ETV Bharat / state

స్టాలిన్​ సీన్​ రిపీట్..! ఒక్కరి నుంచి ఇద్దరికి.. ఇద్దరి నుంచి నలుగురికి.. నలుగురి నుంచి..

author img

By

Published : Mar 26, 2023, 7:23 AM IST

Updated : Mar 26, 2023, 7:56 AM IST

Tspsc
Tspsc

CIT investigation in paper leakage case: ఒక్కరి నుంచి ఇద్దరికి చేరాయి. ఆ ఇద్దరి నుంచి నలుగురికి.. ఆ నలుగురు మరో 16 మందికి. ఇదేదో స్టాలిన్‌ సినిమాలో చిరంజీవి చెప్పినట్లుగా ముగ్గురు మరో ముగ్గురికి సాయం చేయటం లాంటి విషయం కాదు. లక్షలాది మంది జీవితాలను అయోమయంలోకి నెట్టేస్తూ కొందరు దుర్మార్గులు తొక్కిన అడ్డదారులు. లక్షల రూపాయలు ఖాతాల్లోకి పంపుకుంటూ ప్రశ్నాపత్రాలను వాట్సప్‌లో షేర్‌ చేసుకుంటూ సర్కార్‌కే సవాల్‌ విసిరిన ఈ ఉదంతంలో ఇంకెంత మంది హస్తం ఉందో ఇప్పటికీ అంతు చిక్కటం లేదు.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు

CIT investigation in paper leakage case: పరీక్షలో వచ్చే ఒక్క ప్రశ్న ఒక్క జీవితాన్నే మార్చేస్తుంది. వందల పేజీల సమాచారం ఒక్క సమాధానాన్ని చూపుతుంది. రాత్రింబవళ్లు కఠోర దీక్ష ఏళ్లకు ఏళ్ల నిరీక్షణ కుటుంబాలకు కుటుంబాలు చేసే త్యాగం వీటన్నింటి ఫలితం ఒక్క ప్రభుత్వ ఉద్యోగం. విశ్వం పుట్టుక నుంచి నేటి తాజా పరిణామాల దాకా ఏ మూల నుంచి ఏ ప్రశ్న ఏ రూపంలో వచ్చినా దానిని ఎదుర్కోవాలంటే పడే కష్టం ఉద్యోగం కోసం నిజాయతీగా శ్రమించే ఒక అభ్యర్థికి మాత్రమే తెలుస్తోంది.

ఎలాంటి శ్రమ లేకుండా రేపు రోబోయే ప్రశ్నలేంటో ముందే తెలుసుకుని అడ్డదారుల్లో నెగ్గుదామనుకున్న కొందరి దురాలోచనతో రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాలు లక్షలాది మంది ఉద్యోగార్థుల జీవితాలను సందిగ్ధంలోకి నెట్టాయి. 15 రోజుల క్రితం ఓ చిన్న సమాచారంతో మొదలై.. రాష్ట్రంలో ప్రకంపనలు రేపిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో వరుస అరెస్టులు, కొత్త మలుపులతో ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 11న తొలుత టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నాపత్రం బయటికి వచ్చినట్లు కమిషన్‌ అధికారులు బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

TSPSC Paper Leakage Case update: ప్రాథమిక విచారణ జరపగా.. అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రాలు లీక్‌ అయినట్లు నిర్ధారణ కాగా అనంతరం దర్యాప్తులో కీలకమైన గ్రూప్‌-1 ప్రశ్నాపత్రాలు సైతం ముందే బయటికి వచ్చినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ కేసును బేగంబజార్ పోలీసుల నుంచి సీసీఎస్‌తో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేశారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో 9 మంది హస్తమున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు.. వారిని కస్టడీలోకి తీసుకుని 6 రోజుల పాటు విచారించారు.

కేసులో తొలి నుంచి కీలకంగా మారిన రేణుకతో పాటు ఆమె భర్త డాక్యానాయక్‌ ఏఈ ప్రశ్నాపత్రాలను మరికొందరికి విక్రయించి, సొమ్ము చేసుకున్నట్లు తేల్చారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌కుమార్‌తో ఉన్న పరిచయంతో రేణుక దంపతులు తెలివిగా వ్యవహరించారు. తన తమ్ముడి ఉద్యోగం కోసం సాయం చేయాలంటూ ప్రవీణ్‌తో బేరాసారాలాడిన రేణుక.. ఏఈ ప్రశ్నాపత్రాలను రూ.13.5 లక్షలకు గోపాల్‌నాయక్, నీలేశ్‌నాయక్‌ అనే వ్యక్తులకు విక్రయించారు.

7.5 లక్షలకు ఏఈ ప్రశ్నాపత్రం: ఇందులో భాగంగానే హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌లోని ఓ లాడ్జిలో ఈ ఇద్దరిని ఉంచి పరీక్ష రాయించేందుకు శిక్షణ సైతం ఇప్పించారు. ఏఈ ప్రశ్నాపత్రాలు తొలుత ఈ ఇద్దరికే చేరినట్లు పోలీసులు భావించినా.. మరికొందరికి సైతం వీటిని రేణుక దంపతులు విక్రయించినట్లు కస్టడీ సమయంలో గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్‌రెడ్డి అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న ప్రశాంత్‌రెడ్డి రూ.7.5 లక్షలకు ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇతని ద్వారా రాబట్టిన సమాచారంతో నిన్న మరో ముగ్గురిని సిట్ అదుపులోకి తీసుకున్నట్లు సమచారం. ప్రశ్నాపత్రాల లీకేజీతో ఈ నలుగురికీ సంబంధాలున్నట్టు ఆధారాలు లభించగానే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అజ్ఞాతంలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ఇలా పేపర్లు కొనుగోలు చేసిన వారిలో ఇప్పటి వరకు ఆరుగురిని సిట్‌ గుర్తించింది. వీరి ద్వారా ఇంకెంత మందికి ప్రశ్నాపత్రాలు చేతులు మారాయనే దానిపై అధికారులు దృష్టి సారించారు.

Rajasekhar role in TSPSC paper leak case: టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న మరో వ్యక్తి రాజశేఖర్‌ చేతికి వచ్చిన గ్రూప్-1 ప్రశ్నాపత్రంతో న్యూజిలాండ్‌లో ఉంటున్న తన బావ ప్రశాంత్‌ను హైదరాబాద్‌కు రప్పించి పరీక్ష రాయించాడు. విచారణలో ప్రశాంత్ పేరు బయటకు రాగానే అతడికి సమాచారం పంపిన సిట్‌ తమ ఎదుట హాజరుకావాలని తెలిపింది. ప్రశాంత్‌ నుంచి స్పందన రాకపోతే లుక్ ఔట్ నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. గ్రూప్‌-1లో వందకు పైగా మార్కులు తెచ్చుకున్న 121 మందిలో శుక్రవారం వరకు 40 మందిని సిట్‌ అధికారులు విచారించారు.

Total accused in TSPSC paper leak case: మిగిలిన 81 మందిలో మరికొందరిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంలో నలుగురు నిందితులను పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 12 మంది అరెస్టు కాగా.. వీరిలో 9 మందిని ఇటీవల 6 రోజులు కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన సిట్‌.. విచారణలో కీలక వివరాలు రాబట్టారు.

రిమాండ్‌లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్, రాజేందర్‌నాయక్‌ను మరోసారి 6 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయగా న్యాయస్థానం 3 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. లీకైన ప్రశ్నాపత్రాలతో పరీక్ష రాసి 100కు పైగా మార్కులు సాధించిన రమేశ్‌కుమార్, షమీమ్, సురేశ్‌ను ఈ నెల 22న సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని 7 రోజులు కస్టడీకి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

TSPSCకి ఏ శాఖతోనూ సంబంధం ఉండదు: కేటీఆర్‌

TSPSC: రద్దయిన పరీక్షలకు త్వరలోనే కొత్త తేదీల ప్రకటన..!

'సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్జితో విచారణే ముద్దు'

Last Updated :Mar 26, 2023, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.