ETV Bharat / state

CM KCR speech on Telangana development : "ప్రగతి పథంలో తెలంగాణ.. మూడు రెట్ల ఆర్థికవ్యవస్థ పెంపే లక్ష్యం"

author img

By

Published : Aug 7, 2023, 8:15 AM IST

CM KCR speech on Telangana development : రానున్న పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని మూడు రెట్లు పెంచడంపై దృష్టి సారించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సంక్షేమ కార్యక్రమాలతో కొనుగోలు శక్తి పెరిగి, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్న సర్కార్.. గతంలో నిర్లక్ష్యం చేసిన మౌలిక సదుపాయాల్లో అధిక పెట్టుబడుల ద్వారా వృద్ధుని మెరుగుపరిచినట్లు పేర్కొంది.

Progress of Telangana State
KCR speech on Govt development

KCR speech on Govt development : ప్రగతిపథంలో తెలంగాణ.. మూడు రెట్ల ఆర్థికవ్యవస్థ పెంపే లక్ష్యం

CM KCR speech on Telangana development : వర్షాకాల అసెంబ్లీ సమావేశాల చివరి రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, సొంత రాష్ట్రంలో సాధించిన పురోగతిపై.. శాసనసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రస్థానానికి సంబంధించిన నివేదికను ఉభయసభల ముందు ఉంచింది. రాష్ట్ర భవిష్యత్తుకు దశ, దిశ నిర్దేశించడంపై దృష్టి సారించి.. అద్భుత ఫలితాలు సాధించినట్లు ప్రభుత్వం వివరించింది. సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేసి అత్యంత అట్టడుగున ఉన్న వారి జీవితాలను మెరుగుపరచడం కోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించి ముందుకు సాగినట్లు పేర్కొంది. ఇదే సమయంలో మౌలిక సదుపాయాలతో పాటు సమగ్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే దిశగా లక్ష్యంతో కూడిన విధానాన్ని అవలంభించినట్లు తెలిపింది.

KCR Speech in Telangana Assembly Sessions 2023 : దశాబ్ది కాలంలోనే తెలంగాణ అభివృద్ధిలో శిఖరాగ్రస్థాయిని చేరుకొందని... స్వల్ప వ్యవధిలోనే అనేక సవాళ్లను అధిగమించి దేశంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఆవిర్భవించిందని ప్రభుత్వం ప్రకటించింది. లక్ష్యం ఆధారిత ప్రణాళిక... అంకితభావంతో కూడిన నాయకత్వం... నిబద్ధత గల ప్రభుత్వం... అలుపెరుగని ప్రయత్నాలతో వెనకబడిన ఆర్థిక వ్యవస్థను స్థిర ప్రాతిపదికన ఉన్నత అభివృద్ధికి ఏ విధంగా దోహద పడిందో తెలపడానికి తెలంగాణ విజయగాథ ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది.

Telangana Assembly Sessions 2023 : ముఖ్యమైన ఆర్థిక సూచికల్లో ఒకటి అయినా జీఎస్డీపీలో రాష్ట్రం గణనీయ పురోగతిని సాధించిందని.. 2014-15లో 5.06 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ జీఎస్డీపీ 2022- 23 నాటికి 159.6 శాతం వృద్ధితో 13.13 లక్షల కోట్లకు పెరిగినట్లు వివరించింది. 2022-23లో తెలంగాణ తలసరి ఆదాయం 3,12,398 రూపాయలుగా నమోదైందని... జాతీయ సగటు 1,72,276 రూపాయలు మాత్రమేనని వివరించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా తలసరి ఆదాయం 2021- 22 లో దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని.. తొమ్మిదేళ్లలో ఎనిమిది రాష్ట్రాలను అధిగమించి పదో స్థానం నుంచి మూడో స్థానానికి తెలంగాణ ఎగబాకిందని వివరించింది. రాష్ట్రంలో సంపద కొంతమంది చేతిలో లేదని.. ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం తమిళనాడు, కేరళతో పాటు రాష్ట్రం సంపాదన సమానంగా పంపిణీ చేస్తుందని పేర్కొంది.

Minister Harish Rao Speech at Council : 'ముఖ్యమంత్రి కేసీఆర్​ పాలనలో.. హైదరాబాద్​​ హెల్త్ ​హబ్​గా మారింది'

గణనీయంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తి.. 2014-15లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో మైనస్ 0.7 శాతం ఉన్న వృద్ధిరేటు కరోనా మహమ్మారి కాలంలోనూ బలమైన వృద్ధి సాధించిందని, 2022- 23 లో 15.8 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. 2015-16 లో వరి ధాన్యం ఉత్పత్తి 45.71 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 2021 - 22 నాటికి ఏకంగా 342 శాతం పెరిగి 202 లక్షల మెట్రిక్ టన్నులు చేరినట్లు పేర్కొంది. పారిశ్రామిక రంగం కరోనా మహమ్మారి నుంచి బలంగా కోలుకొని 2022-23 లో పది శాతం పెరుగుదల నమోదు చేసినట్లు తెలిపింది. సేవారంగం వృద్ధి జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. ఐటీ ఎగుమతుల వృద్ధి జాతీయ సగటు 9.36 శాతం అయితే రాష్ట్ర రేటు మాత్రం 31.44 శాతంగా ఉందని.. దేశంలోని ప్రతి వంద కొత్త ఐటీ ఉద్యోగాల్లో 44 రాష్ట్రం నుంచే వస్తున్నాయని వివరించింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని... 2015-16 నుంచి 2022- 23 వరకు 17.1 శాతం వృద్ధి నమోదు చేసినట్లు తెలిపింది.

Telangana Assembly Monsoon Sessions : రాష్ట్ర ఆవిర్భావనంతరం మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసిన వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఉందని తెలిపింది. 2005 నుంచి 2014 వరకు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 51,132 కోట్లను ఖర్చు చేయగా... 2014 నుంచి 23 వరకు దాదాపు 5 రెట్లు పెరిగి 3,17,613 కోట్లకు చేరినట్లు వివరించింది. ప్రపంచంలోనే అతిపెద్దదైన, బహుళ దశల, ప్రయోజనకర ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్ల రికార్డు సమయంలో పూర్తిచేసినట్లు పేర్కొంది. మిషన్ కాకతీయ ద్వారా 5,459 కోట్ల వ్యయంతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. పౌరుల దాహార్తిని తీర్చేలా మిషన్ భగీరథ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొంది.

లోటు నుంచి మిగులు దిశగా.. విద్యుత్ కోతలు ఉన్న రాష్ట్రం నుంచి మిగులు రాష్ట్రంగా మారి 26.96 లక్షల వ్యవసాయ వినియోగదారులకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచినట్లు వివరించింది. 2014-15లో 1326 యూనిట్లుగా ఉన్న తలసరి విద్యుత్ వినియోగం.. 2021- 22 నాటికి 2126 యూనిట్లకు చేరిందని.. దేశ సగటు కంటే దాదాపు 70 శాతం అధికమని పేర్కొంది. అభివృద్ధి వ్యయాన్ని కూడా గణనీయంగా పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. 2006 నుంచి 14 వరకు అభివృద్ధి వ్యయం 2,19,036 కోట్లు కాగా.. 2014 నుంచి 22 వరకు 7,53,665 కోట్లకు పెరిగినట్లు వివరించింది.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు : రైతుబంధు, రైతుబీమా రెండు పడకల గదుల ఇళ్లు, ఆసరా పింఛన్లు, దళితబంధు, కళ్యాణలక్ష్మి- షాదీముబారక్, గొర్రెల పెంపకం, కేసీఆర్ కిట్, కంటివెలుగు, అమ్మఒడి మనఊరు -మనబడి లాంటి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పల్లెప్రగతి కింద ఇప్పటి వరకు 16,496 కోట్లు.. పట్టణప్రగతి కింద 6546 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.

పెట్టుబడుల ప్రవాహం.. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటివరకు పారిశ్రామిక రంగంలో 2,64,956 కోట్ల రూపాయల కొత్త పెట్టుబడులు ఆకర్షించి 17.77 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వివరించింది. ఖర్చు విపరీతంగా పెరిగినప్పటికీ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ కచ్చితంగా పాటించిందని జీఎస్డీపీలో రుణాల శాతం దేశంలోనే అతి తక్కువగా 28.1 శాతంగా ఉందని తెలిపింది.

రాష్ట్రంలో అవలంభించిన అభివృద్ధి, సమతుల్య విధానం ఫలితంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా స్పష్టమైన ప్రగతి చక్రానికి దారి తీసిందన్న సర్కార్.. తద్వారా జాతీయ, ప్రపంచ స్థాయిలో తెలంగాణ అద్భుత విజయాన్ని సాధించిందని తెలిపింది. రానున్న పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని మూడు రెట్లు పెంచడంపై దృష్టి సారించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

CM KCR on Telangana Assembly Elections 2023 : 'మళ్లీ అధికారం మాదే.. ప్రస్తుతం కంటే మరో 7, 8 సీట్లు ఎక్కువగానే వస్తాయి

Governor Approves TSRTC Bill : ఆర్టీసీ బిల్లుకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.