ETV Bharat / state

'ప్రధాని రావడం.. కేసీఆర్ బెంగళూరు వెళ్లడం.. అవగాహనలో భాగమే'

author img

By

Published : May 27, 2022, 5:45 PM IST

Jaggareddy Comments: ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర సమస్యలు అడిగే బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రధానిని ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజల ముందే ప్రధానిని నిలదీశారన్నారు. మరి సీఎం కేసీఆర్ ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ప్రధాని రావడం.. కేసీఆర్ వెళ్లడం అవగాహనలో భాగమే: జగ్గారెడ్డి
ప్రధాని రావడం.. కేసీఆర్ వెళ్లడం అవగాహనలో భాగమే: జగ్గారెడ్డి

Jaggareddy Comments: ప్రధాన మంత్రి హోదాలో తెలంగాణ వచ్చిన మోదీ.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే హామీలు ఇవ్వకుండా కేవలం రాజకీయ విమర్శలు చేయడం సరికాదని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు. ప్రధాని ఎదుట రాష్ట్ర సమస్యలను తెరపైకి తీసుకురావాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఊర్లో లేకుండాపోవడం ఏమిటని ప్రశ్నించారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ పీఎంతో పాటు అధికారిక కార్యకలాపాల్లో పాల్గొని ఆ రాష్ట్ర ప్రజల గొంతుక వినిపించారని కొనియాడారు. అదే తెలంగాణకు చెందిన సమస్యలను ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్లడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు.

కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఎప్పుడైనా గుడికి పోయారా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి.. బండి సంజయ్ చేసిన వాఖ్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. బండి సంజయ్ ముస్లింలను వేరు చేస్తూ....హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధానిని నిలదిసే దమ్ము లేని బండి సంజయ్.. మసీదులను తవ్వుతాననడం రెచ్చగొట్టడమే అవుతుందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ అలా కాదు.. హిందూ, ముస్లిం, సిక్కులు అందరూ కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకుంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ మోదీని, మోదీని కేసీఆర్ తిడితే.. ప్రజల కడుపు నిండుతుందా అని నిలదీశారు. కేసీఆర్, మోదీల ఒప్పందం టూర్‌లా ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బెంగళూరు, మోదీ హైదరాబాద్ టూర్‌ లోపాయకారి ఒప్పందమేనని ఆయన ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్, భాజపాలను కాదని కేసీఆర్ ఏం చేయలేడని, దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు.

"కేసీఆర్‌, మోదీ మధ్య రాజకీయంగా అవగాహన ఉంది. భాజపా, తెరాస పరస్పర విమర్శలు ఒక నాటకం. ప్రజా సమస్యల మీద ప్రధాని మోదీ ఎందుకు స్పందించలేదు?. ఒక్కో పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీపై ప్రధాని ఎందుకు మాట్లాడలేదు?. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్యోగాల భర్తీ పై మోదీని ఎందుకు అడగలేదు? మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బండి సంజయ్ మాట్లాడటం సరికాదు. అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్. భాజపాకు వ్యతిరేకంగా కేసీఆర్‌ తిరగడం లేదు. రాజకీయ విమర్శలు మాని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. మోదీ, కేసీఆర్ పర్యటనలపై మాకు అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర సమస్యలపై ప్రధానిని అడిగే బాధ్యత సీఎంకు లేదా?. ప్రధానిని ప్రశ్నించే అవకాశం ఉన్నా.. ఆ పని ఎందుకు చేయలేదు?. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజల ముందే ప్రధానిని నిలదీశారు. ప్రధాని రావడం.. కేసీఆర్ వెళ్లడం అవగాహనలో భాగమే. కేసీఆర్, మోదీ మధ్య పొలిటికల్ అండర్ స్టాండింగ్ ఉంది." -జగ్గారెడ్డి, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.