ETV Bharat / state

మే నాటికి పోలవరం కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి: జగన్

author img

By

Published : Nov 12, 2020, 7:43 AM IST

Updated : Nov 12, 2020, 9:45 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ ఆదేశించారు. జాప్యం లేకుండా పనులను పరుగులు పెట్టించాలని అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా భూ సేకరణ , ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాలని నిర్దేశించారు. ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేసిన సర్కారు.. దాదాపు 8 వేల 400 కోట్లతో ప్రాజెక్టులను పూర్తి చేయనుంది.రూ

మే నాటికి పోలవరం కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి: ఏపీ సీఎం జగన్
మే నాటికి పోలవరం కాఫర్ డ్యామ్ పూర్తి కావాలి: ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్​లోని సాగు నీటి ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, అవుకు ప్రాజెక్టుల పనుల పురోగతిని సమావేశంలో అధికారులు వివరించారు. ఎంపిక చేసిన సాగునీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని జగన్‌ అధికారులను ఆదేశించారు. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్‌ –2 పనుల్లో జాప్యానికి తావివ్వొద్దని నిర్దేశించారు. పోలవరం హెడ్‌ వర్క్స్, కాలువలకు సంబంధించి పనుల పురోగతిని వివరించిన అధికారులు.. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని.. నిర్ణీత వ్యవధిలోనే పూర్తవుతుందని తెలిపారు. పోలవరం అప్రోచ్, స్పిల్‌ ఛానెల్‌ పనులు మే నాటికి పూర్తి చేయాలని.. అంతకు ముందే కాఫర్‌ డ్యాం పనులూ పూర్తి కావాలని జగన్​ ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖకు తాగునీటిని ప్రత్యేక పైప్‌ లైన్‌ ఏర్పాటు చేసి ఇవ్వాలని నిర్దేశించారు. పోలవరంలో నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పుడూ.. బ్యాక్‌ వాటర్‌తో ఎక్కడా సమస్యలు రాకూడదని.. ఆ విధంగా భూసేకరణ , ఆర్‌ అండ్‌ ఆర్‌ పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు . నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.

వెలిగొండ పనులపై ఆరా..

ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులపై ఏపీ సీఎం జగన్​ ఆరా తీశారు. ఈ ప్రాజెక్టు మొదటి సొరంగం పూర్తైందన్న అధికారులు.. రెండో సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి నీళ్లిస్తామని తెలిపారు. దీనికి భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసం నెలవారీ ప్రణాళిక మేరకు నిధులు విడుదల చేయాలని జగన్ ఆదేశించారు. అవుకు టన్నెల్‌ –2 లో మిగిలిన 137 మీటర్ల సొరంగం పనిని మార్చి నాటికి పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

మూడో టన్నెల్‌కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని అధికారులు వివరించారు. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టు పనుల కోసం ఎస్పీవీ రిజిస్ట్రేషన్‌ పూర్తైందన్నారు. లోగోను ముఖ్యమంత్రికి చూపించారు. దీనికి అంగీకారం తెలిపిన జగన్ తదుపరి చర్యల కోసం ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లలో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీటిని నిల్వచేసి.. రైతులకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. గండికోటలోనూ ప్రస్తుత నిల్వ 18 టీఎంసీలు ఉందని అధికారులు వివరించగా.. 20 టీఎంసీల వరకూ నిల్వ చేయాలని జగన్ ఆదేశించారు.

మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగు, తాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమికంగా రూ. 5 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్సు డెవలప్​మెంట్​ కార్పొరేషన్ లిమిటెడ్​ను ఏర్పాటు చేసింది. విజయవాడలోని రైతు శిక్షణా కేంద్రం నుంచి ఇది పనిచేస్తుందని స్పష్టం చేసింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 8 లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరాతో పాటు.. 1037 గ్రామాల్లోని 30 లక్షల జనాభాకు తాగు నీరు, పరిశ్రమలకు నీటి సరఫరా చేసేందుకు ఈ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులతో పాటు తాండవ ఎత్తిపోతల పథకంలోని 2 దశలకూ రూ.8వేల 400 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చదవండి: నేడు మంత్రులతో సీఎం కేసీఆర్​ భేటీ.. జీహెచ్​ఎంసీ ఎన్నికలపై చర్చ

Last Updated : Nov 12, 2020, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.