ETV Bharat / state

బీఆర్‌ఎస్‌ ఈజ్‌ ఫర్‌ ఇండియా... ఇదో యజ్ఞం: సీఎం కేసీఆర్​

author img

By

Published : Jan 2, 2023, 9:40 PM IST

Updated : Jan 2, 2023, 10:48 PM IST

kcr
kcr

CM KCR Comments: ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రావటమే బీఆర్​ఎస్ లక్ష్యం కాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. భారతదేశ పురోగమనాన్ని మార్చడమే బీఆర్​ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం.. మతపిచ్చి సృష్టిస్తే దేశం ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ ఈజ్‌ ఫర్‌ ఇండియా... ఇదో యజ్ఞం: సీఎం కేసీఆర్​

CM KCR Comments: సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏదైనా ప్రారంభిస్తే ముందుగా అవహేళనలే ఉంటాయని తెలిపారు. అవహేళనలు దాటుకుని ముందుకెళ్తేనే విజయం సాధిస్తామని పేర్కొన్నారు. ప్రారంభంలో తమ లక్ష్యాన్ని గుర్తించడానికే కొందరు ఇష్టపడరని అన్నారు. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమే కొన్ని పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆరోపించారు. తెలంగాణభవన్​లో బీఆర్ఎస్​లో ఏపీ నేతల చేరికల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వ్యవస్థీకృతంగా పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యం: విద్వేషాలు, మతకల్లోలాలు రెచ్చగొట్టి కొందరు గెలవాలని చూస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. దిల్లీలో రైతులు కొన్ని నెలలపాటు ఆందోళన చేశారని గుర్తు చేశారు. వ్యవస్థీకృతంగా పనిచేస్తేనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. భారతదేశ భూభాగం సుమారు 83 కోట్ల ఎకరాలు అని తెలిపారు. అందులో దాదాపు 43 కోట్ల ఎకరాలకు పైగా ఎకరాల భూమిలో బాగా పంటలు పండేవి ఉన్నాయని చెప్పారు. అన్ని రకాల పంటలకు అనుకూలమైన నేలలు దేశంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఏటా 1.40 లక్షల టీఎంసీల మేర వర్షం కురుస్తోందని వివరించారు. దేశంలో 70 వేల టీఎంసీ నీరు అందుబాటులో ఉందని వెల్లడించారు. అన్నింటికంటే ముఖ్యంగా పనిచేసే జనాభా దేశంలో ఎక్కువగా ఉందని అన్నారు.

అత్యధికమైన ఆహారోత్పత్తి దేశంగా భారత్ ఉండాలి: ప్రపంచంలోనే అత్యధికమైన ఆహారోత్పత్తి దేశంగా భారత్ ఉండాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇన్ని వనరులు ఉన్నప్పటికీ విదేశాల నుంచి.. ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉందన్నారు. సమృద్ధిగా నీరు ఉంది కానీ... రైతులకు అందట్లేదని విమర్శించారు. అత్యధిక విద్యుత్‌ సామర్థ్యం ఉంది కానీ.. రైతులకు అందదని ఆరోపించారు.

గొంతు చించుకుని కొందరు మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం: గొంతు చించుకుని కొందరు మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం ఇస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కానీ చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా చైనా నుంచి వస్తున్నాయని విమర్శించారు. దేశంలో వీధివీధికి చైనా బజార్లు ఏర్పడ్డాయని అన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా నిజమైతే ఇన్ని చైనా బజార్లు ఎందుకు పుట్టుకొచ్చాయని ప్రశ్నించారు. ఏటా వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని వెల్లడించారు. సరైన పాలసీ లేకపోవడం వల్ల విద్యుత్‌ సరఫరాలో తీవ్రమైన అంతరం ఉందని కేసీఆర్ వివరించారు.

నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు: చెన్నై వంటి నగరాలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నాయని కేసీఆర్​ తెలిపారు. నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశ రాజధాని దిల్లీలో కూడా సరిపడా నీళ్లు దొరకటం లేదని.. ఇప్పటికీ దిల్లీలో కరెంట్‌ కోతలు ఉన్నాయని వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా నీరు, విద్యుత్‌ సమస్య పరిష్కారం కాలేదని చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో చెప్పి పబ్బం గడుపుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు.

అధికారంలోకి రావటమే బీఆర్​ఎస్ లక్ష్యం కాదు: అధికారంలోకి రావటమే బీఆర్​ఎస్ లక్ష్యం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భారతదేశ పురోగమనాన్ని మార్చడమే బీఆర్​ఎస్ లక్ష్యమని చెప్పారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం.. మతపిచ్చి సృష్టిస్తే దేశం ఏమవుతుందని ప్రశ్నించారు. మతవిద్వేషాల వల్ల హత్యాకాండ జరిగితే దేశం, ప్రజలు ఏమైపోవాలని అన్నారు. దేశాన్ని ఉజ్వలంగా తయారు చేయటంలో ఏపీ ప్రజలు కూడా భాగం కావాలని కోరారు. అసలు సిసలైన ప్రజారాజకీయాలు రావాలని పేర్కొన్నారు.

దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్ కార్యాచరణ: తెలంగాణలో కలపాలని మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్ కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. హిరోషిమా, నాగసాకి బాంబుల వల్ల మొత్తం ధ్వంసమైనప్పటికీ జపాన్‌ ఎంతో అభివృద్ధి సాధించిందని గుర్తు చేశారు.రాజకీయాలు అంటే ఒక కార్యాచరణ.. కానీ కొందరు దాన్ని ఆటగా మార్చారని కేసీఆర్ ఆరోపించారు.

"వేల మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఏదైనా ప్రారంభిస్తే ముందుగా అవహేళనలే ఉంటాయి. అవహేళనలు దాటుకుని ముందుకెళ్తేనే విజయం సాధిస్తాం. ప్రారంభంలో మన లక్ష్యాన్ని గుర్తించడానికే కొందరు ఇష్టపడరు. చిత్తశుద్ధితో కృషి చేస్తే అందరూ గుర్తించేసరికి విజయతీరం చేరుతాం. ఏం చేసైనా ఎన్నికల్లో గెలవడమే కొన్ని పార్టీల లక్ష్యం. విద్వేషాలు, మతకల్లోహాలు రెచ్చగొట్టి గెలవాలని చూస్తున్నారు." - కేసీఆర్, సీఎం

ఇవీ చదవండి: తెలంగాణకు 8ఏళ్లలో రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు: కేటీఆర్‌

ముఖ్యమంత్రుల ఇళ్ల సమీపంలో బాంబు- రంగంలోకి సైన్యం

Last Updated :Jan 2, 2023, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.