ETV Bharat / state

Diwali 2022: మోత మోగిస్తున్న దీపావళి టపాసుల ధరలు.. మరీ ఇంతలానా!

author img

By

Published : Oct 24, 2022, 8:36 PM IST

Diwali festival: రాష్ట్రవ్యాప్తంగా దీపావళి పండగను ప్రజలంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. గతేడాదితో పోల్చితే బాణసంచా ధరలు మండిపోతున్నాయని జనం వాపోతున్నారు . పిల్లల ఆనందం కోసం తగ్గించి కొంతస్థాయిలో టపాసులు కొంటున్నామని చెబుతున్నారు. కొనుగోళ్లు తగ్గి బేరాలు పడిపోయాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

diwali 2022
బాణసంచా ధరలు

బాణసంచా ధరల మోత

Diwali festival in telangana: రాష్ట్రవ్యాప్తంగా ప్రమిదల పండగ... దీపావళి కోలాహలం నెలకొంది . చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలంతా సంతోషంతో పండుగను జరుపుకుంటున్నారు . చిన్నా, పెద్ద వెలుగుల ఉత్సవాన్ని ఆస్వాదిస్తున్నారు . టపాసుల కొనుగోళ్లతో దుకాణాల వద్ద సందడి నెలకొంది. అందరి ఇళ్లల్లో కొత్త కాంతులు విరజిమ్మాలని అందరూ నూతన ఉత్సాహంతో దీపావళిని జరుపుకుంటున్నారు. కానీ టపాయలు పేలుళ్లు మాత్రం అప్పుడే పేలుతున్నాయి.

ఖమ్మం జిల్లాలో టపాకాయల సందడి.. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో టపాసుల అమ్మకానికి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. విజయవాడ ఘటన దృష్ట్యా అగ్నిమాపక శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది టపాసుల ధరలు భారీగా పెరిగాయని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. చాలా ఎక్కువ ధరలు చెప్పి..డిస్కౌంట్‌ పేరుతో డబ్బులు దండుకున్నారని వాపోయారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం రేట్లు బాగా పెరిగాయని ప్రజలు తెలిపారు.

హనుమకొండలో మునుపెన్నడు లేని విధంగా ఉన్న ధరలు.. హనుమకొండలో బాణసంచా దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. నగంలోని పలు ప్రాంతంతో టపాసుల దుకాణాలు విరివిగా వెలిశాయి. గతేడాది కంటే ఈసారి ధరలు 50 శాతం పెరిగాయని ప్రజలు హడలెత్తిపోతున్నారు. ధరల మోతతో కొనుగోలు చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. సంచులకొద్దీ కొనేవారు సైతం అరసంచికే పరిమితమయ్యారు. ఈ సంవత్సరం తీసుకున్న టపాయలు మునుపెన్నడూ లేని విధంగా ధరలు భగ్గుమంటున్నాయి.

పాలమూరులో దద్దరిల్లిన బాణాసంచా వెలలు.. పాలమూరులో బాణాసంచా దుకాణాలు కొనుగోళ్ల సందడి లేక వెలవెలబోయాయి. కరోనా ప్రభావం తర్వాత పండగ ఉత్సాహం అంతగా కనిపించడం లేదు. బాణసంచా ధరలు ఆకాశాన్ని అంటడం వల్ల జనం బెంబెలెత్తిపోతున్నారు . చిచ్చుబుడ్లు, రాకెట్లు, భూచక్రాలు థౌసండ్ వాలా లాంటి టపాసుల ధరలు గతేడాది పోల్చితే 50శాతం మేర పెరిగాయి. గతేడాది వెయ్యి రూపాయల్లో కొనుగోలు చేసిన టపాసులకు ఇప్పడు 3 వేల వరకూ పెట్టాల్సి వస్తోందని వినియోగదారులు అంటున్నారు. కాల్చకముందే ధరలు పేలిపోతున్నాయని, రాకెట్ల కంటే వేగంగా ఆకాశంలోకి దూసుకువెళ్లాయని వాపోతున్నారు. గ్రహణం కారణంగా దీపాలు పెట్టాల వద్దా అన్న మీమాంసలో జనం పడిపోవడంతో కొనుగోలు చేయడం లేదని తయారీ దారులు అంటున్నారు. గత సంవత్సరం రూ. 300గా ఉన్న చించుబుడ్డి ప్యాకెట్​లు ఇప్పుడు1200 రూపాయలు పలికిందని కొనుగోలుదారులు తెలిపారు.

నిజామాబాద్​లో జనావాసాల మధ్య దుకాణాలు.. నిజామాబాద్‌ దేవిరోడ్‌, గంజ్‌ పరిసరాల్లో టపాసుల దుకాణాలు జనావాసాల మధ్య నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. చిన్నచిన్న గల్లీల్లో ప్రమాదం జరిగితే కనీసం ఫైరింజన్ సైతం లోపలికి వెళ్లే దారి లేదని చెబుతున్నారు. వినాయక్ నగర్, ఆర్యనగర్, ఆర్మూర్ రోడ్డులో రహదారులపైనే టపాకాయలు అమ్ముతున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా ఇబ్బడి ముబ్బడిగా అమ్ముతున్నా అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదని జనం ఆక్షేపిస్తున్నారు.

వ్యాపారుల వేదన.. వర్షాలు, మడి సరుకు ధరలు పెరగడం వంటి కారణాల వల్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడం వల్ల మండిపోతున్నాయని విశ్లేషిస్తున్నారు. సూర్యగ్రహణం కారణం ప్రజలు దీపాలు, టపాకాయలు కొనాలా వద్దా అనే ఆలోచనలో పడడం వల్ల ఈసారి కొనుగోలు దారులు ఎక్కువగా రాకపోవడం వల్ల కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారస్థులు చెప్పుతున్నారు.

హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లలో బాణసంచా దుకాణాలు వెలిశాయి. మాదాపుర్ గచ్చిబౌలి , రాయదుర్గం , కోఠి, మియాపూర్‌, సికింద్రాబాద్‌, రాణిగంజ్‌, మియాపూర్‌, చందానగర్‌లో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. చిన్నచిన్న గల్లీల్లోనూ మతాబుల షాపులు వెలిశాయి. దీంతో అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక వాహనం వెళ్లడానికి కూడా దారిలోని విధంగా ఉంది. దీంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.