ETV Bharat / state

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు ద్వంద్వ తీర్పును ఇచ్చింది- డి.రాజా

author img

By

Published : Jan 2, 2023, 7:02 PM IST

CPI leaders comments on demonetisation: నోట్ల రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ద్వంద్వ తీర్పును ఇచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. ఈ తీర్పు ద్వారా కొన్ని ప్రశ్నలు తలెత్తాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హిమాయత్​నగర్​లోని ముగ్ధం భవన్​లో పార్టీ నేతలతో కలిసి మాట్లాడిన ఆయన.. మోదీ ప్రభుత్వం పార్లమెంట్​లో కనీసం చర్చ జరపకుండా.. ఏకపక్షంగా నోట్లు రద్దు చేశారని ఆయన మండిపడ్డారు.

CPI leader D Raja
CPI leader D Raja

CPI leaders comments on demonetisation: భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేసిన పెద్ద నోట్లపై సుప్రీంకోర్టు నుంచి ద్వంద్వ తీర్పు ఇచ్చిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. ఈ తీర్పు మెజారిటీ అభిప్రాయాన్ని మైనారిటీపై రుద్దడమేనని అభిప్రాయపడ్డారు. పేదలు, మైనారిటీ వర్గాల అభిప్రాయానికి ఉనికి లేకుండా పోయిందని.. ఈ తీర్పు ద్వారా కొన్ని ప్రశ్నలు తలెత్తాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ముగ్ధుం భవన్​లో పార్టీ నేతలతో కలిసి ఆయన మాట్లాడారు.

ప్రజాస్వామ్యంలో పార్లమెంట్​ సుప్రీం.. అలాంటి పార్లమెంట్‌లో కనీసం చర్చ చేయకుండా నరేంద్ర మోదీ ఏకపక్షంగా అర్థరాత్రి పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని ఆక్షేపించారు. నల్లధనం అంతా వెనక్కి తీసుకొచ్చి ప్రతి కుటుంబం బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామని ప్రధాని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తదనంతరం పరిణామాలు, పర్యవసానాలు నేపథ్యంలో శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల ముందు‌ పెట్టలేదని ధ్వజమెత్తారు.

మోదీ అరాచక పాలన నిరసిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడించాలన్నది సీపీఐ లక్ష్యంగా పెట్టుకుందని ప్రకటించారు. "సేవ్ ఇండియా - సేవ్ డెమోక్రసీ" నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ ఏడాది త్రిపుర, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ పక్షాలను ఓడించాలని పిలుపు ఇస్తున్నామని స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్రాల స్థాయిల్లో బీజేపీని ఓడించేందుకు లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు కలిసి ముందుకు రావాలని పిలుపు ఇస్తున్నామని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో మోదీ సర్కారు పాలన అధ్వాన్నంగా ఉందని ఆరోపించారు.

'ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతుంటే.. : ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని.. నిత్యావసర వస్తువులు సహా అన్ని రకాల ఉత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు‌ పతనమైన నేపథ్యంలో కంపెనీలకు అనుమతి ఇస్తూ ధరలు‌ పెంచుకునే అధికారం కల్పించిందని‌ అన్నారు. సూక్ష్మ, మధ్య తరహా, భారీ పరిశ్రమల నిర్వహణ సంక్లిష్టంగా మారాయని వాపోయారు.

కీలక వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిన దృష్ట్యా రైతులు కనీస మద్దతు ధరలు‌ పొందలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎస్పీ విషయంలో కేంద్రం కనీస హామీ‌ ఇవ్వడం లేదని‌ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతుంటే కార్పొరేట్ సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయని ఆయన విమర్శించారు. అదానీ, అంబానీలు, ఇతర కార్పొరేట్ హౌసులు వృద్ధి సాధిస్తున్నాయని రాజా ఆరోపించారు.

'తెలంగాణలో బీజేపీ కృత్రిమ రాజకీయ వేడి సృష్టిస్తోంది': కార్యక్రమంలో మాట్లాడిన కూనంనేని సాంబశివరావు.. రాష్ట్రంలో బీజేపీ కృత్రిమ రాజకీయ వేడి సృష్టిస్తుందని ధ్వజమెత్తారు. మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని విమర్శించారు. తమ బాధ్యతగా సీపీఐ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని.. ప్రజా సమస్యలు పరిష్కరించే బాధ్యత వామపక్షాలపై ఉందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఒక్కసారైనా ప్రజాసమస్యలపై పోరాడిందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు చాడ వెంకటరెడ్డి పల్లా వెంకటరెడ్డి, అజీజ్ పాషా, పశ్య పద్మ, ఇతర నాయకులు పాల్గొన్నారు. దివంగత నేత ఏబీ బర్ధన్ వర్థంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.