ETV Bharat / state

పెచ్చుమీరుతున్న కేసులు... నిండుతున్న ఐసీయూ పడకలు

author img

By

Published : Apr 25, 2021, 6:39 AM IST

‘‘రాష్ట్రంలో శనివారం కేవలం పది గంటల వ్యవధిలో కరోనా బాధితుల్లో 785 మందికి ఆక్సిజన్‌, 185 మందికి ఐసీయూ చికిత్సలు అవసరమయ్యాయి. అంటే నిమిషానికి 1.3 మంది చొప్పున గంటకు 78.5 మందికి ప్రాణవాయువుతో వైద్యం చేయాల్సి వచ్చింది. సకాలంలో వైద్యం అందక, పరిస్థితి విషమించటంతో 185 మందికి ఐసీయూలో చికిత్స తప్పనిసరి అయ్యింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల ఆక్యుపెన్సీ, బాధితుల సంఖ్యను పరిశీలిస్తే కరోనా ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది’’

corona-cases-increasing-in-telangana-and-people-are-suffering-for-oxygen
పెచ్చుమీరుతున్న కేసులు... నిండుతున్న ఐసీయూ పడకలు

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. లక్షణాలు కనిపిస్తున్నా సకాలంలో నిర్ధారణ పరీక్షలు, చికిత్స పరంగా నిర్లక్ష్యం చేస్తున్న కొద్దీ, ఇతర వ్యాధులున్న బాధితుల పరిస్థితి తీవ్రమవుతోంది. వారిలో 30 శాతం మందికి ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సి వస్తోంది. ఆక్సిజన్‌పై చేరికలు గణనీయంగా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 18,506 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దీర్ఘకాలిక సమస్యల వల్లే

తొలిదశ, రెండోదశకు ముందుగా ఆసుపత్రి చికిత్సలు తక్కువగానే ఉన్నా, వైరస్‌ వ్యాప్తి పెచ్చుమీరటంతో పరిస్థితి చేయిదాటుతోంది. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నా కొందరికి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో పరిస్థితి తీవ్రమవుతోంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తడంతో ఆక్సిజన్‌ కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులెట్టాల్సి వస్తోంది. మరోవైపు ఆసుపత్రుల్లో చేరికలు పెరగడంతో కొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలు నిండుకున్నాయి. ప్రైవేటులో మరిన్ని వైద్య కేంద్రాలకు అనుమతులిస్తూ పడకల స్థాయి పెంచుతున్నా ఆక్యుపెన్సీ రేటూ అదే మాదిరి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఆక్యుపెన్సీ


ఆసుపత్రులకు బారులు..

గత రెండు వారాలుగా కేసులు తీవ్రం కావడంతో ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. తొలుత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉన్నా ఇటీవల రెండింతలకు పైగా పెరిగింది. ఏప్రిల్‌ పది నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకలపై 1090 మంది ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3136కి చేరింది. ఐసీయూ పడకలపై 328 మంది ఉంటే ఇపుడు బాధితుల సంఖ్య 1246కి పెరిగింది. శనివారం ఒక్కరోజునే ఉదయం పది నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి సాధారణ, ఆక్సిజన్‌, ఐసీయూ పడకల్లో వెయ్యి మంది చేరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకలపై కొత్త చేరికల సంఖ్య 428గా నమోదైంది. ఐసీయూ పడకల్లో చేరికలు 67గా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటులోనూ చికిత్సకు మరిన్ని దవాఖానాలను అనుమతిస్తోంది. మౌలిక సదుపాయాలను పరిశీలించి అనుమతులు ఇవ్వగా రెండువారాల క్రితం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్‌ పడకలు 4171 నుంచి శనివారానికి 10020కి పెరిగాయి. ఐసీయూ పడకలు 3331 నుంచి 6735కి చేరాయి.

ఇదీ చూడండి: పంజా విసురుతోన్న కరోనా... పాడెలెక్కుతున్న బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.