదు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆశలు ఫలించలేదు. కేంద్రం ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల్లో కోత విధించడంతో.. సుమారు రూ.19 వేల కోట్ల రుణాలను రాష్ట్రం పొందలేకపోయింది.

ప్రత్యేక నిధులు దక్కలేదు: ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచడంతోపాటు, కార్పొరేషన్‌ రుణాలను దాని పరిధి నుంచి మినహాయించాలని.. రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోలేదు. జీఎస్‌డీపీలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతం కంటే పెంచాలన్న విజ్ఞప్తిని పట్టించుకోలేదు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు, ఏపీకి పొరపాటున వెళ్లిన సీఎస్‌ఎస్ నిధులు కూడా రాలేదు. ఆర్థిక సంఘం సిఫారసు చేసిన ప్రత్యేక నిధులు దక్కలేదు.

సర్కార్ వినతులు ఫలించలేదు: పలు పట్టణాభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని, చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలన్న సర్కార్ వినతులు ఫలించలేదు. హైదరాబాద్‌ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు రూ.8,453 కోట్లు ఇవ్వాలని కోరినా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, గిరిజన విశ్వవిద్యాలయం, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీల ప్రస్తావన లేకుండా పోయింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి బడ్జెట్‌లో నిధులివ్వాలని మూడేళ్లుగా కోరుతున్నా ఫలితం దక్కలేదు.

మిషన్‌ భగీరథకు రూ.19,205 కోట్లు, మిషన్‌ కాకతీయకు రూ.5,000 కోట్లను ప్రత్యేకంగా ఇవ్వాలని అయిదేళ్ల కిందటే నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రూపంలోనూ రాష్ట్రానికి తోడ్పాటు కరవైంది. మిషన్‌ భగీరథ నిర్వహణకు రూ.2,350 కోట్లు ఇవ్వాలని రాష్ట్రం విన్నవించింది. కొత్త జిల్లాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరినా పరిగణనలోకి తీసుకోలేదు.

తొమ్మిది వెనుకబడిన జిల్లాలకు 2019-20 నుంచి ఇవ్వాల్సిన రూ.1,350 కోట్ల బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ వినతులూ గాలికి పోయాయి. నర్సింగ్ కళాశాలల విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుందని అంటున్నారు. కేంద్ర పన్నుల్లో వాటాగా 2023-24లో రాష్ట్రానికి రూ.21,470 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఉపాధిహామీ, ఎరువుల రాయితీ, పత్తి కొనుగోళ్లకు నిధులు తగ్గించారు. ఈ ప్రభావం రాష్ట్రంపై కూడా పడనుంది. చిరుధాన్యాల ప్రోత్సాహం కోసం హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలను ప్రోత్సహించడం, ఏకలవ్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, ఆదిమ గిరిజన జాతుల కోసం ప్రత్యేక కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి కొంత మేర అదనపు నిధులు వచ్చే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:'దేశానికి ఆదాయం తెచ్చే తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం'

'అమృతకాలపు బడ్జెట్.. నవ భారతానికి బలమైన పునాది'

Last Updated :Feb 2, 2023, 7:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.