ETV Bharat / state

50 వేల మంది సిబ్బందిని నియమించాలి: సీఎం కేసీఆర్​

author img

By

Published : May 10, 2021, 3:14 AM IST

Updated : May 10, 2021, 4:17 AM IST

kcr
సీఎం కేసీఆర్​

రాష్ట్రంలో వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదేశించారు. 50 వేల మంది సిబ్బందిని నియమించాలన్న సీఎం.. వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం నగరాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రారంభించాలని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో సేవలందించటానికి యువవైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌, పడకలు, మందుల కొరత లేదన్న సీఎం.. సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామన్నారు.

సీఎం కేసీఆర్​

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన వైద్య, ఆరోగ్య సిబ్బందిపై పనిభారం తగ్గించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం... రెండు, మూడు నెలల కాలానికి 50 వేల మంది ఎంబీబీఎస్​ వైద్యులతో పాటు నర్సులు,ల్యాబ్‌ టెక్నిషియన్లు, ఇతర సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ఎంబీబీఎస్​ పూర్తి చేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి వెంటనే దరఖాస్తులు స్వీకరించి నియామకాలు చేపట్టాలని సూచించారు. వారికి గౌరవ ప్రదమైన రీతిలో వేతనాలు ఇస్తామన్నారు. వారి సేవలను గుర్తించి.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులిస్తామని చెప్పారు. కష్టకాలంలో ప్రజల కోసం సేవచేయటానికి యువవైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు తక్షణమే ప్రారంభించాలి

వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు తక్షణమే ప్రారంభించాలని.. అందులో వైద్య సిబ్బందిని నియమించాలని సీఎం నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 363 మంది, అదిలాబాద్ జిల్లా రిమ్స్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 366 మంది చొప్పున 729 మందిని భర్తీ చేసేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పీఎంఎస్​ఎస్​వై కింద నిర్మిస్తున్న వరంగల్‌ ఆస్పత్రికి ప్రభుత్వ వాటా కింద తక్షణం 8 కోట్లు, ఆదిలాబాద్‌ ఆస్పత్రికి 20 కోట్లు తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు.

ఆక్సిజన్‌, మందుల కొరత లేదు

రాష్ట్రంలో ఆక్సిజన్‌, మందుల కొరత లేదని కేసీఆర్‌ వెల్లడించారు. రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు సరిపడా ఉన్నాయన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెత్తం 7 వేల 393 పడకలు, 2 వేల 470 ఆక్సిజన్ బెడ్లు, 600 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయన్న సీఎం.. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్​డెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేయాని కేసీఆర్‌ అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి: కేసీఆర్​కు ప్రధాని ఫోన్​.. సూచనలు బాగున్నాయని అభినందన

Last Updated :May 10, 2021, 4:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.