ETV Bharat / state

ఆగస్టు నాటికే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: సీఎం కేసీఆర్

author img

By

Published : Mar 10, 2023, 4:47 PM IST

Updated : Mar 11, 2023, 6:25 AM IST

CM KCR on Assembly Elections 2023 : ఆగస్టు నాటికే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతలకు స్పష్టం చేశారు. పార్టీని, ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న సీఎం... రెండు నెలల్లోగా ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. దళితబంధు, గృహలక్ష్మి, గొర్రెల పంపిణీలో ఎలాంటి అవినీతిని తావు లేకుండా శాసనసభ్యులే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఓర్వలేని తనంతో బీజేపీ చేస్తున్న కక్ష సాధింపు చర్యలను ఎదుర్కొంటామన్న కేసీఆర్... దేశం నుంచి ఆ పార్టీని పారద్రోలే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

CM KCR
CM KCR

CM KCR on Assembly Elections 2023 : తెలంగాణ భవన్​లో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఎన్నికలకు మరో ఏడాది ఉన్న వేళ.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. పాదయాత్రలు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని, నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ సూచించారు.

'నేతలందరూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి. పార్టీలోని అన్ని స్థాయిల నేతలను కలుపుకునిపోవాలి. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మరింత చొరవ చూపాలి. వీలైనంత వరకు నేతలంతా ప్రజాక్షేత్రంలోనే ఉండాలి. త్వరలో వరంగల్‌లో భారీ బహిరంగ సభ.'-సీఎం కేసీఆర్‌

ముందస్తు ఎన్నికలు ఉండవు : ముందస్తు ఎన్నికలు ఉండవన్న కేసీఆర్.. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని నేతలకు పలు సూచనలు చేశారు. బీఆర్​ఎస్​కు కార్యకర్తలే బలమని, శాసనసభ్యులు బాధ్యత తీసుకొని వారితో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు, తదితర పార్టీ ముఖ్యులను కలుపుకొని ఆత్మీయ సమ్మేళనాలను రెండు నెలల్లోపు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం మిగిలి ఉన్న రెండు పడకల గదుల ఇండ్ల పంపిణీ పూర్తి చేయాలని, 58,59 జీవోల కింద క్రమబద్దీకరణ దరఖాస్తు గడువు పెంపును పేద ప్రజల కోసం సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.

గెలుపే లక్ష్యంగా నేతలు పనిచేయాలి : దళితబంధు రెండో విడత కోసం స్థానిక ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు చేసి సంబంధిత కలెక్టర్లకు పంపించాలన్న సీఎం... అవినీతికి ఆస్కారం లేకుండా లబ్దిదారులకు నిధులు అందేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. నిన్న జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను కూడా సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో వివరించారు. కొత్తగా తీసుకొస్తున్న గృహలక్ష్మి పథకం ద్వారా ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు, రెండో విడత గొర్రెల పంపిణీ, దళిత బంధు సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ నేతలందరూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఎచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు సూచించారు.

బీఆర్ఎస్ ఆవిర్భావం రోజే పార్టీ ప్లీనరి సమావేశం : ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆ విధంగా పార్టీ ప్లీనరి నిర్వహించామో.. ఇకపై బీఆర్ఎస్ ఆవిర్భావం రోజే పార్టీ ప్లీనరి సమావేశం నిర్వహించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వ పథకాల అమలు ప్రచార సరళి సహా పార్టీ పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ప్రతి రంగంలో సంక్షేమం, అభివృద్ధి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం సమ్మిళితాభివృద్ధిని సాధించిందని... విదేశాల నుంచి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఐటీ రంగంలో సిలికాన్ వ్యాలీగా చెప్పుకున్న బెంగుళూరును మించి హైదరాబాద్ పురోగతిని సాధిస్తోందన్న సీఎం... తెలంగాణ అభివృద్ధిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఫాక్స్ కాన్ ఛైర్మన్ చెప్పడం మనందరికీ గర్వకారణమని అన్నారు.

ఆగస్టు నెల వరకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : షెడ్యూల్ ప్రకారం డిసెంబర్​లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని... అయితే అక్టోబర్, నవంబర్​లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోలేదని సీఎం కేసీఆర్ నేతలకు తెలిపారు. 2018లో అక్టోబర్ నెలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని, ఈ మారు సెప్టెంబర్​లో కూడా రావచ్చని అన్నారు. దీంతో ఆగస్టు నెల వరకు పార్టీ నేతలు, శ్రేణులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్​ఎస్ విద్యార్థి విభాగం - బీఆర్ఎస్వీని మరింత బలోపేతం చేయాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల సమావేశాలు నిర్వహించి... విద్యార్థి సంఘ బలోపేతానికి చర్యలు చేపట్టాలని అన్నారు. ఇంకా మిగిలి ఉన్న పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలను పూర్తి చేయాలని నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు.

పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభోత్సవానికి ముందు ఇటీవల మరణించిన ఎమ్మెల్యే సాయన్నకు సీఎం సహా నేతలు నివాళులు అర్పించారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 11, 2023, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.