ETV Bharat / state

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కావాలనే అడ్డుపడుతోంది: సీఎం కేసీఆర్​

author img

By

Published : Mar 10, 2023, 7:52 AM IST

cm kcr
cm kcr

CM KCR Latest comments on BJP: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. వాటిని సమర్ధంగా తిప్పికొడతామని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అధికారంలోకి రావడం ఖాయమన్న కేసీఆర్‌.. ప్రభుత్వ నిర్ణయాలను ఇంటింటికీ చేర్చాలని దిశానిర్దేశం చేశారు.

CM KCR Latest comments on BJP: బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష సాధిస్తోందని.. రాష్ట్రాభివృద్ధికి, పాలనకు అడ్డంకులు సృష్టించడంతో పాటు పార్టీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోపించారు. దీనికి తగిన మూల్యం కేంద్రం చెల్లించుకుంటుందని సీఎం మంత్రిమండలి సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. బీజేపీ ఎత్తులను చిత్తు చేద్దామన్న ఆయన.. పార్టీపరంగా న్యాయపరంగా పోరాడతామని.. భావసారూప్య పార్టీలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతామని వెల్లడించారు.

CM KCR Fires on BJP : రాష్ట్రంలో పెండింగ్‌ బిల్లుల అంశాన్ని.. తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆ విషయంపై సుప్రీంకోర్టులో కేసు వేశామని.. రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఈ సమావేశంలో కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్నికల గడువు సమీపిస్తున్నందున మంత్రులు అభివృద్ధిపై దృష్టి సారించాలని, తమ తమ జిల్లాల్లో పెద్దన్న పాత్ర పోషించాలని, అభివృద్ధి, సంక్షేమంతో పాటు పార్టీ బలోపేతంపైనా దృష్టి సారించాలని చెప్పారు. బీజేపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు.

మంత్రివర్గ సమావేశంలో భాగంగా మంత్రులతో రాజకీయ అంశాలపై మాట్లాడిన కేసీఆర్‌.. పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలిసింది. ‘కేంద్రంలోని బీజేపీ ఆగడాలు పరాకాష్ఠకు చేరాయన్న కేసీఆర్‌ తెలంగాణను ఒక రాష్ట్రంగా చూడట్లేదని మండిపడ్డారు. అన్నింటా తీవ్ర వివక్షను ప్రదర్శిస్తోందని.. పైసా సాయం చేయట్లేదవు.. ప్రాజెక్టులను విస్మరించిందని ఆరోపించారు. బీజేపీ నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న కేసీఆర్‌.. రాజకీయంగా చేతగాక చట్టబద్ధ సంస్థల ద్వారా దాడులు, నోటీసులకు పూనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా తెలంగాణలోనే బీజేపీపై మనం దాడి చేస్తున్నామని.. కక్ష సాధింపులో భాగంగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు, సమన్లు ఇస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఇలాంటి పరిస్థితులున్నాయని కవితకు ధైర్యం చెప్పానని.. ఎన్ని కుట్రలు చేసినా.. బీజేపీ ఆటలు సాగవని తేల్చిచెప్పారు. ఇప్పటికే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని కేసీఆర్ తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ఘనవిజయం సాధిస్తుందని.. తిరుగులేని మెజారిటీతో గెలుస్తుందని కేసీఆర్​ ధీమావ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్న సీఎం.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామన్నారు. మంత్రిమండలిలో పేదలకు ప్రయోజనం కలిగించే గృహలక్ష్మి, పాత ఇంటిరుణాల రద్దు, గొర్రెల పంపిణీ, పోడు భూములకు పట్టాల వంటి గొప్ప నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఆ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని నేతలకు సూచించారు. వచ్చే 9నెలలు మరింత కష్టపడాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. బీఆర్​ఎస్​ కృషిని ఇంటింటికీ తెలియజేయాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.