ETV Bharat / state

ఏజెన్సీలో ఇంకా ప్రారంభంకాని భూలావాదేవీలు..

author img

By

Published : Nov 12, 2020, 8:08 AM IST

Updated : Nov 12, 2020, 9:44 AM IST

రాష్ట్రంలో గిరిజనులు నివసిస్తున్న షెడ్యూల్డు ప్రాంతాల పరిధిలోని జిల్లాల్లో భూయాజమాన్య హక్కుల కల్పన ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు ప్రారంభం కాగా.. ఏజెన్సీ జిల్లాల్లో ఇంకా అమల్లోకి రాలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఏజెన్సీ ప్రాంతాల్లో భూ యాజమాన్య హక్కుల మార్పిడికి ప్రత్యేక విధానాలు ఉండటమే దీనికి కారణం. ఇందుకు ధరణి సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

Delay in land disputes in the agency
ఏజెన్సీలో భూలావాదేవీల్లో జాప్యం.. కే,ఎల్‌ ఫారాల జారీకి ఆటంకాలు

రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతోపాటు మరికొన్ని అటవీ ప్రాంతాల పరిధిలో ఏజెన్సీ గ్రామాలున్నాయి. 1970లో అమల్లోకి వచ్చిన షెడ్యూల్డు ప్రాంతాల చట్టాన్ని అనుసరించి ఈ గ్రామాల్లో భూ క్రయవిక్రయాలన్నీ గిరిజనుల మధ్యనే కొనసాగాల్సి ఉంది. 1970 కన్నా ముందు నుంచి ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనేతరుల భూములకు హక్కులు కొనసాగుతున్నాయి. వారి తదనంతరం వారసులకు మాత్రమే హక్కులు వర్తిస్తాయి. దీనికి భిన్నంగా ఎక్కడైనా భూ లావాదేవీలు జరిగినా భూబదిలీ నిషేధిత చట్టం (ఎల్టీఆర్‌) కింద కేసు నమోదు చేస్తారు. ఇలాంటి 95 వేల ఎల్టీఆర్‌ కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి.

ప్రత్యేక ఫారాలు జారీ చేయాల్సి ఉండటంతో..

గిరిజనులకు భూమి హక్కులు దక్కాలన్నా ప్రత్యేక నమూనాలో రూపొందించిన ‘కే’ ఫారంతో తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గిరిజనుడి ఆర్థిక స్థోమత, భూమి కొనుగోలు తీరుపై తహసీల్దారు విచారణ నిర్వహించి ఐటీడీఏ పీవో లేదా కలెక్టర్‌కు నివేదిక పంపాల్సి ఉంటుంది. కలెక్టర్‌ ‘ఎల్‌’ ఫారం నమూనాలో అనుమతి ఇస్తారు. ఆ తర్వాతే భూమిపై హక్కులు కల్పించి, పాసుపుస్తకం మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించిన ఐచ్ఛికాలు ధరణి పోర్టల్లో లేవు. దీంతో గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నారు. ఇవి పూర్తయితే తప్ప లావాదేవీలు ప్రారంభం కావు. ఇందుకు మరికొద్ది రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

సాదాబైనామాలకు లభించని అనుమతులు

ఏజెన్సీ చట్టాల నేపథ్యంలో సాదాబైనామాలకూ అనుమతులు లభించడం లేదు. ఇతర గిరిజనుల నుంచి తెల్లకాగితాలపై ఒప్పందం చేసుకుని కొనుగోలు చేసిన భూములను క్రమబద్ధీకరించాలని నిరుపేదలైన గిరిజనులు చాలాకాలంగా కోరుతున్నారు. 2016లో చేపట్టిన సాదాబైనామాల క్రమబద్ధీకరణ సమయంలో ఇందుకు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం అవకాశం కల్పించడంతో పెద్దసంఖ్యలో గిరిజనులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏజెన్సీ చట్టాలను అనుసరించైనా అర్హుల భూములను క్రమబద్ధీకరించి పట్టాలిస్తే రైతుబంధు, బీమా పథకాలు పొందడానికి వీలవుతుందంటున్నారు.

Last Updated : Nov 12, 2020, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.