ETV Bharat / city

ICRISAT : వ్యవసాయ భారత పురోభివృద్ధికి వరం.. ఆహార సంక్షోభ నివారణ కర్మాగారం

author img

By

Published : Feb 4, 2022, 3:36 PM IST

Updated : Feb 5, 2022, 5:21 AM IST

రైతాంగం శ్రేయస్సే లక్ష్యంగా ఉష్ణమండల పంటలపై పరిశోధన, కొత్త వంగడాల రూపకల్పన, విస్తరణ రంగాల్లో.. విశేష సేవలందిస్తున్న అంతర్జాతీయ సమశీతోష్ణ మండల పంటల పరిశోధన సంస్థ మరో మైలురాయి అధిగమించింది. మేలైన విత్తనాలు, నూతన సాగు విధానాలు చేరవచేస్తూ.. ఆసియా - ఆఫ్రికా ఖండాల్లో ఆహారసంక్షోభం నివారణకు సేవలు అందిస్తున్న ప్రతిష్టాత్మక ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. 1972లో హైదరాబాద్ శివారు పటాన్‌చెరులో 3,434 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ సంస్థ 50 ఏళ్ల ఉత్సవాలకు స్వయంగా ప్రధానమంత్రి మోదీ హాజరుకానున్నారు.

Icrisat special story on the occasion of Golden Jubilee
Icrisat special story on the occasion of Golden Jubilee

ICRISAT : వ్యవసాయ భారత పురోభివృద్ధికి వరం.. ఆహార సంక్షోభ నివారణ కర్మాగారం

ఇక్రిశాట్... రైతుల పాలిట ఓ వరం! వ్యవసాయ పంటల సాగు, కొత్త వండాల సృష్టి, విస్తరణ, సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణలో ముందుకు సాగుతున్న అంతర్జాతీయ సమశీతోష్ణ మండల పంటల పరిశోధన సంస్థ - ఇక్రిశాట్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రతికూల పరిస్థితులు తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల రూపకల్పన, విస్తరణ, ఆధునిక సేద్యం ఆవిష్కరణల సేద్యంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌ పటాన్‌చెరులో జరగనున్న ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఆధునిక సాగు సంబంధించి ఐటీ, వ్యవసాయ అంకురాలకు ఊతమిచ్చేలా ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించనున్నారు.

భారత పురోభివృద్ధిలో తనవంతు పాత్ర..

ఆసియా, సబ్-సహారా ఆఫ్రికాదేశాల్లో డ్రైల్యాండ్‌ల అభివృద్ధికి పరిశోధనలు నిర్వహిస్తూ వ్యవసాయ భారత పురోభివృద్ధిలో తనవంతు పాత్ర పోషిస్తుంది ఇక్రిశాట్. పొడిబారిన నేలల్లో ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మంచి దిగుబడులు ఇచ్చే వంగడాలపై విస్తృత పరిశోధనలు చేస్తోంది. ఆయా దేశాల్లో మొత్తం 200కోట్లకు పైగా ప్రజలు ఉండగా... వీరిలో 644 మిలియన్ల మంది పేదలే. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం మన హైదరాబాద్‌లోనే కొలువు తీరింది. నైరోబి, కెన్యా, బమాకో, మాలి, నైజర్, నైజీరియా, జింబాబ్వే, మలావి, ఇథియోపియా, మొజాంబిక్‌లలో దేశ కార్యాలయాల్లో పాటు... 2 ప్రాంతీయ కేంద్రాలనూ నిర్వహిస్తోంది ఇక్రిశాట్.

నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి..

అత్యంత పోషక విలువలు, కరవు తట్టుకోగల జొన్న, సజ్జ, కంది, శనగ, వేరుశనగ వంటి 5 రకాల పంటలు, ఇతర చిరుధాన్యాల పంటలపై విస్తృతంగా పరిశోధనలు నిర్వహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలలో కీలకపాత్ర పోషిస్తోంది ఇక్రిశాట్. 2021-2025 పంచవర్ష వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా విస్తృత భాగస్వామ్యాలు, నెట్‌వర్కింగ్, క్షేత్రస్థాయి అవసరాలపై దృష్టి పెట్టారు. ఆ మేరకు కావాల్సిన నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. రైతులనూ ఈ కార్యాచరణలో భాగం చేయనున్నారు.

నిపుణులను ఆకర్షించిన నేలలు..

నిజానికి.. ఇక్రిశాట్‌ను పటాన్‌చెరులో ఏర్పాటు చేయడానికి ముందు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ కసరత్తు జరిగింది. ప్రపంచ ఆహార భద్రత లక్ష్యంగా రాక్‌ ఫెల్లర్ ఫౌండేషన్.. ఫిలిప్పైన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ - ఇరిలో జొన్న, తృణధాన్యాల పంటలకు వేర్వేరుగా 2 అంతర్జాతీయ పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అప్పట్లో ఈ కేంద్రం ఏర్పాటుకు బెంగళూరు, పుణె నుంచి గట్టి పోటీ ఏర్పడింది. దక్కన్ పీఠభూమిలో విభిన్న నేలలు తృణధాన్యాలు, నూనెగింజల పంటల సాగుకు అనుకూలంగా ఉండటం... పటాన్‌చెరులో పక్క పక్కనే నల్లరేగడి, ఎర్రమట్టి నేలలు ఉండటం అంతర్జాతీయ నిపుణులను ఆకర్షించింది.

ప్రభుత్వాల సహకారం లేక..

హైదరాబాద్‌ అనుకూల వాతావరణమూ ఇటే మొగ్గు చూపేలా చేసింది. అప్పట్లో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ - బీహెచ్​ఈఎల్​ విస్తరణకు సిద్ధం చేసిన భూమిని ఇక్రిశాట్‌ కోసం ఇచ్చారు. ఇక్కడి కొత్త వంగడాల సృష్టి, అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచంలో ఎక్కడి నల్లరేగడి, ఎర్రమట్టి ప్రాంతాల్లోనైనా సులభంగా వినియోగించుకోవచ్చన్నది లక్ష్యం. 1980 దశకంలో ఇక్రిశాట్‌లో 100 మంది శాస్త్రవేత్తలు, 2500 మంది వరకు వివిధ స్థాయి ఉద్యోగులు, కార్మికులు ఉండే వారు. కాలక్రమేణా నిధుల లేమి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఆశించిన మేరకు లేక ఆ సంఖ్య తగ్గిపోతూ వస్తోంది.

24 రకాల నూతన వండగాలు విడుదల..

ప్రస్తుతం ఇక్రిశాట్‌లో 700 నుంచి 1000 లోపే సిబ్బంది ఉన్నారు. పర్యావరణ సమతుల్యత కాపాడుతూ... పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు బయోఫోర్టిఫైడ్ వండగాల ఆవిష్కరణలపై ఇక్రిశాట్‌ దృష్టి సారించింది. ఉదాహరణకు కెన్యాలో పండే రాగిలో ఇనుము, జింక్ ఎక్కువగా ఉండే వండగాలు తీసుకుని వాటిని మరింత అభివృద్ధి చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పండిస్తోంది. వేరుశనగ గింజల్లో నూనెశాతం అధికంగా ఉండే వండగాలను ఆవిష్కరించారు. ఒడిశా నేలల్లో భూసారంపై డిజిటల్ మ్యాప్ రూపొందించి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌ బుందేల్‌ఖండ్‌లో పురాతన నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ పంటలకు సంబంధించి 2,490 టన్నుల విత్తనం ఉత్పత్తి చేసింది ఇక్రిశాట్. కంది, జొన్న, వేరుశనగ, సజ్జ తదితర 5 పంటలకు చెందిన 24 రకాల నూతన వండగాలు విడుదల చేసింది.

3 కొత్త శనగ పంట వంగడాలు..

ఇక్రిశాట్ ఆధ్వర్యంలో 3 కొత్త శనగ పంట వంగడాలు విడుదలయ్యాయి. అధిక దిగుబడలు ఇచ్చే ఐపీసీఎల్-4, బీజీఎం 4005, ఐపీసీఎంబీ 19-3 శనగ వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్రిశాట్ సహకారంతో కాన్పూర్‌ ఐసీఏఆర్ - భారతీయ పప్పుధాన్యాల పరిశోధన సంస్థ- ఐఐపీఆర్, న్యూదిల్లీ భారత వ్యవసాయ పరిశోధన సంస్థ- ఐఏఆర్‌ఐ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ శనగ వంగడాలైన బీజీఎం 4005, ఐపీసీఎంబీ 19-3 రకాలను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఇక్రిశాట్ సహకారంతో కొన్ని వంగడాల్ని ఆచార్య ఎన్జీ రంగావ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేశాయి.

వరల్డ్ జర్మ్ ప్లాజం బ్యాంకు..

అంతర్జాతీయ సంస్థ కావడంతో ఇక్రిశాట్ నేరుగా వండగాలు విడుదల చేయడానికి వీల్లేదు. జొన్న, సజ్జ, కంది, శనగ, వేరుశనగ పంటలతోపాటు కొర్ర, సామలు వంటి చిరుధాన్యాల పంటలు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన ఉన్న వంగడం అయినా.. దాని జర్మ్ ప్లాజం సేకరించి ఇక్రిశాట్ భద్రపరుస్తుంది. ఇప్పటి దాకా ఆయా రకాలు 1.20 లక్షల జర్మ్ ప్లాజంలు సేకరించి జాగ్రత్తగా భద్రపరించింది. ఒకరకంగా చెప్పాలంటే వరల్డ్ జర్మ్ ప్లాజం బ్యాంకు అన్న మాట. సాధారణంగా ఒక వంగడం పదేళ్ల తర్వాత తన సామర్థ్యం కోల్పోతోంది. అది తాజాగా ఉండేందుకు పంట సాగు ద్వారా విత్తనోత్పత్తి చేసి నిల్వ చేస్తారు.

ఇక్రిశాట్ ప్రత్యేకత అదే..

ఇలా ఎన్నో రకాలు సేకరించి... నిల్వ చేయడం అనే ప్రక్రియ ఖరీదైన వ్యవహారం అయినా.. ఇక్రిశాట్ నిరంతరంగా ఆ పనిలో నిమగ్నమై ఉండటం ఓ ప్రత్యేకత. ప్రతి వండగం, రకం, లక్షణాలు అన్నీ రికార్డుల రూపంలో సమగ్ర సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఏ రకం వంగడం అవసరమో అందుకు అనుగుణంగా వాతావరణ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, బెట్ట తట్టుకునే రీతిలో గింజ నాణ్యత, రోగ నిరోధక శక్తి, దిగుబడి వంటి లక్షణాలు కలిపి సంకరం చేయడం ద్వారా మదర్, ఫాదర్ పేరెంట్స్ వైరైటీస్ అభివృద్ధి చేస్తారు శాస్త్రవేత్తలు.

ఏటా ఒకరోజు క్షేత్ర దినోత్సవం...

నేరుగా హైబ్రీడ్ రకాలు కాదు, కొన్ని ప్రత్యేక లక్షణాలు గల వంగడాలు అభివృద్ధి చేస్తారు.. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు. ఏటా ఒకరోజు క్షేత్ర దినోత్సవం ఏర్పాటు చేసి రైతులు, వివిధ రాష్ట్రాల విత్తనాభివృద్ధి సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలను ఆహ్వానించడం అనవాయితీ. ఇక్రిశాట్‌లో సభ్యత్వం కలిగిన ప్రైవేటు విత్తన కంపెనీలనూ ఇందులో భాగస్వాముల్ని చేస్తారు. అక్కడ ఉంచిన మంచి లక్షణాలు గల పేరెంట్ రకాలు చూసి ప్రైవేటు సంస్థలు కొనుగోలు చేసి బ్రీడింగ్‌లో ఉపయోగించుకుంటాయి. ప్రభుత్వ సంస్థలకైతే ఉచితంగానే ఇస్తారు.

ఫాస్ట్- ఫార్వర్డ్ బ్రీడింగ్‌ విస్తరణ..

ఫాస్ట్- ఫార్వర్డ్ బ్రీడింగ్‌ విస్తరణకు పిలుపునిస్తూ రైతులకు వేగంగా పంపిణీ చేయాలని కార్యాచరణ రూపొందించింది ఇక్రిశాట్. శనగ వంగడాల అభివృద్ధి క్రమంలో 6 రకాలు విడుదల చేసినట్లు ఇక్రిశాట్ జెనోమిక్స్ సంస్థ అధిపతి డాక్టర్ రాజీవ్ కె వర్షిణి వెల్లడించారు. అవి పంజాబ్, హరియాణ, జమ్ము కశ్మీర్, రాజస్థాన్, ఉత్తర్‌ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లో సాగుకు యోగ్యమని తేల్చారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా పంట అభివృద్ధి, జర్మ్‌ప్లాజంలో వైవిధ్యం తెలియజేస్తుంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంట దిగుబడులు పెంచడానికి జెనోమిక్స్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలంటున్నారు శాస్త్రవేత్తలు.

ఇక్రిశాట్‌ ఖాతాలో ఎన్నో విజయాలు..

అయిదు దశాబ్ధాల సుదీర్ఘ ప్రస్తానంలో ఇక్రిశాట్‌ ఎన్నో విజయాలు సాధించింది. భారత్‌ సహా ఆఫిక్రా, పలు దేశాల్లో బాగా సాగయ్యే వేరుశనగ గింజల్లో ఆఫ్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని సులభంగా గుర్తించే కిట్‌ను ఇక్రిశాట్ రూపొంచింది. వారి అతిపెద్ద విజయాల్లో ఇదొకటని చెబుతారు. ఆహార సమృద్ధి అందించడం ద్వారా ఉష్ణమండల దేశాల్లో పేదరికం తగ్గింపు, ఆహారభద్రత సాధ్యం అవుతుందన్నది ఇస్రో లక్ష్యం. సబ్‌-సహారా ఆఫ్రికన్ దేశాల్లో ఆహారభద్రతలో పురోగతికి ఇక్రిశాట్‌కు గత సెప్టెంబరులో ప్రతిష్టాత్మక 'ఆఫ్రికా ఫుడ్ ప్రైజ్ ' లభించింది. ప్రతికూల పరిస్థితులు తట్టుకుని మంచి దిగుబడులు ఇచ్చే వండగాలు రైతులకు అందించినందుకు గాను ఇక్రిశాట్‌కు ఈ అరుదైన పురస్కారం దక్కింది.

పరోక్షంగా పెద్ద ఎత్తున ప్రయోజనాలు..

ఇక్రిశాట్‌ ద్వారా నేరుగా రైతులు ప్రత్యక్షంగా లబ్ది పొందకపోయినా కూడా పరోక్షంగా ఎంతో పెద్ద ఎత్తున ప్రయోజనాలు పొందుతున్నారు. ఉదాహరణకు ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయ పరిశోధ నలు చాలా తక్కువ. భారత్‌ స్థాయిలో ఆయా దేశాల్లో తగిన పరిశోధన సంపత్తి లేదు. దేశంలో లభించే మెటీరియల్స్ తీసుకెళ్లి ఆయా దేశాలు వినియోగించుకుంటుంటాయి. జన్యు వైవిధ్యం, వాటర్‌షెడ్ అభివృద్ధిలో యావత్ ప్రపంచానికి దారిచూపింది ఇక్రిశాటే. ఈ క్రమంలో భారత్‌సహా దక్షిణాసియా లో చైనా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌, భూటాన్ వంటి 5 దేశాలు, ఆఫ్రికా 10 దేశాల్లో ఇక్రిశాట్ విస్తృత సేవలు అందిస్తోంది.

ఇవీ చూడండి:

Last Updated :Feb 5, 2022, 5:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.