ETV Bharat / state

'సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్జితో విచారణే ముద్దు'

author img

By

Published : Mar 25, 2023, 2:30 PM IST

BJP Maha Dharna : దేశంలో తొలి రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన తొలి రైల్వే మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రీని స్ఫూర్తిగా తీసుకుని కేటీఆర్ రాజీనామా చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. బీజేపీ నిరుద్యోగ మహా ధర్నాలో పాల్గొన్న ఆయన.. పేపర్​ లీకేజీ కేసులో విచారణ పూర్తి కాకుండానే.. ఇద్దరే దోషులని కేటీఆర్​ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ను సిట్​ అధికారులు ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు.

Etala Rajender
Etala Rajender

BJP Maha Dharna : టీఎస్​పీఎస్సీలో కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించారంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉందా అని హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ నిలదీశారు. బీజేపీ చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించినట్లు తెలిపారు. 'ఆనాడు ఏ ఉద్యోగాలొస్తాయని సంబురపడ్డామో.. వాటి సంగతి అటుంచితే ఉన్న ఉద్యోగాలను ప్రభుత్వం ఊడగొడుతోందని' ఆయన మండిపడ్డారు.

ఐటీ, ఫార్మా సహా హైదరాబాద్ కంపెనీలతో పాటు సింగరేణి ద్వారా లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆనాడు చెప్పారని ఈటల పేర్కొన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండొద్దని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ వాటిని రద్దు చేయకపోగా.. ప్రభుత్వ శాఖలన్నింటిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనే నియమించారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులంతా బీఆర్​ఎస్​కు వ్యతిరేకంగా ఉన్నారనే భయంతోనే ఎన్నికల ఏడాదిలో విద్యార్థులు కోచింగ్​ సెంటర్లలో బిజీగా ఉండాలని వరుస నోటిఫికేషన్లు ప్రకటించారని అన్నారు.

గత నాలుగేళ్లలో 11 వేలకు మించి ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదంటే.. నిరుద్యోగులపై కేసీఆర్​కు ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతోందని విమర్శించారు. దిల్లీ లిక్కర్​ కేసులో ఎమ్మెల్సీ కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ యత్నిస్తున్నారే తప్ప.. నిరుద్యోగుల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

"జీహెచ్ఎంసీ ఉద్యోగులు సమ్మె చేస్తే కలం పోటుతో 17 వందల మందిని తీసేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్లను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు. దీంతో 39 మంది కార్మికులు గుండెపోటుతో చనిపోయారు. సింగరేణిలో ఉన్న ఉద్యోగాలను కుదించేశారు. టీఎస్​పీఎస్సీ కమిషన్ ఛైర్మన్​ను నియమించింది కేసీఆర్​ కదా..? నమ్ముకున్న వాళ్లను ఎందుకు మోసం చేశారో ఆలోచించండి. 30 లక్షల మంది యువత కన్నీళ్లు పెడుతున్నారు."- ఈటల రాజేందర్​, బీజేపీ ఎమ్మెల్యే

కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే రఘునందన్​రావు​.. కేసీఆర్ ఈ మధ్య కాంగ్రెస్​ను బాగా పొగుడుతున్నారని.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అంటున్నారని అన్నారు. కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే.. కాంగ్రెస్​తో కలిసి బీఆర్​ఎస్​ ఎంపీలంతా రాజీనామా చేసి సంఘీభావం తెలిపాలని సూచించారు. కేసీఆర్​ 9 మంది ఎంపీలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రావాలని సవాల్​ విసిరారు.

"టీఎస్​పీఎస్సీ తాళాలున్న కమిషన్ సెక్రటరీ వద్దకు ఇప్పటి వరకు సిట్ అధికారులు ఎందుకు వెళ్లలేదు. టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ను ఇంత వరకు సిట్ అధికారులు ఎందుకు విచారించలేదు? నోటీసులు ఎందుకు ఇవ్వలేదు. అందుకే మాకు సిట్​పై నమ్మకం లేదు. ఇద్దరి తప్పిదాల వల్లే లీకేజీ జరిగిందన్న కేటీఆర్.. విచారణ పూర్తికాకముందే ఇద్దరే దోషులని ఎలా ప్రకటించారు. సిట్ వద్దు.. సిట్టింగ్ జడ్జితో విచారణే ముద్దు అన్నదే బీజేపీ నినాదం".- రఘునందన్​, బీజేపీ ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు.. కొత్త డేట్​ ఇదే

TSPSC లీకేజీ వ్యవహారం.. ప్రశ్నాపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయి?

ఆరోపణలు నిరూపించకపోతే రేవంత్, బండి జైలుకు వెళ్లాల్సిందే: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.