ETV Bharat / state

పంచాయతీ కార్యాలయాల్లో.. గడువు ముగిసినా అందని పౌరసేవలు

author img

By

Published : Feb 5, 2022, 8:28 AM IST

Civil Services in Grama Panchayat
అందని పౌరసేవలు

Civil Services in Grama Panchayat: రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాల్లో పౌరసేవలు ఆలస్యమవుతున్నాయి. సాంకేతిక అవసరంలేనివి వేగంగా అందుతున్నా లేఅవుట్‌, భవన నిర్మాణ, ఆస్తిపన్ను మదింపు, మ్యుటేషన్‌ తదితర సేవల్లో జాప్యం జరుగుతోంది.కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు లేక గడువు ముగిసినా సేవలు అందడంలేదు.

Civil Services in Grama Panchayat: పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌) అధ్యయనం మేరకు స్పష్టమైన గడువులోగా పౌరసేవలు అందించేందుకు పౌరసేవా పట్టిక అమలు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సూచించింది. పంచాయతీల్లో 48 రకాల పౌరసేవల అమలుకు సంబంధించి గడువు పేర్కొంటూ కార్యాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ గత ఏడాది ఆగస్టులో ఆదేశాలు జారీ చేసింది. పారిశుద్ధ్యం, వీధిదీపాల మరమ్మతులు, వివాహ నమోదు, తాగు నీటి సమస్యలు తదితర పల్లెప్రగతి పనులకు సకాలంలో చర్యలు తీసుకుంటున్నా కీలకమైన పౌరసేవల్లో జాప్యం జరుగుతోంది.

గడువు దాటినా...

Grama Panchayat Office: పంచాయతీల్లో ఇంటి నిర్మాణ అనుమతి, ఆస్తిపన్ను మదింపు, ఆస్తి బదలాయింపు సేవలు 15 రోజుల్లోగా పరిష్కరించాలని నిబంధనలున్నా ఇప్పటివరకు పంచాయతీలకు అందిన దరఖాస్తుల్లో అధికం గడువు ముగిసిన తర్వాతే పరిష్కారమవుతున్నాయి. గ్రామాల్లో లేఅవుట్లకు 44 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టంగా పేర్కొనగా 2,300 దరఖాస్తుల్లో 324 అర్జీలకే సకాలంలో అనుమతులు దక్కాయి. ఇప్పటికీ 1,665 పెండింగ్‌లో ఉన్నాయి. ఆస్తిపన్ను మదింపు కోసం 4,220 దరఖాస్తులు వస్తే 2,389 మాత్రమే పరిష్కారమయ్యాయి. మరో 1,003 పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామాల్లో వ్యాపార అనుమతులు వారం రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉండగా వీటికీ ఆలస్యమవుతోంది. ఇంటి నిర్మాణ అనుమతుల కోసం 90వేల దరఖాస్తులు రాగా 56 వేల అర్జీలపైనే సకాలంలో నిర్ణయం తీసుకున్నారు.

సమస్యకు కారణమేంటి ?

రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వం చిన్న, చిన్న ఆవాసాలను సైతం పంచాయతీలుగా మార్చింది. వీటికి కార్యదర్శులను నియమించినా రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం అవసరమైన ట్యాబ్‌లు, కంప్యూటర్లు ఇవ్వలేదు. ప్రజలు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకుంటుండగా వాటి పరిష్కారానికి సాంకేతిక అడ్డంకులు వస్తున్నాయి. పంచాయతీ కార్యదర్శులకు రోజువారీ శానిటేషన్‌ నివేదిక(డీఎస్‌ఆర్‌), పల్లెప్రగతి యాప్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినా వారికి ట్యాబ్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యాలు కల్పించలేదు. వ్యక్తిగత మొబైల్‌ ఫోన్లలో పరిష్కరించేందుకు వీలు కాకపోవడంతో ఆన్‌లైన్లో అందించాల్సిన సేవలు ఆలస్యమవుతున్నాయి.

ఇదీ చూడండి: ICRISAT : వ్యవసాయ భారత పురోభివృద్ధికి వరం.. ఆహార సంక్షోభ నివారణ కర్మాగారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.