ETV Bharat / state

ఏప్రిల్​లో నిమిషానికి 3 కేసులు నమోదు

author img

By

Published : May 1, 2021, 4:01 PM IST

కరోనా మహమ్మారి రాష్ట్రంలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఒక్క నెలలోనే సుమారు లక్షా 30 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నిమిషానికి కనీసం ముగ్గురికి మహమ్మారి సోకుతోందని వైద్యారోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మహానగారాన్ని మహమ్మారి చుట్టేస్తోంది. పాజిటివ్‌ రేటు దాదాపు 10 శాతానికి చేరినట్లు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి.

covid positive rate
విడ్‌ పాజిటివ్‌ రేటు

కొవిడ్‌ మహమ్మారి రాష్ట్రంలో చాపకింద నీరులా చుట్టేస్తోంది. నిత్యం వందలాది మందికి కరోనా సోకుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో 3లక్షల 9వేల 741మంది కొవిడ్‌ బారిన పడగా.. ఏప్రిల్ చివరి నాటికి అది కాస్తా.. 4లక్షల 43 వేల360కి చేరింది. అంటే ఒక్క ఏప్రిల్ నెలలోనే లక్షా 33వేల 619మందికి కరోనా నిర్ధరణ అయింది. రోజుకి సరాసరిన 4వేల453 మందికి వైరస్‌ సోకిందని వైద్యారోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే గడచిన నెల రోజుల్లో ప్రతి గంటకి 185 మంది చొప్పున... నిమిషానికి కనీసం ముగ్గురికి పైగా వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. యాక్టివ్ కేసులు సైతం మార్చి చివరి నాటికి కేవలం 6వేల159 ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 78వేల888కి పెరిగింది.

వేగంగా సెకండ్​ వేవ్​

కరోనా ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్ వేగంగా విస్తరిస్తోందని అధికారిక లెక్కలు చెబుతుండగా మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. గత నెలరోజుల్లో 606 మందిని వైరస్ బలితీసుకుంది. అంటే రోజుకి సగటున కనీసం 20 మంది మహమ్మారితో మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేటు సైతం నెలరోజుల్లోనే సుమారు 16శాతం తగ్గటం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. మార్చి చివరినాటికి రాష్ట్రంలో 97.5 శాతానికి పైగా వైరస్ బారిన పడినవారు కోలుకుంటుండగా.. ప్రస్తుతం అది 81.68 కి పడిపోయింది. మరీ ముఖ్యంగా జీహెచ్​ఎంసీపై కరోనా బుసకొడుతోంది. గత నెలరోజుల్లో రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 17.3శాతం కేసులు ఒక్క గ్రేటర్‌ పరిధిలోనే నమోదయ్యాయి. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలపైనా కరోనా తీవ్రత అధికంగా ఉంది.

రాష్ట్రంలో గతేడాది మార్చిలో మహమ్మారి వెలుగు చూడగా.. ఏడాది కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏప్రిల్‌లో వైరస్ శరవేగంగా విస్తరించటంతో పాటు... వందలమంది ప్రాణాలను బలితీసుకుంది. వచ్చే నాలుగు వారాలు సైతం పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ వైరస్‌ బారినపడకుండా రక్షించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: వాస్తవాలన్నీ బయటకు రావాలి: ఈటల రాజేందర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.